చివరి పాలు

25 Jan, 2019 00:08 IST|Sakshi

చెట్టు నీడ 

అబూహురైరా (రజి) దైవప్రవక్త (సల్లం) సేవలో, జ్ఞానార్జనలో పూర్తిగా లీనమైపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. చివరికి పస్తులు కూడా ఉండవలసి వచ్చింది. ఒక రోజయితే ఆయన తీవ్రమైన ఆకలితో విలవిల్లాడి పోయారు. దాంతో ఆయన.. దారిలో ఒకచోట నిల్చొని ఎవరైనా వచ్చి తనను ఇంటికి తీసికెళ్లి భోజనం పెట్టిస్తారేమోనని ఎదురు చూడసాగారు. కారుణ్యమూర్తి ముహమ్మద్‌ ప్రవక్త (స) అటుగా వచ్చారు. దైవప్రవక్త (సల్లం) ఎంతో వాత్సల్యంతో ఆయన వైపు చూస్తూ ‘‘అబూహురైరా! పద నావెంట’’ అన్నారు. అబూహురైరా (రజి) వెంటనే ఆయన వెంట నడిచారు. దైవప్రవక్త ఆయన్ని తన ఇంటికి తీసికెళ్లారు.

అక్కడ ఒక గిన్నెలో పాలు ఉండటం చూసి అబూహురైరా (రజి)తో ‘‘అబూహురైరా! మస్జిద్‌కు వెళ్లి సప్ఫా వారందరినీ పిలుచుకొనిరా’’ అని అన్నారు. దైవప్రవక్త (సల్లం) వాళ్లందరినీ పిలిపించడం అబూహురైరా (రజి)కు నచ్చలేదు. ఓ గిన్నెడు పాలు అంతమందికి ఎలా సరిపోతాయి? అనుకున్నారు ఆయన. ‘‘ఏమైనా దైవప్రవక్త (సల్లం) ఆజ్ఞ కదా!’’ అని భావిస్తూ వెళ్లి వారందరినీ పిలుచుకు వచ్చారాయన. దైవప్రవక్త (స) అందరూ వచ్చి కూర్చున్న తరువాత ‘‘అబూహురైరా! ఈ పాలగిన్నె తీసుకొని వీరందరికీ పాలు తాగించు’’ అని అన్నారు.

అబూహురైరా (రజి) పాలగిన్నె తీసుకొని ఒకరి తర్వాత ఒకరు చొప్పున అందరికీ పాలు తాగించారు. అయినా గిన్నెలో పాలు ఏమాత్రం తగ్గలేదు. తరువాత ఆయన పాలగిన్నెను దైవప్రవక్త (సల్లం) ముందు పెట్టారు.  ‘‘సరే, ఇప్పుడు నువ్వు తాగు ఈ పాలను’’ అన్నారు దైవప్రవక్త (సల్లం). ఆకలితో నకనకలాడుతున్న అబూహురైరా (రజి) వెంటనే పాలగిన్నె తీసుకొని గటగటా పాలుతాగి దాన్ని కింద పెట్టేశారు. దైవప్రవక్త (సల్లం) ఇంకా తాగమన్నారు. అబూహురైరా (రజి) మరొకసారి గిన్నె పైకెత్తి పాలుతాగారు. దైవప్రవక్త (సల్లం) ఇంకా తాగు, ఇంకా తాగు అన్నారు. అబూహురైరా (రజి) ఆవిధంగా కడుపునిండా తాగి ‘‘ఇప్పుడిక నా కడుపులో ఏమాత్రం అవకాశం లేదు’’ అని అన్నారు. గిన్నెలో పాలు ఇంకా మిగిలివున్నాయి. అందరికంటే చివర్లో దైవప్రవక్త (సల్లం) ఆ పాలను తాగారు.
– ముహమ్మద్‌ ముజాహిద్‌ 

మరిన్ని వార్తలు