కరామా

3 Nov, 2019 04:32 IST|Sakshi

చర్చి ఆవరణలో గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటున్న కేరళ, ఆంధ్రప్రదేశ్‌ మహిళలల్లో.. కరుణను వెదుక్కోసాగాడు గంగాధర్‌. అతణ్ణి చూసిన కరుణ ‘‘గంగాధర్‌...’’ అని పిలుస్తూ చేయి ఊపింది. తన పేరు వినిపించిన వైపు వెళ్లాడు.  ‘‘మస్తు సేపట్నించి నిలబడ్డవా?’’ అడిగాడు. ‘‘లేదు ఇప్పుడే అయిపోయింది’’ అంది అతణ్ణి చేరుకుంటూ. చలికాలపు ఉదయం వాతావరణం ఆహ్లాదంగా ఉంది. ఇద్దరి నడక ఒక్కటిగానే సాగుతున్నా.. మనసుల్లో వేర్వేరు ఆలోచనలు!  ‘‘ఎట్ల మొదలు వెట్టాలే?’’ అని గంగాధర్‌లో, ‘‘తను చెప్పేవాటికి ఒప్పు కుంటాడో లేదో?’’ అని లక్ష్మీ కరుణలో ఒకరకమైన అంతర్మ థనం! ‘‘సమర్‌ ఖండ్‌కి పోదామా?’’ అడిగాడు. సరే అన్నట్టుగా తలూపింది ఆమె.  ‘‘ఆ హోటల్‌లో పనిచేస్తున్న ఫ్రెండ్‌.. కరామాలో బంకర్‌..’’ అని నాలుక్కర్చుకున్నాడు.  ఆ చివరి మాట విననట్టే నటించింది ఆమె. ఇంకా చెప్పాలంటే ఆ మాటతో ఒక ధైర్యం కూడా వచ్చినట్టయింది ఆమెకు. తేలికగా శ్వాసను వదులుతూ హాయిగా నిట్టూర్చింది. అంతలోకే మనసులో ఏదో దిగులూ మొదలైనట్టుంది.. తన కేరళ ఫ్రెండ్‌ షేర్లీ పనిచేసే షేక్‌ దగ్గరే గంగాధర్‌ కూడా పనిచేస్తున్నాడు డ్రైవర్‌గా. అట్లా షేర్లీతోనే పరిచయం అయ్యాడు.

అప్పటి నుంచి ప్రతి శుక్రవారం చర్చి దగ్గరకు వస్తున్నాడు. కలుస్తున్నాడు. అతని మనసులో ఏముందో తనకు తెలుసు.. కాని తనకిది కొత్త. దుబాయ్‌కి ఆ మాటకొస్తే గల్ఫ్‌కే తను వచ్చి యేడాది అవుతోంది. మూడేళ్ల పిల్లాడిని అమ్మ దగ్గర వదిలేసి. తాగుబోతు సచ్చినోడు.. వాడే బాగుంటే ఇక్కడ ఇలా.. ఈ దున్నపోతు పిల్లల ముడ్లు, షేక్‌ పెళ్లాల గుడ్డలు, ఎంగిలి కంచాలు కడిగే ఖర్మే పట్టేది కాదు. వాడికి కష్టపడ్డం చేతకాక తనను పంపించాడు. పిల్లాడు ఎలా ఉన్నాడో.. ఏం తింటున్నాడో...’’ అనుకుంటూంటే కళ్లల్లో నీళ్లొచ్చాయి లక్ష్మీ కరుణకు.  ‘‘కరుణా.. నా రూమ్‌ ఇక్కడ్నే’’ అంటూ తన బ్యాచలర్‌ రూమ్‌ ఉన్న రెడ్డి కంపౌండ్‌ను చూపిస్తున్న గంగాధర్‌ మాటతో తన జ్ఞాపకాలను వదిలేసింది ఆమె. సమర్‌ ఖండ్‌లోని మూల టేబుల్‌ దగ్గర ఎదురెదురుగా కూర్చున్న వాళ్లను చూసి సర్వర్‌ డ్రెస్‌లో ఉన్న ఓ వ్యక్తి వచ్చాడు.. ‘‘హలో గంగన్నా..’’అంటూ! ‘‘ఆ.. రాజేష్‌’’అంటూ ఆ వ్యక్తికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి ‘‘ కరుణ, ఆంధ్ర’’ అంటూ  పరిచయం చేశాడు. పలకరింపుగా నవ్వింది ఆమె. ‘‘టిఫిన్‌ జేస్తరు కదా..?’’ అడిగాడు రాజేష్‌. అవునన్నట్టు తలూపాడు గంగాధర్‌. ‘‘ఇడ్లీ, దోసె.. పెసరట్టు.. ’’ అంటూ అతను ఇంకేదో చెప్పబోతుంటే ‘‘పెసరట్టు, ఉప్మా’’ అన్నది లక్ష్మీ కరుణ. రాసుకుంటూ ‘‘నీకు అన్నా..’’ అడిగాడు గంగాధర్‌ను.

‘‘రెండు ఇడ్లీ, వడ తమ్మీ’’చెప్పాడు గంగాధర్‌. రాసుకొని లోపలికి వెళ్లాడు అతను. గంగాధర్‌ కళ్లకు తన కళ్లు చిక్కకుండా హోటల్‌ నాలుగు దిక్కులను, అందులోని జనాన్ని పరిశీలించడం మొదలుపెట్టింది ఆమె. గంగాధర్‌ చూపులు కరుణ మీదున్నాయి కాని.. మెదడు తన ఊళ్లోని ఇంటికి వెళ్లింది. ఇద్దరు ఆడివిల్లలు.. కొడుకు పుడ్తడు మూడో కాన్పు సూడుండ్రిరా అని అమ్మ అంటే ఇంట్ల ఎవ్వరికీ తెల్వకుండా సర్కారు దవాఖాన్ల ఆపరేషన్‌ జేసుకొని అచ్చిండు. జీవితంల ఏదన్న మంచి పని జేషిండు అంటే గదే! ఉన్న రెండకరాల పొలంకు వారసుడు లేకుండా జేషిండు కొడుకు అని అమ్మ ముక్కు చీదని చుట్టపు ఇల్లు లేదు. గల్ఫ్‌ల ఉంటున్ననని ఆ పొలంకు రైతుబంధు కూడా వస్తలేదు. ఏం జేస్తడు? మంచమున్నంతల్నే కాళ్లు జాపుకోవాల్నని బాపమ్మ జెప్తుండే. తాత ఇచ్చిన షేనుందా? బాపు సంపాదించిపెట్టిన బంగ్లలున్నయా గంపెడు పోరగాండ్లను కని సాకతందుకు? పెండ్లాం నూకితే నూరడ్డాలు వడేటట్టు ఉంటది.

ఆ బక్కపానానికి బీడీలు జేసుకుంట ఇల్లెల్లేటట్టు జూస్తుంది. తను పంపేది మిత్తీలు, అప్పులు కట్టతందుకే అయితుంది. కాపాయం దాకా రానేరాలే ఇంకా! గివన్నీ దల్సుకుంటే ఇండియాకే పోబుద్ధికాదు... ‘‘గంగన్నా...’’ అంటూ రాజేష్‌ అతని భుజం తడ్తేకాని తను దుబాయ్‌లో ఉన్న సంగతి గుర్తుకురాలేదు గంగాధర్‌కు. ‘‘ఏమైంది’’ అన్నట్టు సైగ చేసింది లక్ష్మీకరుణ. ‘‘ఏం లేదు’’ అన్నట్టు కళ్లతోనే చెప్పి ముందున్న టిఫిన్‌ ప్లేట్‌ వైపు చూశాడు. తన బ్యాగ్‌లోంచి శానిటైజర్‌ తీసి అతనికి ఇచ్చింది. చేతులు తుడుచుకొని టిఫిన్‌కు ఉపక్రమించాడు. ‘‘అన్నా.. మధు ఎరికే గదా నీకు?’’ అడిగాడు రాజేష్‌ గంగాధర్‌ పక్కనే కూర్చుంటూ.  ‘‘కోరుట్ల మ«ధే గదా..’’ నోట్లో ఇడ్లీ ముక్కతో గంగాధర్‌.

‘‘ఔనే..! గాయన, కడ్తాల్‌ శ్రీను ఇద్దరు కల్సి కరామాలో ఒక కాంప్లెక్స్‌ల అపార్ట్‌మెంట్‌ లీజ్‌కి తీస్కున్నరు. గండ్లనే ఒక బంకర్‌బెడ్‌ ఉన్నదన్నడు మధు. ఇయ్యాల నువ్వు కలుస్తవని జెప్పిన. ఫోన్‌ నంబర్‌ ఇస్త నీకు.. పొయ్యి కలువు.. ఓకే అయినట్టే’’ చెప్పాడు రాజేష్‌.  అతని మాటలు వింటూ లక్ష్మీకరుణ వంక చూశాడు గంగాధర్‌. ఆమె తల వంచుకొని ఉప్మాను పెసరట్టుతో చుడుతోంది.  ‘‘సరే’’అన్నట్టు తలూపాడు గంగాధర్‌.  ‘‘మంచిదన్నా మరి.. పోతా.. మేనేజర్‌ చూస్తే ఒర్రుతడు. మధు నంబర్‌ నీకు మెసేజ్‌ చేస్తా.. ’’ అంటూ లక్ష్మీకరుణ వైపూ తిరిగి వీడ్కోలుగా  నవ్వి.. గంగాధర్‌ ఎడమ చేయిలో చేయివేసి ‘‘ఆడికి వొయినంక ఏదన్నా ప్రాబ్లం ఉంటే కాల్‌ జెయ్‌’’ అని చెప్పి పనిలోకి వెళ్లిపోయాడు రాజేష్‌. మెట్రో స్టేషన్‌వైపు వెళ్తుంటే చెప్పింది లక్ష్మీకరుణ.. ‘‘ముందు షాపింగ్‌కి పోదాం.. ’’ అని.  అర్థమైంది గంగాధర్‌కు. లక్ష్మీకరుణను కాస్త ముందు నడవనిచ్చి జేబులోంచి పర్స్‌తీసి చూసుకున్నాడు.. అయిదు, ఇరవై నోట్ల దిర్హామ్‌ల చిన్న కట్ట ఉంది. ఊపిరి పీల్చుకొని ఆమెను అనుసరించాడు.  అంతకు ముందు సాగిన వాళ్ల అంతర్మాథ నానికి వాళ్ల ప్రయత్నం లేకుండానే పరిష్కారం దొరికి నట్టయింది.
∙సరస్వతి రమ

మరిన్ని వార్తలు