మనస్ఫూర్తి మామూళ్లు

23 Sep, 2017 00:45 IST|Sakshi

ఆత్మీయం

దసరా వస్తోందంటే దడ మొదలవుతుంది కొందరికి. ఎందుకంటే దసరా సందర్భంగా చిరుద్యోగి దగ్గర నుంచి కాస్త పైస్థాయి వారి వరకూ మామూళ్లు అడగని వారుండరు. ఆఫీస్‌ బాయ్స్, పోస్ట్‌మ్యాన్‌ లాంటివాళ్లు కాగితం, కలం పట్టుకుని వచ్చి మర్యాదగా మామూలు అడిగితే, కొందరు మాత్రం తమకు కావలసిన మొత్తం సమకూరాలంటే ఎంత ఎవరెవరు ఎంతెంత ఇస్తే సరిపోతుందో అంచనా వేసుకుని కాస్త గట్టిగానే వసూలు చేస్తారు. ఇలా మామూళ్లు అడగటం ఇప్పుడు మామూలు అయిపోయింది కానీ, నిజానికి ఇది ఒక మంచి సంప్రదాయం ఒకప్పటిరోజుల్లో. కేవలం ఉపాధ్యాయవృత్తిలో అంటే అప్పటిలో బతకలేక బడిపంతుళ్లే ఇలా ఇంటింటికీ తిరిగి తమదైన శైలిలో మామూళ్లు అడిగేవారు. అప్పటి రోజుల్లోకెళ్తి చూస్తే... దసరా పండుగకు చక్కగా కొత్త దుస్తులు ధరించి వెదురుతో చేసిన విల్లంబులు, ఎక్కుబెట్టిన విల్లు చివరి భాగాన మిఠాయి పొట్లం ఆకారంలో తయారుచేసి దానిలో ‘బుక్కా’ రంగు వేసి ఒకళ్లమీద ఒకరు చల్లుకొంటు, ఆడుకొంటూ, పాడుకొంటూ పంతుళ్ళు వెనుక నడుస్తుంటే పిల్లలు వరుసల్లో పాడుతూ ప్రతి వాకిటా ఆగి దసరా మామూళ్ళు స్వీకరించే ఆత్మీయమైన ఆచారమిది. ఒక వ్యక్తి స్వీయ అభివృద్ధి గాని కుటుంబ, సమాజ, ప్రాంత అభివృద్ధి గాని జ్ఞానంతోటే సాధ్యమని, చదువుతోటే వికాసమని భావించిన ఆ రోజుల్లో గ్రామంలోని పెద్దలు గ్రామంలోని బడి పదికాలాలపాటు పదిలంగా ఉండడానికి తమకు తోచిన సాయం చేసేవారు.

ప్రభుత్వ బడులు లేని ఎన్నో గ్రామాల్లో తమ స్థలాలను బడి పెట్టడానికి నిస్వార్థంగా దానం ఇచ్చేవారు ఎందరో మహానుభావులు. వెలుగుతున్న దీపం మరొక దీపాన్ని వెలిగిస్తుందని నిజాయతీగా నమ్మిన జ్ఞానమూర్తులు బతకడానికి కాకుండా, బ్రతికించడానికి ఉపాధ్యాయులుగా మారి ఆ గ్రామంలోని పిల్లలను వెలుగు దివ్వెలుగా మార్చేవారు. దసరా పండుగ సందర్భంగా ఆ సంవత్సర కాలంలో తాము విద్యార్థులకు నేర్పిన పద్యాలు, శ్లోకాలు, గణిత సమస్యలు, పొడుపు కధలు మొదలైనవి గ్రామంలోని పెద్దల అందరి ఎదుట దసరా సెలవులలో ప్రదర్శన చేసేవారు. పిల్లల వయస్సు, తరగతిని బట్టి వివిధ కళలను తమను పోషిస్తున్న దాన మహరాజుల ఎదుట ప్రదర్శించి వారు అడిగే వాటికి నేర్పుతో సమాధానం చెప్పి మెప్పించి పెద్దలు ఆనందంగా ఇచ్చే కానుకలను పొందేవారు. ఇదే కదా నిజమైన పరీక్ష ఉపాధ్యాయులకు. దేవతా వేషధారులై ఆ చిన్నారులు ఘనమైన పద్యాలు చదువుతూ ఆశీస్సులు అందిస్తే ముగ్దులైన ఊరి పెద్దలు ఆ బడి ఇంకా ఇంకా ఎదగాలని మనస్పూర్తిగా దసరా కానుకలు అందించేవారు. అంతేకానీ, దౌర్జన్యంగా మామూళ్లు అడిగితే, మనసులో తిట్టుకుంటూ భయం భయంగా ఇస్తే అవి మామూళ్లు కావు... దసరా వసూళ్లవుతాయి

మరిన్ని వార్తలు