మూర్ఛకు చెక్‌ పెట్టే కొత్తిమీర!

24 Jul, 2019 11:03 IST|Sakshi

మనం నిత్యం వంటల్లో ఉపయోగించే కొత్తిమీరలో మూర్ఛవ్యాధికి చికిత్స కల్పించే మందు ఉన్నట్లు గుర్తించారు కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. మూర్ఛ లక్షణాలతోపాటు వాంతులు, వికారాలను తగ్గించేందుకు కొత్తిమీర ఉపయోగపడుతుందని చాలాకాలంగా తెలిసినప్పటికీ కచ్చితంగా ఏ మూలకం ద్వారా ఇది జరుగుతోందో మాత్రం తెలియదు. ఈ అంశాన్ని కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు. మూర్ఛ లక్షణాల్లో కొన్ని మెదడులోని కేసీఎన్‌క్యూ పొటాషియం ఛానళ్ల ద్వారా నియంత్రించబడుతున్నట్లు ఇప్పటికే తెలిసిన నేపథ్యంలో శాస్త్రవేత్తలు కొత్తిమీర ఆకులోని పదార్థాలను విశ్లేషించడం ద్వారా తమ అధ్యయనాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో కొన్ని రసాయనాలు పొటాషియం ఛానళ్లను చైతన్యపరుస్తున్నట్లు గుర్తించారు. డొడిసెనాల్‌ అనే పదార్థం పొటాషియం ఛానళ్లకు అతుక్కుపోవడం ద్వారా అవి పనిచేసేలా చేస్తున్నాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జెఫ్‌ అబోట్‌ తెలిపారు. జంతువులపై జరిగిన ప్రయోగాల్లోనూ ఈ డొడిసెనాల్‌ మూర్ఛ లక్షణాలను తగ్గిస్తున్నట్లు స్పష్టమైందని తెలిపారు. వాంతులు వికారాలకు మరింత మెరుగైన మందును తయారు చేసేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని తెలిపారు. పరిశోధన వివరాలు ఫాసెబ్‌ జర్నల్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.

మరిన్ని వార్తలు