ఎకరంలో 8 రకాల కూరగాయలు

10 Mar, 2020 19:14 IST|Sakshi

∙బహుళ పంటల పద్ధతిలో సేంద్రియ కూరగాయల సాగు

∙సొంత వాహనంతో పరిసర గ్రామాల్లో నేరుగా ప్రజలకు అమ్మకం

∙ఎకరంలో ఏటా రూ. 2 లక్షల నికరాదాయం

∙సేంద్రియ మహిళా రైతు ఈశ్వరమ్మ విజయగాథ

సేంద్రియ బహుళ పంటల పద్ధతిలో కూరగాయలను సాగు చేస్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇస్కిళ్ల గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ. సేంద్రియ ఎరువులు, జీవామృతంను ఉపయోగిస్తూ ఎకరం విస్తీర్ణంలో ఏడాదికి 3 లక్షల రూపాయల దిగుబడిని సాధిస్తూ ఆదర్శంగా నిలిచింది ఈశ్వరమ్మ. 

రామన్నపేట మండలం పల్లివాడ గ్రామానికి చెందిన కల్లెం భీమలింగం – ఈశ్వరమ్మ దంపతులు ఐదు సంవత్సరాల క్రితం అదే మండలంలోని ఇస్కిళ్ల గ్రామానికి వలస వెళ్లారు. డ్రిప్‌ డీలర్‌ అయిన భీమలింగం ఇస్కిళ్ల – ఉత్తటూరు గ్రామాల మధ్య 3.29 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. ఆ భూమిని సాగు చేసే బాధ్యతను భార్య ఈశ్వరమ్మకు అప్పగించాడు. నిరక్ష్యరాస్యులైన ఈశ్వరమ్మ భర్త ప్రోత్సాహంతో నాబార్డు వారు పంటల సాగుపై ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సులకు హాజరై వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నది. పంటల సాగుపై అవగాహన తరగతులు బోధించే రమేష్‌ ప్రోత్సాహంతో బహుళ పంటల విధానంలో కూరగాయలను సాగు చేయడం ప్రారంభించింది. 


తమ వ్యవసాయ భూమిలో ఎకరంలో కూరగాయలు సాగు చేస్తున్నారు. ఐదు ట్రాక్టర్ల పశువుల ఎరువును పొలంలో చల్లి మెత్తగా దున్నించి ట్రాక్టర్‌తోనే 4 అడుగుల ఎడంలో బోదెలు(మట్టి కట్టలు) పోయించారు. ఐదు వరుసలకు ఒక పంట చొప్పున మిర్చి, వంకాయ, కాకర, టమాట, బీర, సొర, దోస, బంతి వంటి ఎనిమిది రకాల కూరగాయలను సాగు చేశారు. హైదరాబాద్‌లోని నర్సరీల నుంచి తెచ్చిన నారు, విత్తనాలు విత్తారు. 

భూమిలో తేమ తొందరగా ఆవిరైపోకుండా, కూరగాయలు నేలను తాకి చెడిపోకుండా, మొక్కలకు వైరస్‌ సోకకుండా ఉండేందుకు బోదెలపై మల్చింగ్‌ షీట్‌ను పరిచారు. డ్రిప్‌ను అమర్చి మొక్కలకు నీరందించే ఏర్పాటు చేశారు. తీగ జాతి మొక్కలు ఏపుగా పెరగడంతోపాటు, కాయల బరువుకు మొక్కలు నేలను తాకకుండా ఉండేందుకు గాను వెదురు బొంగులను నాటి బైండింగ్‌ వైరుతోపాటు, సుతిలి తాడును అల్లారు. 

ప్రతీ ఐదు బోదెలకు ఒక వరుసతో పాటు, పొలం చుట్టూ బంతి పూల మొక్కలు పెట్టారు. కూరగాయల మొక్కలకు వచ్చే చీడపీడలను ముందుగానే బంతి మొక్కల ద్వారా గుర్తించి కషాయాలను పిచికారీ చేస్తూ సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. 

కూరగాయల రకాన్ని బట్టి నాటిన నలభై ఐదు రోజుల నుంచి తొమ్మిది నెలల వరకు పంట దిగుబడి వస్తుంది.  ఏదేని ఒక రకం  పంట కాలం ముగియగానే.. చదును చేసి బోదెలు పోసి పంట మార్పిడి చేసి.. మరో రకం కూరగాయ మొక్కలు నాటుతున్నారు. 

పండించిన కూరగాయలను తమ టాటాఏస్‌ వాహనంలో తీసుకువెళ్లి  పరిసర గ్రామాల్లో దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రజలకు అమ్ముతుండటం విశేషం. ఈ విధంగా సంవత్సరానికి రూ. 3 లక్షల ఆదాయం పొందుతున్నారు. పెట్టుబడి పోను రూ. రెండు లక్షల వరకు నికరాదాయాన్ని ఆర్జిస్తున్నట్లు ఈశ్వరమ్మ తెలిపారు. 
సేంద్రియ పద్దతుల్లో కూరగాయలను సాగు చేస్తూ నేరుగా ప్రజలకు విక్రయిస్తున్న ఈశ్వరమ్మ గత ఏడాది జిల్లా స్థాయిలో ఉత్తమ మహిళా రైతుగా ఎంపికై కలెక్టర్‌ చేతుల మీదుగా అవార్డును పొందింది. గత అక్టోబర్‌లో నాబార్డు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో సేంద్రియ పంటల ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. 
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈశ్వరమ్మ ఒక్కరికే స్టాల్‌ను ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌ ఈశ్వరమ్మ సేంద్రియ కూరగాయల స్టాల్‌ను సందర్శించి, ఆమె కృషిని అభినందించారు. 
(ఈశ్వరమ్మ భర్త భీమలింగంను 96668 46907 నంబరులో సంప్రదించవచ్చు)
– కనుతాల శశిధర్‌రెడ్డి, 
సాక్షి, రామన్నపేట, యాదాద్రి భువనగిరి జిల్లా 

మరిన్ని వార్తలు