ప్రతిసారీ సిజేరియన్ తప్పదా?

30 Apr, 2015 23:20 IST|Sakshi
ప్రతిసారీ సిజేరియన్ తప్పదా?

నాకు మొదటిసారి ప్రెగ్నెన్సీలో బిడ్డ ఎదురుకాళ్లతో ఉండటంతో సిజేరియన్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ గర్భం ధరించాను. ప్రస్తుతం ఏడో నెల. మొదటిసారి సిజేరియన్ అయితే రెండోసారీ అదే తప్పదని కొందరు భయపెడుతున్నారు. నాకేమో సాధారణ ప్రసవం అయితే  బాగుండని అనిపిస్తోంది. నాకు సిజేరియన్ కాకుండా మామూలు డెలివరీనే అయ్యే అవకాశం ఉందా?
 - కావ్య, కరీంనగర్  
 
మొదటిసారి సిజేరియన్ అయితే రెండోసారి కూడా తప్పనిసరిగా సిజేరియనే అవుతుందనేది సరికాదు. కాకపోతే రెండోసారి నార్మల్ డెలివరీ అవుతుందా లేక తప్పనిసరిగా సిజేరియన్ చేయాల్సి వస్తుందా అనే అంశం అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు...
     
మొదటిసారి బిడ్డ ఎదురుకాళ్లతో ఉందన్నారు కదా. ఈసారి డెలివరీ టైమ్‌కు బిడ్డ తల కిందివైపునకు తిరిగుంటే సిజేరియన్ చేయాలనే నియమం లేదు.
     
మొదటిసారి బిడ్డ చాలా బరువు ఉండి... మామూలుగా ప్రసవం అయ్యే పరిస్థితి లేదని డాక్టర్ నిర్ధారణ చేస్తే మొదటిసారి సిజేరియన్ చేస్తారు. అదే ఈసారి బిడ్డ బరువు సాధారణంగా ఉండి, ప్యాసేజ్ నుంచి మామూలుగానే వెళ్తుందనే అంచనా ఉంటే సాధారణ డెలివరీ కోసం ప్రయత్నించవచ్చు. అయితే బిడ్డ బయటకు వచ్చే ఈ దారి చాలా సన్నగా  (కాంట్రాక్టెడ్ పెల్విస్) ఉంటే మాత్రం సిజేరియన్ తప్పదు.
     
ఇక సాధారణంగా తల్లుల ఎత్తు 135 సెం.మీ. కంటే తక్కువ ఉన్నవారికి బిడ్డ బయటకు వచ్చే దారి అయిన పెల్విక్ బోనీ క్యావిటీ సన్నగా ఉండే అవకాశం ఎక్కువ. అందుకే ఇలాంటివారిలో చాలా సార్లు సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీయాల్సి రావచ్చు.
     
ఇక మొదటి గర్భధారణకూ, రెండో గర్భధారణకూ మధ్య వ్యవధి తప్పనిసరిగా 18 నెలలు ఉండాలి. ఎందుకంటే మొదటిసారి గర్భధారణ తర్వాత ప్రసవం జరిగాక దానికి వేసిన కుట్లు పూర్తిగా మానిపోయి, మామూలుగా మారడానికి 18 నెలల వ్యవధి అవసరం. పై అంశాల ఆధారంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... మొదటిసారి సిజేరియన్ అయినంత మాత్రాన రెండోసారీ సిజేరియనే అవ్వాల్సిన నియమం లేదు. తల్లీ, బిడ్డా ఆరోగ్యం బాగా ఉండి, పైన పేర్కొన్న అంశాల ఆధారంగా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటే దాని కోసం ప్రయత్నించవచ్చు.
 
నొప్పులు వచ్చే తీవ్రతను బట్టి ఒక్కోసారి గర్భసంచి రప్చర్ అయ్యే అవకాశాలు 5 - 10 కేసుల్లో ఉండవచ్చు. కాబట్టి తప్పనిసరిగా ఆసుపత్రిలోనే ప్రసవం అయ్యేలా చూసుకోవాలి.
 
గైనకాలజి కౌన్సెలింగ్
 
డాక్టర్ వేనాటి శోభ
సీనియర్ గైనకాలజిస్ట్
లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్

మరిన్ని వార్తలు