నా చెవులకు కళ్లున్నాయ్‌ నా చేతులు చూస్తున్నాయ్‌

15 Mar, 2019 01:58 IST|Sakshi

స్త్రీ శక్తి

‘నా చెవులకు కనులున్నాయ్‌.. నా చేతులు చూస్తున్నాయ్‌. తెలుసు నాకు వెలుగేదో.. తెలుసు నాకు చీకటేదో..’ అనే కవి మాటలే స్ఫూర్తిగా ఆమె ముందుకు కదిలారు. ఆమె పుట్టుకతోనే లోకం చూడని అంధురాలు. చదువుకుంటానని అంటే కుటుంబ సభ్యులు ‘అయ్యో తల్లీ’ అని ఆవేదన చెందారు. సమాజమైతే.. ‘అసలే ఆడపిల్లవు.. ఆపై అంధురాలవు. నీకెందుకు చదువు’ అంటూ నిరుత్సాహపరిచింది. అయినా పట్టుదల, ఆత్మవిశ్వాసమే నేత్రాలుగా చేసుకుంటూ.. ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకెళ్లారు. బీఏ, బీఈడీ, ఎం.ఎ., న్యాయశాస్త్రం, ఎంఫిల్, పీహెచ్‌డీ.. ఇలా డిగ్రీలు పొందుతూ.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా జీవితం సాగిస్తున్నారు. అక్కడితో ఆగిపోలేదు. భగవద్గీత మొత్తాన్నీ బ్రెయిలీలో లిఖించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ పరిణామ క్రమంలో తనకు ఎదురైన జీవితానుభావాలను సాక్షి ‘ఫ్యామిలీ’తో పంచుకున్నారు లక్ష్మీనారాయణమ్మ. 

‘నీ ఇష్టం’ అని ఫోన్‌ పెట్టేశారు
‘‘మాది విశాఖనగరమే అయినా... నాన్నగారు కలకత్తాలో రైల్వే ఉద్యోగి. నేను చదువుతానని చెప్పినప్పుడు ఇంట్లోవాళ్లు అడ్డు చెప్పారు. మా ఇంట్లో ఇద్దరు పిన్నిలు, మామయ్య కూడా అంధులే. వారు మాత్రం నన్ను ప్రోత్సహించారు. చదువుకోకపోవడం వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాం. అందుకే అమ్మాయిని చదువుకోడానికి పంపించండని నాన్నతో చెప్పడంతో హైదరాబాద్‌లోని అంధుల పాఠశాలలో చేర్పించారు. బాలురు, బాలికలకు కలిపి ఒకే పాఠశాల ఉండేది. రెండవ తరగతిలోనే ఎస్‌ఎఫ్‌ఐతో కలిసి బాల బాలికలకు వేర్వేరు పాఠశాలలు కావాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా, నిరాహార దీక్షలో పాల్గొన్నాను. అప్పటి గవర్నర్‌ శారదాముఖర్జీ స్పందించి అంధ బాలికల కోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేశారు.

పదో తరగతి వరకూ అక్కడే చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ విశాఖలోని బీవీకే కళాశాలలో పూర్తి చేశాను. డిగ్రీ చదువుతున్నప్పుడు జరిగే యూత్‌ ఫెస్టివల్స్‌లో పాల్గొనేదాన్ని. ఎప్పుడూ అంధుల కోసం నిర్వహించే పోటీల్లో పాల్గొనేదాన్ని కాదు. అందరితో కలిసి పాల్గొనేదాన్ని. ప్రతి పోటీలోనూ విజయం సాధించేదాన్ని. డిగ్రీ తర్వాత బీఈడీ ఎంట్రన్స్‌ రాస్తే రాష్ట్ర స్థాయిలో 16వ ర్యాంక్‌ వచ్చింది. అంధుల కోటాలో కోరుకున్న చోట సీట్‌ అని చెప్పినా.. ఆ కోటాలో వద్దని.. జనరల్‌ కోటాలో తీసుకున్నాను.

డిగ్రీ పూర్తయ్యాక చదువు చాలని ఇంట్లో వాళ్లు హెచ్చరించారు. అయినా వినకపోవడంతో నాతో మాట్లాడటం మానేశారు. బీఈడీ పూర్తయిన తర్వాత ఆసెట్‌ రాసి ఏయూలో పీజీ చదివాను. సీట్‌ వచ్చిన తర్వాత ఇంట్లోవాళ్లకు చెప్పాను. వాళ్లేం మాట్లాడలేదు. నీ ఇష్టమని చెప్పి ఫోన్‌పెట్టేశారు. ఎంఏ తెలుగు, ఎంఏ హిస్టరీల్లో ర్యాంకులు వచ్చాయి. హిస్టరీలో చేరి పీజీ పూర్తి చేసిన తర్వాత లా డిగ్రీ సాధించాను. ఆ తర్వాత ఎంఫిల్‌ చేశాను. పీహెచ్‌డీ కూడా పూర్తి చేశాను. లా ప్రాక్టీస్‌ చేద్దామని అనుకున్నాను. కానీ.. ఉపాధ్యాయ వృత్తి వైపు దారి మళ్లింది. ప్రస్తుతం విశాఖ నగరంలోని మహారాణిపేటలో ఉన్న ఎంవీడీ మున్సిపల్‌ హైస్కూల్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. 

‘లోపలికి వెళ్లిపో’ అనేవారు
అంధురాలిగా పుట్టినప్పటి నుంచే కష్టాలు కూడా నా వెంటే వచ్చాయి. చదువుకునే సమయంలో ఇంట్లో నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో ఒంటరిగా జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. పదోతరగతి పూర్తి చేసుకున్నాక ఇంటికి వెళ్లాను. ఇంటికి ఎవరైనా వస్తే.. లోపలికి వెళ్లిపో అని అనేవారు. అప్పుడు చాలా బాధపడేదాన్ని. ఎవరైనా వస్తే నేనెందుకు దాక్కోవాలి? అంధురాలిగా జన్మించడం నా తప్పా.? అందుకే.. చదువుకోవాలి, నా కాళ్లపై నేను నిలబడాలని నిశ్చయించుకున్నాను. అనేక రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్నాను. ప్రతి ప్రాంతం నాకెన్నో పాఠాలు నేర్పించింది. అంధురాల్ని చేసుకున్న నువ్వు గ్రేట్‌ అని ఎవరైనా నా భర్తను పొగిడితే.. నేను జీర్ణించుకోలేను. అందుకే.. పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను’’ అని ముగించారు లక్ష్మీనారాయణమ్మ.
కరుకోల గోపి కిశోర్‌రాజా, సాక్షి, విశాఖ


వెయ్యి గిన్నిస్‌లు ఎక్కినంత!
1991లో జనవరి 3వ తేదీన బ్రెయిలీలో భగవద్గీత రాయడం ప్రారంభించాను. ఆహారం తీసుకోకుండా, నిద్ర పోకుండా, మంచినీరు తాగకుండా 24 గంటల పాటు నిర్విరామంగా ఐదున్నర అధ్యాయాలు రాశాను. తర్వాత 1991 మార్చి 23న అక్కడినుంచి 11 వ అధ్యాయం వరకూ రాశాను. ఏకబిగిన ఇరవై ఆరున్నర గంటల పాటు రాశాను. ఇక మిగిలిన ఏడు అధ్యాయాల్ని ఒకేరోజున పూర్తి చెయ్యాలని నిర్ణయించుకొని 1992లో 11వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకూ పూర్తి చేసేశాను. ఈసారి ఏకంగా ముప్ఫైమూడున్నర గంటల సేపు రాసి విజయవంతంగా పూర్తి చేశాను. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం కోసం çపంపితే.. ఇది మతపరమైన అంశమని తోసిపుచ్చారు. నాకు చాలా బాధ అనిపించింది. కానీ.. ఇది పూర్తి చేసిన తర్వాత వచ్చిన ప్రశంసలు నాకు వెయ్యి గిన్నిస్‌ బుక్‌లు ఎక్కినంత ఆనందాన్నిచ్చాయి.
లక్ష్మీనారాయణమ్మ

►బ్రెయిలీలో భగవద్గీత
►మంచినీరు కూడా తీసుకోకుండా నిర్విరామ రచన
►అన్ని రంగాల్లో రాణించగల సత్తా  
►అంధ ఉపాధ్యాయురాలు కొల్లూరు లక్ష్మీనారాయణమ్మ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా