హంసలు అద్భుతంగా పాడతాయా?

22 Nov, 2014 23:43 IST|Sakshi
హంసలు అద్భుతంగా పాడతాయా?

మగ హంసను కాబ్ అంటారు. ఆడ హంసను పెన్ అంటారు. హంస పిల్లను సిగ్నెట్ అంటారు!   ఒక్కో హంస ఒంటి మీదా దాదాపు పాతికవేల ఈకల వరకూ ఉంటాయి!  ఇవి నేల మీద, నీటిలోనూ కూడా జీవించగలవు. అయితే నేలమీద ఉండటానికే ఎక్కువ ఇష్టపడతాయి. ప్రధాన ఆహారం నీటి అడుగున ఉండే మొక్కలు, కాడలు, దుంపలు కాబట్టి... ఆహారం కోసం మాత్రం నీటిలోకి వెళతాయి. లేదంటే సరదాగా ఈత కొట్టడాని వెళతాయి!

హంసలు ఒక్కసారి ఒకదానితో జతకడితే, ఇక దానితోనే ఉంటాయి. దురదృష్టవశాత్తూ తన జోడీ మరణిస్తే... జీవితాంతం అలానే ఉండిపోతాయి తప్ప మరోదానికి దగ్గర కావు. కొన్నయితే బెంగపెట్టుకుని చనిపోతాయి కూడా. అయితే ఏవైనా తేడాలొచ్చినప్పుడు మాత్రం శాశ్వతంగా తెగతెంపులు చేసుకుంటాయి. సాధారణంగా గూడు కట్టుకునేటప్పుడు పని విషయంలో వీటికి గొడవ వస్తుంది. కొట్టుకునే
 వరకూ వెళ్లిపోతాయి. అలాంటప్పుడు మాత్రం విడిపోతాయి. అయితే అప్పుడు కూడా ఒంటరిగానే ఉండిపోతాయి తప్ప మరోదాన్ని దగ్గరకు రానివ్వవు!

ఇవి ఒక్కగూటిలో కుదురుగా ఉండవు. అస్తమానం పాత గూళ్లను వదిలి కొత్తవాటిని కడుతూనే ఉంటాయి. పోనీ అందులో ఉంటాయా అంటే అదీ ఉండదు. కేవలం పడుకోవడానికి మాత్రమే గూటిని ఉపయోగిస్తుంటాయి. మిగతా సమయాల్లో ఆ గూళ్లను మిగతా పక్షులు వాడేసుకుంటూ ఉంటాయి!

తమ గుడ్లు, పిల్లలను కాపాడుకోవడం కోసం ఇవి ఎంతకైనా తెగిస్తాయి. కుక్కలు, పిల్లులు వంటి జంతువులు గుడ్లను కానీ, పిల్లలను గానీ ఎత్తుకుపోవడానికి వచ్చాయో... పొడిచి పొడిచి తరిమి కొడతాయి. ఎంత తీవ్రంగా గాయపరుస్తాయంటే, ఒక్కోసారి అవతలి జంతువు ప్రాణాలు కూడా కోల్పోతుంది!

హంసలు అద్భుతంగా పాడతాయి. అయితే మామూలప్పుడు ఎలా ఉన్నా... చనిపోయే ముందు ఇవి తప్పకుండా పాడతాయని పరిశోధనల్లో తేలింది. ఈ చివరి పాటను ‘శ్వాన్ సాంగ్’ అని పిలుస్తుంటారు జీవ శాస్త్రజ్ఞులు!. వీటికి కోపం కాస్త ఎక్కువే. బాగా విసుగు వచ్చినా, కోపం వచ్చినా రెక్కల్ని టపటపా కొడతాయి. అర్థం చేసుకుని తప్పుకుంటే సరే, లేకపోతే వాటికి కోపం తెప్పించినవారి మీద దాడికి దిగుతాయి!
 
 

మరిన్ని వార్తలు