ప్రతి అబద్ధమూ మోసం కాదు!!

22 Apr, 2014 23:50 IST|Sakshi
ప్రతి అబద్ధమూ మోసం కాదు!!

 అబద్ధం మంచిది... అబద్ధం చెడ్డది...
 
మన పూర్విక తాత్వికులకూ తెలుసు

అందుకే వారన్నారు... సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. న బ్రూయాత్ సత్యమప్రియమ్. అంటే... ఎదుటివాళ్లకు ప్రియంగా ఉంటేనే సత్యం చెప్పమన్నారు. లేకపోతే వద్దన్నారు. అంతమాత్రాన వాళ్లు మోసం చేయమని చెప్పలేదు కదా!
 
 అబద్ధం మంచిది... అబద్ధం చెడ్డది...

ఈ రెండు స్టేట్‌మెంట్లలో ఏది కరెక్టు? రెండూ కరెక్టే. అందుకే ప్రతి ఇంట్లో ముగ్గురు కచ్చితంగా ఉంటారు... భార్య, భర్త, ఒక అబద్ధం! ఒక మనిషి అన్నీ నిజాలే చెప్పి బతకడం చాలా కష్టం. దాన్ని కొందరు మూర్ఖత్వం అంటారు. అలా నిత్యం నిజాలు మాట్లాడే వ్యక్తి అంటే ఈ సమాజం భయపడుతుంది కూడా. నిజం ఎంత ప్రమాదమో అబద్ధాలు అంతే ప్రమాదం. కాపురాలు నిలబెట్టే అబద్ధాలుంటాయి, కాపురాలు కూల్చే అబద్ధాలుంటాయి. పెళ్లికి ముందు ముగిసిపోయిన ప్రేమకథ దాచితే అబద్ధం గాని పెళ్లయ్యాక నెరపే అక్రమ సంబంధం దాయడం అబద్ధం కాదు మోసం.
 
వెయ్యి అబద్ధాలు చెప్పి అయినా ఒక పెళ్లి చేయమన్నారు. దాని అంతరార్థం మోసం చేసి పెళ్లి చేసుకోమని కాదు. జీవితంలో సంతోషం సర్దుకుపోవడంలోనే ఉంది. ప్రతి మనిషిలో లోపాలుంటాయి. వాటినే వెతుక్కుంటూ ఉంటే ఎవరికీ పెళ్లిళ్లు కావు. పైగా పెళ్లపుడు చెప్పే చాలా అబద్ధాలు దాగవు. అయితే, తెలిసినా ఇరువైపులా సర్దుకుపోవాలి. అలా సర్దుకుపోగలిగిన అబద్ధాలే చెప్పాలి. జీతం ఓ ఐదు వేలు ఎక్కువ చెప్పి పెళ్లి చేసుకుంటే సర్దుకుపోవచ్చు కానీ ఉద్యోగమే అబద్ధం అయితే సర్దుకుపోయేదేమీ ఉండదు. అంటే, ఈ అబద్ధాలు మంచి చేసేవి కావాలి గాని హాని చేసేవి కాకూడదు అన్నది పెద్దల సిద్ధాంతం.
 
ఇలాంటిదే పాశ్చాత్య దేశాల్లో కాస్త పద్ధతిగా ఉంటుంది. అదే ‘వైట్‌లైస్ థియరీ’. దీని ప్రకారం కాపురం కాపాడుకోవడానికి చెప్పే ప్రతి అబద్ధమూ మంచిదే. ‘అతడు’ సినిమా చూసి ఉంటే మీకు ఓ డైలాగు గుర్తుండే ఉంటుంది... ‘నిజం దాచాలనుకోవడం అబద్ధం. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం’. అంటే కాపురంలో అబద్ధాలు ఉండొచ్చు గాని మోసాలు ఉండకూడదు.
 
సమస్య ఎక్కడ వస్తుందంటే... భర్త చెప్పే ప్రతి అబద్ధమూ మోసమే అనే భావన భార్యలో ఉంటుంది. అది నిజం కాదు. ఎందుకంటే భర్త చెప్పే అబద్ధాల్లో కొన్ని భాగస్వామిని బాధ పెట్టకూడదని చెప్పేవి ఉంటాయి. కొన్ని కాపురంలో కలతలను నివారించడానికి అయి ఉంటాయి. ఇంకొన్ని మోసం చేయడానికే చెప్పి ఉండొచ్చు. నిజాలు తెలియకుండా/తెలుసుకోకుండా మనిషిని అపార్థం చేసుకోవడం వల్ల జీవితం ముళ్ల బాట అవుతుంది.
 
ఈ విషయం మన పూర్విక తాత్వికులకూ తెలుసు అందుకే వారన్నారు... సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. న బ్రూయాత్ సత్యమప్రియమ్. అంటే... ఎదుటివాళ్లకు ప్రియంగా ఉంటేనే సత్యం చెప్పమన్నారు. లేకపోతే వద్దన్నారు. అంతమాత్రాన వాళ్లు మోసం చేయమని చెప్పలేదు కదా. అందుకే ప్రతి అబద్ధమూ మోసం కాదు.

ప్రాణ, మాన, విత్త భంగంలో ముందు బొంకే ప్రతి అబద్ధమూ ఆపద్ధర్మమే. ఆమోదయోగ్యమే. అది మోసం కానే కాదు. ఈ విషయం గ్రహిస్తే అబద్ధానికీ, మోసానికీ తేడా తెలుస్తుంది. అది ప్రతి జీవిత భాగస్వామీ తెలుసుకుంటే వాళ్లదిక పండంటి కాపురమే.
 
అయితే కొన్ని విషయాలు గ్రహించాలి
 
సాధారణంగా భారతీయ పురుషులు తల్లీపెళ్లాల గొడవలు తగ్గించడానికి, భార్యకోపం నుంచి తప్పించుకోవడానికి అబద్ధాలు చెబుతారట.
 
కొన్నిసార్లు నొప్పించకూడదన్న మంచి కారణంతో చెప్పిన అబద్ధాలు కూడా పెద్ద చిక్కులు తెచ్చిపెడుతుంటాయట.
 
అబద్ధం చెప్పిన విషయం కన్నా భర్త అబద్ధమాడాడన్న బాధే మహిళలను ఎక్కువగా బాధిస్తుందట.
హద్దుల్లో ఉండే అబద్ధాల గురించి తెలిసినా కారణాలు అడిగి ఒకరినొకరు క్షమించుకుంటే కాపురం పండుతుంది.
 - ప్రకాష్ చిమ్మల

మరిన్ని వార్తలు