దళిత ప్రజల ఆత్మగౌరవ గొంతుక

23 Jan, 2019 00:37 IST|Sakshi

సందర్భం

సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన సామా జిక పోరాట స్వాప్నికు రాలు, తెలుగు నేలపై బలమైన తిరుగుబాటు బావుటా ఎగరేసిన ఫైర్‌ బ్రాండ్‌ మహిళా నేత ఈశ్వరీబాయి. పాఠశాల ఉపా ధ్యాయురాలిగా, ఉద్యమ కారిణిగా, నాయకురాలిగా, స్త్రీ పక్షపాతిగా,  4 దశా బ్దాల పాటు తెలుగు సమాజంలో బహుముఖంగా పెనవేసుకుపోయిన సాహసమూర్తి ఆమె.  సికింద్రాబాద్‌ (లష్కర్‌)లోని నిజాం గ్యారెం  డెడ్‌ స్టేట్‌ రైల్వేలో గూడ్స్‌ మాస్టారుగా పనిచేసే దళిత కులానికి చెందిన బలరామస్వామి, రాములమ్మ దంపతులకు 1918 డిసెంబర్‌ 1న ఈశ్వరీబాయి జన్మించారు. ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం అనం తరం నాటి సామాజిక పరిస్థితుల వల్ల 13వ ఏటనే పుణేకి చెందిన డా‘‘ లక్ష్మినారాయణతో వివాహం జరిగింది. ఆ దంపతుల ఏకైక సంతానం జెట్టి గీత. భర్త అకాల మరణంతో తండ్రి వద్దకు వచ్చిన ఈశ్వ రీబాయి స్వతంత్రభావాలతో మెలగడమే కాకుండా ఉపాధ్యాయురాలిగా, ఉద్యోగినిగా మహిళల స్వావ లంబన దిశగా కృషి చేశారు. అగ్రకులాలు పేద ప్రజ లపై చేసే ఆధిపత్యాన్ని, అత్యాచారాలను, దాష్టీకా లను చూసి చిన్న వయసులోనే ప్రజాజీవితంలోకి ప్రవేశించారు. 1942 జూన్‌లో నాగ్‌పూర్‌లో జరిగిన అఖిల భారత ఎస్సీ కులాల సభకు హైదరాబాద్‌ రాష్ట్ర ప్రతినిధిగా హాజరై, తొలిసారిగా అంబేడ్కర్‌ని కలిశారు. అఖిల భారత ఎస్సీ ఫెడరేషన్‌ సంస్థను స్థాపించి క్రియాశీలకంగా పాల్గొన్నారు. దళితుల సమస్యల పరిష్కారం కోసం రాజకీయ అధి కారంలో భాగం కావడం ముఖ్యమని నమ్మారు. 1951లో హైదరాబాద్, సికింద్రాబాద్‌ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో చిలుకలగూడ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. 

అంబేడ్కర్‌ మరణానంతరం రిప బ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో చేరారు. 1967లో ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. 1968లో రాష్ట్రంలో దళిత ఉద్యమానికి భూమిక అనదగిన ‘కంచికచర్ల కోటేశు’ సజీవదహనం దురంతాన్ని అసెంబ్లీలో లేవనెత్తిన ఈశ్వరీబాయి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేసి అసెంబ్లీని స్తంభింపచేశారు. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ‘దొంగతనం చేసిన వాడిని సజీవ దహనం చేయకుండా ముద్దు పెట్టు కుంటారా’ అని జవాబిచ్చేసరికి మంత్రిపైకి ఆగ్ర హంతో చెప్పు విసిరి సమాధానం చెప్పారు. ఇది గందరగోళానికి దారి తీయడంతో సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రిచేత క్షమాపణ చెప్పించి, సభను, ఈశ్వరీ బాయిని శాంతింపచేశారు. నిజామాబాద్‌ ప్రాంతంలో జరిగిన అన్ని సామాజిక ఉద్యమాల్లో ఆమె చెరగని ముద్రవేశారు.

విశాఖ ఉక్కు కర్మాగార స్థాపన, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం, రాయలసీమ గ్రామాల్లో వైద్యం, తెలంగాణ జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల అధ్వాన స్థితిపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిల దీశారు. ఆంధ్రప్రదేశ్‌ మహిళా–శిశు సంక్షేమ సంస్థ అధ్యక్షురాలిగా రాష్ట్రమంతటా పర్య టించి అనేక సంస్కరణలకు ఆద్యు లయ్యారు. 1969 ప్రత్యేక తెలం గాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, ఉద్య మాన్ని బతికించడంలో ముఖ్యమైన పాత్ర పోషిం చారు. జీవితం చివరి వరకు నిరాడంబరంగా గడిపిన ఈశ్వరీ బాయి 1991 ఫిబ్రవరి 24న తుది శ్వాస విడిచారు. ఆమె కుమార్తె జెట్టి గీత తన తల్లి పేరిట స్మారకట్రస్టు ఏర్పర్చి, అంబేడ్కర్‌ అడుగజాడల్లో పనిచేస్తున్నా వారిని గుర్తించి ప్రతి ఏటా ఈశ్వరీబాయి మెమోరియల్‌ అవార్డును ప్రధానం చేస్తున్నారు. తెలంగాణ ఉద్య మంలో క్రియాశీల పాత్ర పోషించిన ఈశ్వరీబాయి సేవలను స్మరిస్తూ 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆమె జయంతి, వర్థంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వర్తిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆమె పేరును చిరస్మరణీయంగా నిలపడమే ఆమెకు ఇచ్చే నిజమైన ఘన నివాళి.
(నేడు హైదరాబాద్‌ రవీంద్రభారతిలో సాయంత్రం 5 గంటలకు ఈశ్వరీ బాయి మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరగనున్న జె.ఈశ్వరీ బాయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా)

అంగరి ప్రదీప్‌ కుమార్‌
వ్యాసకర్త రీసెర్చ్‌ స్కాలర్, ‘ఆల్‌ మాల స్టూడెంట్స్‌ అసోసియేషన్‌’ రాష్ట్ర అధ్యక్షుడు మొబైల్‌ : 95050 15502

మరిన్ని వార్తలు