ప్రపంచానికి వరం పునరుత్థాన శక్తి

21 Apr, 2019 00:31 IST|Sakshi

రెండువేల యేళ్ళనాటి ఈస్టర్‌ రోజున, మొదట యేసుక్రీస్తు ఉదయించాడు, ఆ తర్వాతే ఆరోజున సూర్యుడు ఉదయించాడు. సూర్యోదయానికి పూర్వమే చీకటితోనే ప్రభువు సమాధి వద్దకు వెళ్లిన విశ్వాసులైన కొందరు స్త్రీలకు అక్కడ తెరువబడి ఉన్న సమాధి దర్శనమిచ్చింది. శుక్రవారం నాడు అసంపూర్తిగా మిగిలిన పరిమళ క్రియల్ని యేసు దేహానికి సంపూర్తి చేసేందుకు వాళ్ళు వెళ్లారు. సమాధికి అడ్డుగా రోమా ప్రభుత్వం ఒక పెద్దబండ రాయిని పెట్టి దానికి ముద్రవేసి అక్కడ కావలి వారిని కూడా పెట్టింది. తీరా స్త్రీలు అక్కడికెళ్తే, అడ్డు రాయి తొలగించబడి ఉంది, కావలివారు లేరు, స్త్రీలలో ఒకరైన మగ్దలీనా మరియ అది చూసి కంగారుపడి పరిగెత్తుకుని వెళ్లి పేతురు, యోహాను అనే ఇద్దరు శిష్యులకు ప్రభువు దేహాన్నెవరో ఎత్తుకెళ్లారని చెప్పి వారితోపాటు మళ్ళీ వచ్చి చూసింది. సమాధిలో ప్రభువు దేహం లేదు. సమాధి చేయడానికి ముందు శుక్రవారం నాడు ఆయనకు తొడిగిన నారబట్టలు మాత్రం సమాధిలో పడి ఉన్నాయి.

ఆమెకు దుఃఖం ఆగలేదు. మగ్దలీనా మరియ అక్కడే రోదిస్తుండగా ‘అమ్మా ఏడుస్తున్నావెందుకు? ఎవరికోసం వెదుకుతున్నావు?’అని ఎంతో అనునయంగా తనను అడుగుతున్న ఒక వ్యక్తి సమాధి వద్ద కనిపించాడు. చీకట్లో అతను తోటమాలీ కావచ్చనుకొని ‘అయ్యా, నా ప్రభువు దేహాన్ని నీవేమైనా మోసుకెళ్లి ఇంకెక్కడైనా పెట్టావా?’ అనడిగింది మరియ. వెంటనే ‘మరియా’ అని ఆయన పిలువగా ఆయనే ప్రభువని గుర్తించి ‘రబ్బూనీ’ అంటే హెబ్రీ భాషలో ‘బోధకుడా’ అని ఆమె బదులిచ్చింది. మగ్దలీనా మరియకు యేసుప్రభువు ఆనాడు తనను తాను సజీవుడుగా కనపర్చుకోవడంతో ఈస్టర్‌ నవశకం ఆరంభమయ్యింది. శుక్రవారం నాడాయన అత్యంత బలహీనుడు, నిస్సహాయుడు, రోమా ప్రభుత్వం దృష్టిలో నేరస్థుడు, యూదుమతాధిపతుల దృష్టిలో దైవ ద్రోహి.

పైగా అంతా చూస్తుండగానే సిలువలో ఆయన మరణించాడు, పలువురి సమక్షంలో రోమా ప్రభుత్వం కనుసన్నల్లో ఆయన సమాధి కార్యక్రమం జరిగింది. ఆదివారం ఉదయం నాటికి ఆయన మళ్ళీ సజీవుడయ్యాడు. తన వాళ్లందరికీ సజీవుడై కనిపించాడు, మళ్ళీ ఎన్నో అద్భుతకార్యాలు కూడా చేసి తన శిష్యులకు, అనుచరులకు స్పష్టంగా దిశానిర్దేశం చేసి 40వ రోజున పరలోకానికి ఆరోహణుడయ్యాడు. దిశానిర్దేశం చెయ్యడమేంటే, ప్రభువు తన పునరుత్థాన శక్తిలో వారిని అంతర్భాగం చేశాడు. ‘మీరు త్వరలో పరిశుద్ధాత్మ శక్తి తో నింపబడేవరకు యెరూషలేములోనే కనిపెట్టి ఉండండి. ఆ తర్వాత భూదిగంతాలదాకా నాకు మీరు సాక్షులవుతారు’ అని ప్రభువు వారికి తెలిపాడు (అపో.కా .1:8). అలా ఆరంభమైన ఆదిమ చర్చి ఆ పునరుత్థానశక్తితోనే పరవళ్లు తొక్కి, ప్రభువుకోసం నవ్వుతూనే ప్రాణత్యాగం చెయ్యడానికి కూడా సంసిద్ధమయ్యింది.

ఆ శక్తితోనే అనూహ్యంగా విస్తరించింది. పరిశుద్ధాత్మశక్తి కేవలం భాషల్లో మాట్లాడేందుకు, అద్భుతాలు, స్వస్థతలు చేసేందుకే తోడ్పడుతుందనుకోవడం, కిటికీలోంచి గదిలోకి వస్తున్న సూర్యకిరణాలు కేవలం గదిని వెలుగుతో నింపడానికేనని అనుకోవడం లాంటి సంకుచితమైన అవగాహన. సూర్యుడు తన కిరణాలతో మన గదిలో వెలుగు నింపుతాడు సరే, కానీ విశ్వానికంతటికీ జీవప్రదాత ఆ సూర్యుడే అని, సూర్యుడు లేకపోతే జీవకోటికి మనుగడే లేదని ముందు తెలుసుకోవాలి. అపవిత్రత అంటకుండా జీవించడానికి ఆదిమ చర్చికి ఆ శక్తే తోడ్పడింది. తమకున్నదేదీ తమది కాదని, అదంతా సమిష్టి సొత్తని భావించి ఒకరిపట్ల ఒకరు అద్భుతమైన ప్రేమానురాగాలతో వాళ్ళు జీవించింది కూడా పరిశుద్ధాత్మ శక్తిగా ప్రభువు నిర్వచించి వారందరికీ భాగస్వామ్యాన్నిచ్చింది పునరుత్థానశక్తితోనే!! అదే శక్తిని కొన్నాళ్ల తర్వాత పొందిన అపొస్తలుడైన పౌలు కూడా ‘నాకు లోకసంబంధంగా లాభకరమైన వాటినన్నింటినీ నష్టంగా ఎంచుకున్నాను.

ఆయన పునరుత్థానబలాన్ని తెలుసుకోవడానికి సమస్తాన్ని మలంతో సమానంగా ఎంచుకొంటున్నాను’ అన్నది  కూడా ఆ పునరుత్థాన శక్తితోనే (ఫిలిప్పి 3:7–11). ఈస్టర్‌ ఆదివారం ఉదయం నాటి ఈ పునరుత్థానశక్తి చేత కొత్త నిబంధన యుగపు విశ్వాసులంతా నింపబడాలన్నది యేసుక్రీస్తు అభిమతం. పౌలు పత్రికల్లో పౌలు ద్వారా తన ఈ అభిలాషను ప్రభువు వ్యక్తం చేశాడు. ప్రభువు పునరుత్థాన శక్తినెరుగని, ఆ శక్తిని పొందడం ఎంత అత్యవసరమో అవగాహన లేని చర్చి ఎంత పెద్దదైనా, ఆ చర్చిలో వేలు, లక్షలమంది విశ్వాసులున్నా అది నిర్జీవమైనదే, నిస్సారమైనదే. యేసు పునరుత్థానుడైన తర్వాత పేతురు తదితర శిష్యులకు ప్రభువు కళ్ళలో కళ్ళు పెట్టి చూసే స్థైర్యం కరువయింది. ఎందుకంటే వాళ్లంతా ఆయన్ను వదిలేసి ప్రాణభయంతో పారిపోయారు.

ఇపుడు ఏ మొహం పెట్టుకొని ఆయనతో మళ్ళీ జత కలుస్తారు? అందువల్ల పేతురు గలిలయ సరస్సులో చేపలు పట్టే పనికి మళ్ళీ వెళ్లిపోదామనంటే మిగిలిన శిష్యులు కూడా ఆయనతో వెళ్లిపోయారు. కాని యేసుప్రభువు ప్రేమతో వెళ్లి వారిని అక్కడే కలుసుకున్నాడు. గలిలయ సరస్సులో చేపలు పడుతున్న శిష్యులకు ముఖ్యంగా పేతురుకు ఆయన సాక్షాత్కారం అలా లభించింది. వారిని ప్రభువు మళ్ళీ తన పరిచర్యకు పిలుచుకొని ఈసారి వారిని తన పునరుత్థాన శక్తితో నింపి అజేయులను చేశాడు. దేవుని పేరుతో లోకంలోని మంచివాటిని సంపాదించుకో వడానికి మామూలు శక్తియుక్తులు చాలు.

 కానీ లోకాన్ని ఆయన ప్రేమ, క్షమాపణ, సమాధానంతో నింపడానికి మాత్రం చాలా త్యాగపూరితమైన జీవితం, పరిచర్య అవసరం. అది ప్రభువిచ్చే పునరుత్థానశక్తితోనే సాధ్యం. దేవుని పేరుతో ఎన్నెన్నో కూడబెట్టుకోవాలి అ నుకునేవారికి, దేవునికోసం అన్నింటినీ నష్టపర్చుకొని, వ్యయపర్చుకొని, పోగొట్టుకునేవారికి, లోకశక్తికి, పునరుత్థాన శక్తికి ఉన్నంత తేడా ఉంది.  ఒక పెద్ద బండరాయిని కొండమీదినుండి కిందికి తొయ్యడానికి ఎంతో బలం కావాలి. కాని అదే బండరాయిని భూమ్మీదినుండి కొండమీదికి దొర్లించుకు పోవడానికి మాత్రం పునరుత్థాన శక్తి కావాలి. క్రీస్తు తన పునరుత్థానం ద్వారా ఈ లోకానికిచ్చినది ఆ శక్తే!!! హ్యాపీ ఈస్టర్‌....
రెవ. డా. టి.ఎ.ప్రభుకిరణ్‌
email: prabhukirant@gmail.com

స్కాట్లాండ్‌ దేశంలో జాన్‌ జి. ప్యాటన్‌ 13 మంది పిల్లలున్న ఒక నిరుపేద కుటుంబంలో 1824లో జన్మించాడు. చాలా చిన్నతనంలోనే ప్రభువును ఎరిగాడు. ప్రభువు పరిచర్య కోసం సిద్ధపడ్డాడు. ఇపుడు మనం వెస్టిండీస్‌ గా పిలుస్తున్న నల్లజాతీయులుండే ‘కెరీబియన్‌ దీవులకు’ తనను దయచేసి తనను పంపమని తన చర్చి ముఖ్యాధికారికి ఉత్తరం రాశాడు.‘నీకేమైనా పిచ్చా? అక్కడికి వెళ్లిన మన మిషనేరీలను 19 ఏళ్ళ క్రితమే అక్కడి నరమాంసభక్షకులు చంపుకొని తిన్నారని నీకు తెలియదా? వెళ్లిన మరుక్షణమే నిన్ను కూడా వాళ్ళు చంపుకు తినేస్తారు జాగ్రత్త. కావాలంటే సురక్షితమైన, సుఖవంతమైన మరో స్థలానికి నిన్ను పంపుతాను’ అని జవాబిచ్చాడు డిక్సన్‌ అనే ఆ వృద్ధ మిషనేరీ. ‘కుదరదు. నేనక్కడికే వెళ్తాను. నా మృతదేహాన్ని భూమిలో పురుగులు తింటాయా, లేక నరమాంసభక్షకులు తింటారా? అన్నది నాకు చాలా చిన్న విషయం. చీకట్లో ఉన్న ప్రజలను దేవుని వెలుగులోకి తేవడమే నా జీవిత లక్ష్యం. అందుకు నాకు ప్రభువువారి పునరుత్థాన శక్తి తోడుగా ఉంటుంది. దయచేసి నన్ను అక్కడికే పంపండి’ అని ప్యాటన్‌ ఆయనకు మరో ఉత్తరం రాశాడు.

ఎట్టకేలకు ప్యాటన్‌ 32 ఏళ్ళ వయసులో తన్నా అనే కెరీబియన్‌ దీవిలో తన భార్య మేరీతో సహా కాలుబెట్టాడు. అలా అనడం కంటే,  కష్టాల కొలిమిలో కాలుబెట్టాడనడం ఉచితమేమో. నరమాంసభక్షకులైన దాదాపు 4000 మంది నల్లజాతీయులు ఆ దీవిలో ఉంటే, వారి నుండి తనను తాను రక్షించుకోవడమే తొలి రోజుల్లో అతనికి ప్రధాన వ్యాపకంగా ఉండేది. అయినా వారిమధ్య ధైర్యంగా తన పరిచర్య కొనసాగించాడు. వారికి బట్టలేసుకోవడం దగ్గరినుండి నాగరికతనంతా నేర్పించాడు. ఈలోగా ఆయన భార్య, కుమారుడు నిమోనియాతో వారం రోజుల వ్యవధిలో చనిపోతే తానుండే ఇంటిపక్కనే తానే స్వయంగా తవ్వి వారిని భూస్థాపన చేశాడు. ఎన్నో రాత్రులపాటు ఆ సమాధుల వద్ద ఒంటరితనంతో రోదిస్తూ గడిపాడు.

ఇప్పటికైనా స్వదేశానికి వచ్చెయ్యమన్నారు పెద్దలు. కానీ అది మాత్రం జరగదన్నాడు. ఆ ద్వీపవాసులకు సువార్త చెబుతూనే వారి భాషను నేర్చుకొని వారి భాషకు లిపిని తయారుచేసి, ఆ లిపిని వారికి నేర్పించి ఆ భాషలోకి బైబిల్‌ను అనువదించాడు. అలా అక్షరాస్యతా ఉద్యమాన్ని అక్కడ ఆరంభించాడు. కెరిబియన్‌ దీవులన్నింటిలో అలా సువార్త ఉద్యమం, సాక్షరతా ఉద్యమం, నాగరికతా ఉద్యమం ఒకేసారి వ్యాపించాయి. ఒక్కరొక్కరుగా ఆ దీవుల్లోని వాళ్లంతా నరమాంసభక్షణ మానేసి యేసుప్రభువు రక్షణలోకి వచ్చి దేవుని ఆరాధకులుగా మారారు. ఆయన మరణించేనాటికి అంటే 1907 నాటికి ఆ దీవులన్నీ, సువార్తతో, అక్షరాస్యతతో, నాగరికతతో నిండిపోయాయి. కేవలం ఒకే ఒక వ్యక్తి ప్రభువువారి పునరుత్థాన శక్తితో నింపబడితే వచ్చిన విప్లవాత్మకమైన మార్పులివి. 

మరిన్ని వార్తలు