శశిరేఖ స్వీట్‌ బాక్స్‌

19 Apr, 2018 01:43 IST|Sakshi

టెక్నాలజీ

ఇంటర్నెట్టూ, శాటిలైట్‌ టెక్నాలజీ, సెల్‌ఫోన్లు వగైరాలంటూ మనం ఇప్పుడు భుజాలు తట్టుకుంటున్నాం కానీ, ఇదంతా క్రీస్తుపూర్వం 3102–950 మధ్యలోనే ఉంది అన్నారు  త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌!

అన్నీ వేదాలలోనే ఉన్నాయట అని కొందరంటూ ఉంటారు. అలాగే ఈ ఇంటర్నెట్టూ, శాటిలైట్‌ టెక్నాలజీ కూడా ఇప్పటిదేమీ కాదు, మహాభారతం నాటి నుంచే ఉందని అంటున్నారు త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌కుమార్‌ దేవ్‌. ఆయన ఈ వ్యాఖ్యలు చేసింది ముఖ్యమంత్రిగా కాదు, తాను ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఒక వర్క్‌షాప్‌లో. ఇటీవల అగర్తలాలో కంప్యూటరీకరణ, సంస్కరణలపై ఒక వర్క్‌షాప్‌ జరిగింది. ఆ వర్క్‌షాప్‌కి చీఫ్‌గెస్ట్‌గా విచ్చేశారు విప్లవ్‌ దేవ్‌. ఇంటర్నెట్టూ, శాటిలైట్‌ టెక్నాలజీ, సెల్‌ఫోన్లు వగైరాలంటూ మనం ఇప్పుడు భుజాలు తట్టుకుంటున్నాం కానీ, ఇదంతా క్రీస్తుపూర్వం 3102–950 మధ్యలోనే ఉంది అన్నారు విప్లవ్‌! ఆ కార్యక్రమాన్ని కవర్‌ చేయడానికొచ్చిన పాత్రికేయులను కూడా వదిలిపెట్టలేదాయన. రిపోర్టర్లు, జర్నలిస్టులు, సబ్‌ ఎడిటర్లు అంటూ ఇప్పుడు ఏవేవో చెప్పుకొస్తున్నారు కానీ, నా దృష్టిలో సిసలైన రిపోర్టరు సంజయుడే. పుట్టు గుడ్డివాడైన ధృతరాష్ట్ర మహారాజుకు కురుక్షేత్ర యుద్ధంలో జరిగే ప్రతి ఘట్టాన్నీ సంజయుడు పూసగుచ్చినట్టు వర్ణించడం రిపోర్టింగ్‌ కాదంటారా? అసలు ‘మాయాబజార్‌’ వంటి కళాఖండాన్ని తీసిన కేవీ రెడ్డి 1957లోనే ఇప్పటి అత్యాధునిక టెక్నాలజీ ఏమీ వాడకుండానే శశిరేఖా అభిమన్యులు ‘ప్రియదర్శిని’ అనే పెట్టె ద్వారా వీడియో కాన్ఫరెన్సింగ్‌ టెక్నాలజీని వాడినట్టు చూపెట్టలేదా? అంటున్నారు. 

‘నా ప్రియుడు ఇప్పుడెలా ఉన్నాడో ఏమో’ అని బెంగపెట్టుకున్న శశిరేఖ (సావిత్రి)కి, శ్రీకృష్ణుడు (ఎన్టీఆర్‌) ఒక అందమైన వజ్రపు పేటిక నిచ్చి దానిలో అభిమన్యుడితో శశిరేఖను సంభాషించనివ్వడమే కాదు, వారిద్దరూ పాడుకునే సన్నివేశాన్ని కూడా అత్యద్భుతంగా తీయలేదా? అంటూ మాయాబజార్‌ సినిమాలోని కొన్ని సన్నివేశాలను గుర్తు చేశారు.  ప్రాచీన భారతానికి, ఆధునిక టెక్నాలజీకి ముడిపెడుతూ త్రిపుర ముఖ్యమంత్రి చెప్పిన ఉదాహరణలు వర్క్‌షాప్‌లో పాల్గొన్న వారికి ఆసక్తి కలిగించాయో లేదో కానీ, విప్లవ్‌ని ముఖ్య అతిథిగా పిలిచిన నిర్వాహకులకు మాత్రం కొరుకుడు పడలేదు. సీఎం గారికి మహాభారతమంటే ఆసక్తి ఉండచ్చు. మాయాబజార్‌ చిత్రమంటే అమితమైన ఇష్టం ఉండి ఉండవచ్చు కానీ, మోడరన్‌ టెక్నాలజీ గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడతారు కదా అని పిలిస్తే ఇలా పాతచింతకాయ పచ్చడిని తీసి అందరికీ రుచిచూపించడమేంటా అని లోపల్లోపల తలలు పట్టుకున్నారు. 
– డి.వి.ఆర్‌. 

మరిన్ని వార్తలు