వెన్ను చూపక...వేసెయ్‌ చకచకా...

25 May, 2017 01:39 IST|Sakshi
వెన్ను చూపక...వేసెయ్‌ చకచకా...

లాంగ్‌డ్రైవింగ్, కూర్చునే భంగిమలో లోపాలు, అధికంగా వెన్ను వంచడం, అధిక బరువులు ఎత్తడం, ఎక్కువ సేపు నిలబడి కానీ, వంగిగాని పని చేయడం వంటివి వెన్నునొప్పి సమస్యకు సాధారణంగా కనిపించే కారణాలు. ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే జీవనశైలి, యాంగ్జయిటీ, డిప్రెషన్, ఒబెసిటీ, ధూమపానం... వంటివి కూడా కారణాలే...ఇక వెన్నుపూస మధ్యలో ఉన్న డిస్క్‌ అరుగుదల, డిస్క్‌ బల్జ్, డిస్క్‌ హెర్నియేషన్, డిస్క్‌ ప్రొలాప్స్, స్లిప్డ్‌ డిస్క్, డిస్క్‌ ప్రొట్రూజన్, సయాటికా, ఆస్టియో పొరోసిస్, ఆర్థరైటిస్, లోడోసిస్, స్కోలియాసిస్, కైఫోసిస్‌ తదితర సమస్యలు వెన్ను నొప్పిని తీవ్రతరం చేస్తాయి. ఈ సమస్యకు మందులతో తాత్కాలిక పరిష్కారమే లభిస్తుంది. యోగాసనాల ద్వారా మాత్రం శాశ్వత పరిష్కారం అందుతుంది.  

జాగ్రత్తలు: ఈ సమస్య ఉన్నవాళ్లు ముందుకు వంగే ఆసనాలు వేయకూడదు. సమస్య తీవ్రతను బట్టి కాస్త సులభంగా వేయగలిగేవి ఎంచుకోవాలి. పూర్తి రిలాక్స్‌డ్‌గా ఉంటూ శ్వాస తీసుకుంటూ, శ్వాస వదులుతూ సాధన చేయాలి. నిలబడి చేసే ఆసనాలలో పైకి, పక్కలకు స్ట్రెచ్‌ చేసే ఆసనాలు, స్పైన్‌ను ట్విస్ట్‌ చేసే ఆసనాలు ఉన్నాయి. వీటిలో కొన్ని...

1 త్రికోణాసన లేదా ఉత్థిత త్రికోణాసన
సమస్థితి లేదా తాడాసనంలో నిలబడాలి. కుడిపాదాన్ని ఎడమకాలుకు దూరంగా జరిపి కుడి పాదాన్ని ముందుకు, ఎడమపాదాన్ని పక్కలకు ఉంచాలి. చేతులు పక్కలకు 180 డిగ్రీల కోణంలో భూమికి సమాంతరరేఖలో ఉంచి శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. కుడి చేతిని కుడి పాదానికి దగ్గరగా ఎడమ చేతిని నిటారుగా పైకి తీసుకువెళ్లి, ఎడమ చేతిని చూస్తూ నడుము నుండి పై భాగం ముందుకు పడిపోకుండా పక్కలకు ఉండేటట్లుగా సరి చేసుకుంటూ ఉండాలి.

పూర్తి స్థితిలో మోకాళ్లు రెండూ నిటారుగా ఉంటాయి. (మోకాలి సమస్య ఉన్నవారు కొద్దిగా మోకాళ్లను ముందుకు వంచవచ్చు. కుడిచేయి భూమికి దగ్గరగా తీసుకురాలేనివాళ్లు కుడికాలి షైన్‌బోన్‌ను పట్టుకోవచ్చు. లేదా కుడి చేతికింద సపోర్ట్‌గా ఏదైనా ఇటుకలాంటిదాన్ని ఉపయోగించవచ్చు) శ్వాస తీసుకుంటూ చేతులు పైకి 180 డిగ్రీల కోణంలో భూమికి సమాంతరంగా తీసుకువెళ్లి, చేతులు క్రిందకు తెచ్చి కుడిపాదాన్ని పక్కకు, ఎడమపాదాన్ని ముందుకు ఉంచి రెండవ వైపూ చేయాలి.

2 పరివృత్త త్రికోణాసన
త్రికోణాసన వర్గంలో త్రికోణాసనం చేసిన తరువాత అదే సీక్వెన్స్‌లో తదుపరి ఆసనం పరివృత్త త్రికోణాసనం. కుడిపాదం ముందుకు, ఎడమ పాదం పక్కకు ఉంచి చేతులు 180 డిగ్రీల కోణంలో ఉంచి నడుమును బాగా కుడి వైపునకు తిప్పి, శ్వాస వదులుతూ ఎడమ చేతిని కిందకు, కుడిపాదానికి దగ్గరగా కుడి చేతిని ఉంచి, పైకి చేతులు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉండే తీసుకురావాలి. ఎడమ చేయి భూమికి దగ్గరగా తీసుకు రాలేకపోతే ఎడమచేతికి సపోర్ట్‌గా ఏదైనా వస్తువు ఉపయోగించవచ్చు. శ్వాస తీసుకుంటూ చేతులు పైకి 180 డిగ్రీల కోణంలో ఉంచి, శ్వాస వదులుతూ చేతులు కిందకు తీసుకురావాలి. తిరిగి ఇదే విధంగా రెండవ వైపు చేయాలి.

3. పార్శ్వ కోణాసన
త్రికోణాసన వర్గంలో తరువాతిది పార్శ్వకోణాసనం. చేతులు 180 డిగ్రీల కోణంలో ఉంచాక ఎడమ మోకాలును ముందుకు వంచి ఎడమపాదం నుండి ఎడమ మోకాలి వరకూ 90 డిగ్రీల కోణంలో లంబంగా ఉంచాలి. ఎడమ మోచేతిని ఎడమ మోకాలుకు సపోర్ట్‌గా ఉంచి కుడి చేతిని పైకి నిటారుగా ఆ తరువాత కుడి చేతిని ఏటవాలుగా ఉంచి స్ట్రెచ్‌ చేస్తూ కుడి చేతి వేళ్ల దగ్గర నుంచి కుడి పాదం చివర వరకూ ఒకే లైనులో ఉండేటట సరిచేసుకోవాలి.

ఎడమచేతిని కిందకు భూమి మీద ఎడమపాదానికి బయట వైపు లేదా ఫొటోలో చూపించిన విధంగా లోపలవైపు ఉంచి ఛాతీ భూమి మీదకు శరీరం ఒరిగి పోకుండా పక్కలకు ఉండేలా చూసుకోవాలి. ఎడమచేయి భూమి మీద పెట్టలేని పరిస్థితిలో ఎడమచేతిక్రింద ఏదైనా సపోర్ట్‌ ఉపయోగించవచ్చు. 3 లేదా 5 సాధారణ శ్వాసల తర్వాత శ్వాస వదులుతూ ఎడమ మోచేయి ఎడమ మోకాలు మీద సపోర్ట్‌గా ఉంచి పైకి లేస్తూ చేతులు 180 డిగ్రీల కోణంలోకి ఎడమ మోకాలు నిటారుగా ఉంచుతూ సమస్థితిలోకి రావాలి. ఇదే విధంగా రెండవవైపూ చేయాలి.

4. పరివృత్త పార్శ్వ కోణాసన
పైన చెప్పిన ఆసనం తరువాత కొంచెం అడ్వాన్స్‌డ్‌గా చేసే ఆసనం పరివృత్త పార్శ్వకోణాసనం. పైన చేసిన విధంగానే ఇదీ కొన్ని మార్పులతో చేయాలి. వ్యతిరేక చేయి, వ్యతిరేక పాదానికి దగ్గరగా పాదం బయటవైపునకు లేదా లోపల వైపు భూమికి దగ్గరగా తీసుకురావాలి. స్ట్రెచ్‌ చేసి ఉంచిన పాదాన్ని పూర్తిగా భూమి మీద ఆనించి ఉంచడం సాధ్యపడదు కనుక పాదాన్ని ముందుకు తిప్పి, కాలి మడమను పైకి లేపి, మునివేళ్ల మీద సపోర్ట్‌ తీసుకోవాలి
— ఎ.ఎల్‌.వి కుమార్‌ ట్రెడిషనల్‌ యోగా ఫౌండేషన్‌

మరిన్ని వార్తలు