శెహభాష్‌ సాంబిరెడ్డి

27 Mar, 2018 01:16 IST|Sakshi
ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన కూరగాయలను తన పొలం గట్టు మీదనే తూకం వేసి అమ్ముతున్న సాంబిరెడ్డి

నా పంట.. నా ధర!

బయట మార్కెట్‌ ధర పెరిగినా తగ్గినా.. ఏడాది మొత్తం అదే ధర

ప్రకృతి వ్యవసాయదారుడు చెప్పిన ధరకే పొలం దగ్గరకే వచ్చి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు

వంగా సాంబిరెడ్డి స్వగ్రామం గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని వల్లభాపురం. కూరగాయల దగ్గర్నుంచి బియ్యం, పసుపు, కందుల వరకు ఇంటికి అవసరమైన చాలా రకాల ఆహార పంటలను సాగు చేస్తున్నారు. ఏడాదిలో ఏ రోజైనా మార్కెట్‌ ధరతో నిమిత్తం లేకుండా రైతు ధరకే తీసుకెళుతున్నారు. విజయవాడ, గుంటూరు నగరాల నుంచి వ్యాపారులు చేను వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. పెట్టుబడులు పెరిగి పుట్టెడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయరంగంలో ఈ రైతు సాధించిన విజయం అద్భుతం. అదెలాగో ఆయన మాటల్లోనే...

బీటెక్‌ చదివి ఎంబెడెడ్‌ ఇంజనీరుగా చెన్నైలో మూడు దశాబ్దాలు సాఫ్ట్‌వేర్‌ సంస్థను నడిపాను. స్వస్థలం వల్లభాపురంలో పెద్దల్నుంచి వచ్చిన భూమి కౌలుకిస్తే ఫలసాయం పెద్దగా లేకపోగా, రసాయనాల వాడకంతో ఏటికేడాది సారం తగ్గిపోతోంది. బాధనిపించింది. కంపెనీని కుటుంబసభ్యుల కప్పగించి వచ్చేశాను. భూమి ఆరోగ్యం మెరుగుపడితేనే ఏదైనా సాధించగలం అనిపించింది. ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాను. ఇంటర్నెట్‌లో ప్రకృతి వ్యవసాయ సూత్రాలను అధ్యయనం చేస్తూ, సాగుకు ఉప్రకమించాను. అయిదేళ్లుగా కష్టనష్టాలకోర్చి చేసిన వ్యవసాయానికి తగ్గ ఫలితాలను ఏడాదిగా చవిచూస్తున్నా..

సహజసిద్ధంగా పంటల సాగు...
టూత్‌పేస్ట్‌తో సహా తయారీ రంగంలోని ఏ వస్తువుకైనా గరిష్ట చిల్లర ధర(ఎంఆర్‌పీ)ను ఆయా కంపెనీలే నిర్ణయిస్తున్నపుడు.. పండించిన పంట ధరను నిర్ణయించటానికి రైతులకు అవకాశం ఎందుకు ఉండటం లేదనే ప్రశ్న నా మనసును వేధిస్తుండేది. ఆరోగ్యకరంగా పండించిన నాణ్యత కలిగిన పంటను తీసుకురాగలిగితే, అమ్మకానికి ఢోకా ఉండదు, పైపెచ్చు వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడినట్టు అవుతుందని భావించాను. ఇందుకు ప్రకృతి వ్యవసాయం భేషైన పరిష్కారంగా తోచింది.

                   చిక్కుడు పొలంలో సాంబిరెడ్డి

మాకున్న 30 ఎకరాల పొలంలో బిందు సేద్య పద్ధతిలో నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకొని.. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటల సాగుకు ఐదేళ్ల క్రితం ఉప్రకమించాను. రసాయనాల ప్రభావం తగ్గిపోయి, భూమి పూర్తిస్థాయి సహజ స్వభావాన్ని సంతరించుకోవటానికి నాలుగేళ్లు పట్టింది. తెగుళ్లు, పురుగు రాకుండా భూమి నిరోధకశక్తి పెరిగింది. ఏడాది నుంచి గుంటూరు, విజయవాడ, మంగళగిరి, కుంచనపల్లి నుంచి వ్యాపారులు మా పొలం దగ్గరకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు.

కూరగాయలేవైనా కిలో ధర రూ. 30..ఏడాది మొత్తం ఒకటే ధర
మరో ఆరు ఎకరాలు తీసుకుని మొత్తం 36 ఎకరాల వ్యవసాయం చేస్తున్నా.  పోషకాలు ఎక్కువగా ఉండే బ్లాక్‌ రైస్, గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండే రకం ఆర్‌ఎన్‌ఆర్‌ 15048, సన్నాలు (005), ప్రగతి రకం (కుర్కుమిన్‌ 4.62 శాతం) పసుపు, మినుములు, పెసలు, కందులు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, శెనగ, ఉలవలు సాగు చేస్తున్నాను. వీటికి తోడు బొప్పాయి, కూర అరటి, దానిమ్మ సాగు చేయబోతున్నాను. 

సీజనువారీగా చాలా రకాల కూరగాయలు పండిస్తున్నాను. ప్రస్తుతం వంకాయ, టొమాటో, గోరుచిక్కుడు, పచ్చిమిర్చి, పండుమిర్చి, కాప్సికం, బీట్‌రూట్, క్యారట్, ముల్లంగి, దోస, సొరకాయ ఉన్నాయి. తర్వాతి సీజనులో బీర, పొట్లకాయ, సొరకాయ, కాకరకాయ వేస్తాం. ఏ కూరగాయ అయినా కిలో రూ.30 ధర నిర్ణయించాను. మార్కెట్‌లో కిలో రూ.10 అయినా, రూ.60కి పెరిగినా నా ధరలో మార్పుండదు. పండించే పంటకు కనీస ధర ఎంతన్నది ముందు తెలిస్తే భరోసా ఉంటుంది కదా!

ఎర పంటలతో సమగ్ర సస్య రక్షణ..
మన భూమి ఎంత ఆర్గానిక్‌ అయినా పరిసరాల్లోని పొలాల్లోంచి తెగుళ్లు, పురుగు వచ్చే అవకాశం ఉంది. సమగ్ర సస్య రక్షణ చేస్తున్నాం. క్యాబేజి, కాలీఫ్లవర్‌ను ఆశించే పురుగులను ఆకర్షించేందుకు చేను మధ్యలో అక్కడక్కడా ఆవాలు పంట వేస్తున్నా. వాటికి ఆహారంగా ఆవాలు పంటను ఇచ్చి, ప్రధాన పైరును నిరపాయకరంగా తీసుకుంటున్నా. తులసి, కొత్తిమీర, సోంపు, జీలకర్ర, వాము వంటి మొక్కలు తమ వాసనతో పురుగులను నిరోధిస్తాయి. ఇవి పంట నివ్వటమే కాదు, ఇతర పంటల రక్షణకు ఉపయోగపడుతున్నాయి.

అలాగే ఎర పంటలు... టొమాటోకు బంతి, వంగకు బెండ.. ఇలా ఒక్కో పంటకు ఒక్కో ఎర పంటను ఉంచుతూ పంట సరిహద్దుల్లో ప్రధాన పైరుకన్నా ఎక్కువ ఎత్తులో ఉండే జొన్న/ మొక్కజొన్న, మొత్తం చేను చుట్టూ అవిశె తోటను పెంచుతూ వస్తున్నా. మిత్ర, శత్రు పురుగులనూ పట్టించుకుంటున్నా. శత్రు పురుగులను అశక్తులను చేసేందుకు పసుపు, నీలిరంగు, నీటిరంగు తరహాలో రకరకాల ట్రాప్స్‌ను చేలో వాడుతున్నాం. మిత్ర పురుగులకు పొలంలో చోటు కల్పిస్తున్నాం. పంటను దెబ్బతీసే శత్రు పురుగుల గుడ్లను ఇవి ఆహారంగా తీసుకుంటూ పంటకు రక్షణ కల్పిస్తుంటాయి.

భూమి ఉత్పత్తి శక్తిని పెంచేందుకు...
భూమి ఉత్పత్తి శక్తిని పెంచుకొనేందుకు బాక్టీరియా, సేంద్రియ ఎరువు, పొలం వ్యర్ధాలు (కంది పొట్టు, మినప పొట్టు, కాల్చని చెత్తయినా సరే), ఫ్యాక్టరీ వ్యర్ధాలు (వేరుశెనగ పొట్టు, నూనె తీసిన నువ్వుల చెక్క, చెరకు పిప్పిని రెండేళ్లకోసారి వేస్తున్నాం. కానుగ పిండి, వేప పిండి, విప్ప పిండి, ఆముదం పిండిని వాడుతున్నాం. ఉదజని సూచిక(పీహెచ్‌) స్థాయి, పోషకాలను పరిశీలించుకుని పైన చెప్పిన వాటిలో తగినవి భూమిలో దున్నేశాం. ఆ విధంగా భూమిని ‘సకల పోషకాల గని’గా చేసుకోగలిగాం. బిందు సేద్యంతో ప్రతి మొక్కకు పోషకాలు అందేలా చూస్తున్నాం. ఇందుకు బాక్టీరియా తోడ్పడుతోంది. వచ్చే ఏడాది వరి సాగుకు బిందు విధానం వాడదలిచాను.

పసుపులో 4.62% కుర్కుమిన్‌తో విప్లవం
కీలకమైన పసుపు పంటను ఏటా సాగు చేస్తూ  50 శాతం విత్తనాభివృద్ధికి వినియోగిస్తున్నా. ఈసారి 8 ఎకరాల విస్తీర్ణంలో వేశా. దున్నటం అయిపోయింది.  ప్రగతి రకంలో 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. 4.62 శాతం కుర్కుమిన్‌ సాధిస్తున్నా. గతేడాది నంద్యాల, విశాఖ ఉద్యాన శాఖల అధికారులు తీసుకెళ్లారు. సాధారణంగా పసుపు వేసిన చేలో పోషకాలు సరిపోవని మరుసటి సంవత్సరం మళ్లీ పసుపు వేయరు. మేం వాడే విత్తనంతో డిసెంబరులో పంట తీసి, జనవరిలో మిర్చి, టొమాటో, వంగ వేశాం. వీటి తర్వాత జూన్‌లో మళ్లీ పసుపు సాగు చేయబోతున్నా. పసుపును వండకుండా, రెండేళ్లుగా నిల్వ చేయడంలోనూ సేంద్రియ పద్ధతులను అనుసరిస్తున్నా.

                         సాంబిరెడ్డి పొలంలో పసుపు కొమ్ముల గ్రేడింగ్‌

పచ్చి పసుపు వినియోగంపై ప్రచారం...
పసుపు పంటను ఉడకబెట్టిన తర్వాత ఎండబెట్టగా వచ్చిన కొమ్ముల నుంచి తీసిన పసుపు పొడిని ఇళ్లలో వినియోగిస్తుండటం సాధారణంగా జరుగుతుంది. ఇందుకు బదులుగా అల్లం పేస్ట్‌లాగా పచ్చి పసుపును కచ్చాపచ్చాగ నూరి కూరల్లో వాడుకొంటే పసుపు ప్రయోజనం పూర్తిగా అందుతుంది. దీనినే ప్రచారం చేస్తూ ఆర్గానిక్‌ ఉత్పత్తుల అమ్మకం కేంద్రాలకు శాంపిల్‌గా కొన్ని కిలోలు పంపా. అనుకున్నట్టే ఆదరణ బాగా ఉంది. కిలో రూ.50కి నేను ఇస్తుంటే రూ.80 నుంచి రూ.160లకు వ్యాపారులు కొనుగోలు చేస్తుండటం విజయానికి నిదర్శనం..
(సాంబిరెడ్డిని 97044 13596 నంబరులో సంప్రదించవచ్చు)  

సాంబిరెడ్డి తోటలో టొమాటోలు పండుతాయి. తను మార్కెట్‌కు వెళ్లడు. మార్కెట్‌ తన దగ్గరకు వస్తుంది. తన తోటలో గట్టుమీద కిలోకు 30 రూపాయలు ఇచ్చిపోతున్నారు. టొమాటో కుళ్లిపోయిందని రైతుని పీడించే కుళ్లిపోయిన మార్కెట్‌ వ్యవస్థను జయించిన మన సూపర్‌ హీరో రైతు సాంబిరెడ్డి రైతులందరికీ ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తున్నాడు. టొమాటో ఒక్కటే కాదు. చాలా రకాల కూరగాయలు పండిస్తున్నాడు. పంట ఏదైనా ఆయన చెప్పిందే ధర. అదే ఫైనల్‌. ప్రకృతి వ్యవసాయదారుడు సాంబిరెడ్డి వల్ల రైతుకు, వ్యవసాయానికి, దిగుబడికి డబ్బే కాదు.. గౌరవం దక్కింది. శెహభాష్‌ సాంబిరెడ్డి. ఈ పచ్చటి కథ మీదాకా తేవడానికి ‘సాక్షి’ కూడా చాలా గర్వపడుతోంది.

– బి.ఎల్‌.నారాయణ, సాక్షి, తెనాలి, గుంటూరు జిల్లా

మరిన్ని వార్తలు