రాజీపడి బతకడం నా డిక్షనరీలోనే లేదు!

7 Dec, 2013 23:15 IST|Sakshi

 సంప్రదాయ కుటుంబం.
 పుటి ్టందీ, పెరిగిందీ... కల్చరల్ హబ్‌లో.
 వేదం చదివాడు.
 సంధ్యా వందనం ఆచరిస్తాడు.
 గాయత్రీ మంత్రం పఠిస్తాడు.
 ఇంట్లో... శ్రీశ్రీ, తిలక్, శ్రీపాద.
 బయట... నాటక పరిషత్తు.
 శుభ్రమైన వాక్కు, విద్వత్తు.
 మరేంటి?!!
 ఈ డాన్స్‌లేంటి? పంచ్ డైలాగులేంటి?
 బిల్డప్ షాట్‌లేంటి?
 అసలు హరీష్‌శంకర్ ...
 ఈ ఫీల్డులోకి రావడం ఏంటి?
 ఏం లేదు! హరీష్‌కు ఇండస్ట్రీ అంటే ప్రాణం.
 షాక్, మిరపకాయ్, గబ్బర్‌సింగ్రామయ్యా వస్తావయ్యా...
 అన్నీ ప్రాణం పెట్టి తీసినవే.
 అందుకే అవి హిట్టయినా, కాకున్నా...
 ప్రాణం మాత్రం మినిమం గ్యారెంటీ!
 నిన్నగాక మొన్న వచ్చి...
 పరిశ్రమను ఓ కుదుపు కుదిపాడు హరీష్.
 పరిశ్రమ కూడా అతడినేం తక్కువ కుదపలేదు!
 ఏమిటా కుదుపులు?
 చదవండి ఈ ‘తారాంతరంగం’.

 
  ఏంటి సార్... మీ కొత్త సినిమాల కబుర్లు?
 హరీష్‌శంకర్: మూడు కథలు రెడీగా ఉన్నాయి. అందులో రెండు మాస్ ఎంటర్‌టైనర్స్.. అవి ప్రేక్షకుల కోసం. మూడోది నా కోసం. ప్రయోగాత్మకం అన్నమాట. తెలిసో... తెలీకో మా దర్శకులందరం ఒకే తరహా సినిమాలు చేస్తున్నాం. అవే హీరో ఇంట్రడక్షన్సూ, అవే పంచ్ డైలాగులు, అవే డాన్సులు, ఆవే బిల్డప్ షాట్స్... హీరోలు మారుతున్నారంతే! ఈ ట్రెండ్‌ని బ్రేక్ చేయాలని ఉంది. బాలీవుడ్‌లో గొప్ప సినిమాలొస్తున్నాయి. రాజ్‌కుమార్ ఇరానీ ‘త్రీ ఇడియట్స్’ తీశారంటే.. ఆయన మేథాశక్తి అంత గొప్పది. ఆ స్థాయిలో ఆలోచించే శక్తిని ఆ దేవుడు నాకూ ఇవ్వాలని కోరుకుంటున్నాను. త్వరలో నా నుంచి అంత గొప్ప సినిమా కాకపోయినా.. ఓ మంచి సినిమా మాత్రం వస్తుంది. అది కూడా లో బడ్జెట్‌లోనే.
 
 ‘రామయ్యా వస్తావయ్యా’తో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టుంది?
 హరీష్‌శంకర్: అది గొప్ప సినిమా అని నేను అనను. కచ్చితంగా ఫ్లాపే. అయితే.. ఆ సినిమాకు రావాల్సిన దానికంటే ఎక్కువగా బ్యాడ్ వచ్చింది. దానికీ నేను బాధపడటంలేదు. ఎందుకంటే.. ‘గబ్బర్‌సింగ్’కి నాకు రావాల్సిన దానికంటే.. ఎక్కువ పేరొచ్చింది. అంతటి సక్సెస్‌ని ఎంజాయ్ చేశాను కాబట్టి... ఈ ఫ్లాప్ బాధ్యతని కూడా తీసుకోవడానికి నేను బాధపడటంలేదు.
 
 ‘రామయ్యా...’ ముందు మీ చేతిలో మూడు సినిమాలున్నాయి. ‘రామయ్యా...’ ఫ్లాప్ తర్వాత ఇచ్చిన అడ్వాన్సులు వెనక్కు తీసుకున్నారని టాక్. నిజమేనా?
 హరీష్‌శంకర్: ‘నా సినిమా సరిగ్గా ఆడలేదు కాబట్టి అడ్వాన్సు కావాలంటే తిరిగి ఇచ్చేస్తానని’ నేనే అన్నాను. ఓ నిర్మాత ‘ఇచ్చేయ్ బాబూ’ అన్నాడు... ఇచ్చేశాను. అది తప్పేం కాదే..! ‘గబ్బర్‌సింగ్’ హిట్ చూసి అడ్వాన్సులిచ్చారు. ‘రామయ్యా..’ ఫ్లాప్ అయ్యింది. నా ఫెయిల్యూర్‌ని గుర్తించి అడ్వాన్స్ వెనక్కు తీసుకున్నారు.
 
 ‘రామయ్యా వస్తావయ్యా’కు ఫస్ట్ అనుకున్న కథ ఇది కాదని, దిల్‌రాజు కథను మార్చారని టాక్?
 హరీష్‌శంకర్: అవి ఉట్టి మాటలండీ. నా సక్సెస్‌లో నేను ఎవరికైనా భాగం ఇస్తా. ఫెయిల్యూర్‌లో మాత్రం పూర్తి  బాధ్యత నాదే. ఎవరికీ భాగం ఇవ్వను.
 
 తొలి చిత్రం ఫ్లాపవ్వడం వల్ల వచ్చిన పరిపక్వతా ఇది?
 హరీష్‌శంకర్: అయ్యుండొచ్చు. ‘షాక్’ టైమ్‌లో నేను టూ యంగ్. 26 ఏళ్ల కుర్రాణ్ణి. అందుకే తేలిగ్గా తేరుకోగలిగా. అయితే.. దర్శకునిగా నాకు ఆ సినిమా చెడ్డ పేరు మాత్రం తేలేదు. ‘వీడితో సినిమా చేయొచ్చు..’ అని నిర్మాతలకు ఓ నమ్మకం కుదిరేట్లు చేసిందా సినిమా. కానీ కమర్షియల్ సక్సెస్ కాలేదు కాబట్టి.. ఎంత బాగా తీసినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే, పరిశ్రమ సక్సెస్ వెనకే ఉంటుంది. ఏది ఏమైనా.. ‘షాక్’ ఫ్లాప్‌కి పూర్తి బాధ్యుణ్ణి నేనే. వర్మ కథకు నేను సరైన న్యాయం చేయలేకపోయాననే చెబుతా. ఆ సినిమా తర్వాత మరో సినిమా చేయడానికి నాకు నాలుగేళ్లు పట్టింది.
 
 ఈ నాలుగేళ్లలో మిమ్మల్ని ఎవరూ పిలవలేదా?
 హరీష్‌శంకర్: మధ్యలో ఓ పెద్దాయన  నుంచి పిలుపు వచ్చింది. ఆయన ఎవరో కాదు... ఫ్లాప్ డెరైక్టర్లకు పిలిచి మరీ అవకాశం ఇచ్చే పేషన్ ఉన్న నిర్మాత ఎమ్మెస్ రాజు. ఆయనకు ఓ కథ చెప్పాను. దానికి టైటిల్ ‘ఆట’ అని ఆయనే పెట్టారు. అయితే.. ఆ కథకు సంబంధించిన డిస్కషన్స్‌లో మా ఇద్దరికీ సెట్ అవ్వలేదు. తొలి సినిమాకు నేను కథకుణ్ణి ఎలాగూ కాదు. తర్వాత చేసే సినిమా అయినా.. సొంత కథతో అనుకున్నది అనుకున్నట్లు తీయాలని మనసులో గట్టిగా అనుకున్నాను. అందుకే అభిప్రాయాలు కలవక రాజుగారి సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. తర్వాత వేరే కథకు అదే టైటిల్‌ని పెట్టి వీఎన్ ఆదిత్యతో రాజుగారు సినిమా తీశారు. ఎమ్మెస్ రాజుగారితో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని తెలీగానే... నాకు వెంటనే వచ్చిన మరో పిలుపు పూరిజగన్నాథ్ నుంచి. ‘చిరంజీవిగారబ్బాయి చరణ్‌ని లాంచ్ చేస్తున్నాం. డిస్కషన్స్‌కి నువ్వూ ఉంటే బావుంటుంది’ అంటే.. వెళ్లి రైటర్‌గా జాయినయ్యా. ఒక సినిమాను డెరైక్ట్ చేసిన తర్వాత, మళ్లీ ఇంకో డెరైక్టర్ దగ్గర రైటర్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయడం అనేది నిజంగా నవ్వాలో ఏడ్వాలో తెలీని పరిస్థితి. ప్రారంభంలో నాకు ఇలాంటి ఫీలింగ్ కలిగినా.. సినిమా వర్క్ స్టార్ట్ అయ్యాక.. నాకు ఆ ఫీలింగే కలక్కుండా చూసుకున్నారు పూరి. షూటింగ్ జరుగుతున్నంతసేపూ నన్నూ ఒక దర్శకునిగానే ట్రీట్ చేశారు. పూరితో అసోసియేషన్ నచ్చి ‘బుజ్జిగాడు’ సినిమాక్కూడా కంటిన్యూ అయిపోయాను. ఆ టైమ్‌లో పూరి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. బేసిగ్గా పూరి మంచి రైటర్ కాబట్టి... మా లాంటివాళ్లకు ఆయన దగ్గర పెద్ద పని ఉండేది కాదు. పెయిడ్ హాలిడేలా ఉండేది. ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం సజావుగా వెళ్లిపోతుండేది. ఓసారి ఉన్నట్టుండి ఎందుకో అనిపించింది.. ‘వచ్చిన పనిని మరిచిపోయి తిరుగుతున్నానా!’ అని. మళ్లీ సీరియస్‌గా ప్రయత్నాలు ప్రారంభించాను. ఎన్టీఆర్, పవన్‌కల్యాణ్.. ఇలా తిరగని హీరో లేడు, కలవని నిర్మాత లేడు..! కానీ ఎక్కడా వర్కవుట్ అవ్వలేదు.
 
 మరి ‘మిరపకాయ్’ ఎలా సెట్ అయ్యింది?
 హరీష్‌శంకర్: ఆ విషయం చెప్పేముందు రవితేజ గురించి చెప్పాలి. ఒక ఫ్లాప్ దర్శకుని ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా ఇండస్ట్రీలో చాలామంది ఇష్టపడరు. కానీ రవితేజ.. ‘షాక్’ సినిమా ఫ్లాప్ అని తెలిసిన తొలిరోజే నన్ను పిలిచి.. ‘ఒక మంచి కథ చేసుకో.. ఇద్దరం కలిసి మళ్లీ చేద్దాం. ‘షాక్’ గురించి ఆలోచించొద్దు’ అని ధైర్యం చెప్పారు. ఆ క్షణాన  నిజంగా ఉద్వేగానికి లోనయ్యాను. ఆయనైతే మంచితనంతో అంతటి ఫ్లాప్ తర్వాత కూడా ఆఫర్ ఇచ్చారు కానీ.. నాకైతే ఆయన్ను మళ్లీ కలవడానికి మొహం చెల్లలేదు. నాలుగేళ్లపాటు బయట హీరోలనే ట్రై చేశాను. కానీ ఆయన నన్ను వదల్లేదు. పిలిపించి మరీ ‘మిరపకాయ్’ అవకాశం ఇచ్చారు. రవితేజకి నేను తీర్చలేనంత రుణపడిపోయానండీ.. నాకు డెరైక్టర్‌గా జన్మనిచ్చింది రవితేజ, పునర్జన్మనిచ్చింది రవితేజ. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం రవితేజ. ఆయన లేకపోతే డెరైక్టర్‌గా నేను లేను.  
 
 వ్యక్తిగతానికొద్దాం. మీకు పొగరు అంటారు నిజమా?
 హరీష్‌శంకర్: ఏదీ మనసులో దాచుకోలేను. మొహం మీదే అనేస్తుంటా. దానికి ‘పొగరు’ అని పేరు పెట్టారు. ‘షాక్’ టైమ్‌లోనే నాకీ బిరుదు వచ్చేసింది. అప్పట్లో మేం రిలీజ్ చేయకుండానే ‘షాక్’ స్టిల్స్ ఓ వెబ్‌సైట్లోకొచ్చేశాయి. మేం రిలీజ్ చేయకుండా మా స్టిల్స్‌ని బయటకు తేవడం ఏంటని వాళ్లమీద కేకలేసేశాను. సైట్‌లో ఉన్న మా స్టిల్స్‌ని డిలీట్ చేయించాను. మనం అంత చేస్తే.. వాళ్లెందుకు ఊరుకుంటారు! సినిమా ఎప్పుడు రిలీజవుతుందా.. అని కాచుక్కూర్చున్నారు. రిలీజైంది. సినిమా కు నెగిటివ్ టాక్ వచ్చింది. ఇక రివ్యూ రూపంలో రెచ్చిపోయారు. ‘టీవీలో వచ్చే ‘నేరాలూ-ఘోరాలు’ కార్యక్రమాన్ని టికెట్ కొని చూడాలంటే ‘షాక్’ చూడండి’ అంటూ ఇష్టం వచ్చినట్లు రాసేశారు. చాలా బాధ పడ్డాను. ఆ రివ్యూని కట్ చేసుకొని దాచుకున్నాను కూడా. ఎప్పటికైనా సక్సెస్ కొట్టాలనే కసిని ఆ రివ్యూ నాలో పెంచింది.
 
 అలాంటి అనుభవం ఎదురైన తర్వాత కూడా.. మీడియాపై సెటైర్లు వేస్తారెందుకు?
 హరీష్‌శంకర్: నా తరఫున మీ ద్వారా... క్లారిటీగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. బ్యాడ్ ప్రొఫెషన్ ఏదీ ఉండదండీ.. బ్యాడ్ పీపుల్ అన్ని ప్రొఫెషన్సులోనూ ఉంటారు. ఓ ఆటోడ్రైవర్ ప్యాసింజర్‌ను మోసం చేస్తే, ఆటోడ్రైవర్లందరూ మోసగాళ్లు కాదు. ఓ చెడ్డవాడు ఆటోడ్రైవర్ అయ్యాడన్నమాట. ఓ బస్ కండెక్టర్ లేడీస్ విషయంలో తప్పుగా బిహేవ్ చేస్తే... ఆ వృత్తిని మనం నిందించకూడదు. చెడ్డవాడు కండక్టర్ అయ్యాడన్న విషయం గుర్తుంచుకోవాలి. నేను మీడియాను ఎప్పుడూ తప్పుపట్టను. నా దృష్టిలో అది గౌరవనీయమైన, బాధ్యతాయుతమైన వృత్తి. ఐ రెస్పెక్ట్ మీడియా ఎలాట్. కేవలం కొన్ని కొన్ని వెబ్‌సైట్ల గురించి నేను మాట్లాడి న దాన్ని అందరికీ ఆపాదించడం కరెక్ట్ కాదు.
 
 కానీ మీరన్న మాట మీడియా మొత్తానికీ వర్తిస్తుందని కొందరి అభిప్రాయం...
 హరీష్‌శంకర్: యద్భావం తద్భవతి... మనం ఎదుటివారిని ఏ దృష్టితో చూస్తే... వాళ్లు మనకు అదే దృష్టిలో కనిపిస్తారు. మనం కావాలి అనుకున్నవారు, మనపై మంచి అభిప్రాయం ఉన్నవారు, మనలో ఎన్ని లోపాలున్నా పట్టించుకోరు. మనల్ని ఏకేయాలనుకున్నప్పుడు మన మంచిని కూడా తప్పుగానే చూపిస్తారు. హరీష్ అనేవాడు మీడియాపై విరుచుకుపడుతున్నాడు అనే దృష్టితో సైట్ ఓపెన్ చేస్తే.. కచ్చితంగా నేను వాళ్లకు తప్పుగానే కనిపిస్తా. మనుషుల జీవితాలు ఎఫెక్ట్ అయ్యే స్థాయిలో గాసిప్పులు రాయకూడదు. అవి చదివి ఇంట్లో వాళ్లు ఆందోళనకు గురైతే? ‘గబ్బర్‌సింగ్’లో ఓ డైలాగ్ ఉంది. ‘మనకున్న తిక్క అవ్వచ్చూ... కోపం అవ్వచ్చూ... మూర్ఖత్యం అవ్వచ్చూ... తెగింపు అవ్వచ్చు... ఏదైనా అది మనల్ని ముందుకు తీసుకెళుతుందా, లేక వెనక్కి లాగుతుందా అని ఆలోచించాలి’ అని. నాకున్న ఎగ్రెసివ్‌నెస్ వల్ల నాకు జరిగిన నష్టం ఏమీ లేదు. ఇన్‌ఫ్యాక్ట్ నేను చాలా త్వరగా డెరైక్టర్ అయ్యాను. నేను చాలా స్పీడ్‌గా సినిమాలు తీస్తాను. నా క్వాలిటీ నాకు మైనస్ అవుతుందంటే... డెఫినెట్‌గా మార్చుకుంటా.
 ట్విట్టర్లో కూడా మీకు వ్యతిరేకంగా ఎవరైనా ట్వీట్ చేస్తే... మీరు స్పందించే తీరు చాలా ఘాటుగా ఉంటుంది. ఒక స్టార్ డెరైక్టర్‌గా అలా స్పందించడం కరక్టే అంటారా?
 హరీష్‌శంకర్: నా ట్వీట్స్ చూడండి. సాధ్యమైనంతవరకూ ఆనెస్ట్‌గానే ఉంటాయి. ఒక డెరైక్టర్‌గా నా సినిమాకు సంబంధించిన కరెక్ట్ ఫీడ్‌బ్యాక్ తెలుసుకోవాలనే నేను ట్విట్టర్‌ని ఫాలో అవుతాను. కానీ కొంతమంది ట్వీట్స్ మన సహనాన్ని పరీక్షిస్తుంటాయి. విమర్శకు ఓ పద్ధతి ఉందండీ.. నా వర్క్‌ని ఎంత విమర్శించినా నేను బాధ పడను. కానీ వ్యక్తిగత విమర్శలకు దిగితే మాత్రం క్షమించను. ‘నీకంత లేదురా...’ అని ట్వీట్ చేయడాలు, వల్గర్ కామెంట్స్ పోస్ట్ చేయడాలు కరెక్ట్ కాదు. అలాంటివి చేస్తే.. అంతే తీవ్రంగా స్పందిస్తున్నాను. ఇకముందు కూడా అలాగే స్పందిస్తాను.
 
 ఈ మధ్య మీపై కొన్ని రూమర్లు కూడా వచ్చాయి కదా...
 హరీష్‌శంకర్: ముసుగులో గుద్దులాట అనవసరం. చార్మి గురించేగా మీరు మాట్లాడుతోంది. ఆ రూమర్ ఎలా పుట్టిందో నాకిప్పటికీ అర్థం కాని విషయం. దీని గురించి అడుగుదామని చార్మీకి ఫోన్ చేశాను. ఆ అమ్మాయి లోకల్‌లో లేకపోవటంతో ఫోన్ కలవలేదు. తర్వాత తానే.. అందులో నిజం లేదని ట్వీట్ చేసింది. నిజానికి తాను ట్వీట్ చేసేంత వరకూ ఈ విషయంపై చాలా బాధపడ్డాను. ఓ వారం రోజుల పాటు తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యాను. తర్వాత మేమిద్దరం కలుసుకొని మాట్లాడుకున్నాం కూడా.
 
 ఏదో పార్టీలో ఈ సంఘటన జరిగిందని వార్తలొచ్చాయి. అసలేం జరిగింది?
 హరీష్‌శంకర్: ఓ పార్టీకి అందరం వెళ్లాం. దాన్ని బేస్ చేసుకొని ఓ వెబ్‌సైట్‌లో కథ అల్లేశారు. ఈ గాసిప్... హల్‌చల్ చేస్తున్న టైమ్‌లోనే ఓ ఇంగ్లిష్ పత్రికావిలేఖరి ఫోన్‌చేసి వివరణ అడిగాడు. ‘ఇది ఎలా పుట్టిందో నాకూ అర్థం కావడం లేదండీ... నేను మిమ్మల్ని కలిసి పూర్తి వివరణ ఇస్తాను’ అని చెప్పాను. కానీ అతను ‘నిప్పు లేకుండా పొగ రాదు కదా’ అన్నాడు. నాకు మామూలుగానే టెంపర్ ఎక్కువ. ‘అది నిప్పు విషయంలోనే కానీ, మనిషి విషయంలో కాదు. అసలు నీకు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు’ అని ఘాటుగా చెప్పా. పొద్దున్నే పేపర్ చూస్తే.. దీని గురించి ఇంతపెద్ద ఆర్టికల్ ఉంది. నేను షాక్. ప్రెస్‌మీట్ పెడదామనుకున్నా. ‘అది ఇంగ్లిష్ పేపర్. ఎంతమంది చదువుతారు? ప్రెస్‌మీట్ పెట్టి ప్రపంచం మొత్తం తెలియజేయడం దేనికి?’ అని ఓ పాత్రికేయ మిత్రుడు అనడంతో.. ఆ ఆలోచనను విరమించా.
 
 ఇన్ని చూశారు కదా.. ఇకనైనా లౌక్యంగా ఉండొచ్చుగా?
 హరీష్‌శంకర్: ‘ఆకలిరాజ్యం’లో కమల్‌హాసన్ అంటారు. ‘ఎలాగోలా బతకాలనుకుంటే ఎలాగైనా బతకొచ్చు. ఇలాగే బతకాలి అనుకున్నాను కాబట్టే ఇన్ని కష్టాలు’ అని. నా పద్ధతీ అంతే. ఎవరికోసమో నేను మారను. ‘షాక్’ తర్వాత గ్యాప్ రావడంతో స్టోరీ సిట్టింగ్స్‌కి వెళ్లేవాణ్ణి. ఓ సినిమా స్టోరీ సిట్టింగ్ గోవాలో పెట్టారు. నాకు ఫ్లైట్ టికెట్ తీశారు. నాతో పాటు సిట్టింగ్‌లో కూర్చునే ఇంకో రైటర్‌కి బస్ టికెట్ తీశారు. మేమిద్దరం కథ గురించి డిస్కస్ చేసుకుంటూ గోవా వెళదాం అనుకున్నాం. కానీ ఇద్దరిదీ తలోదారి అయ్యింది. దాంతో నిర్మాతతో గొడవ పెట్టుకున్నా. ‘నేను డెరైక్టర్‌గా వెళుతున్నప్పుడు నువ్వు నాకు ఫ్లైట్ టికెట్ తీయ్ కాదనను. కానీ ఇప్పుడు నేను ఓ రైటర్‌గా వెళుతున్నాను. తను, నేను ఇద్దరం ఈ సినిమాకు రైటర్లమే.  ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అనుకుంటే ఇద్దరికీ బస్ టికెట్టే తీయండి. అంతేకానీ.. నాకు ఫ్లైట్... ఆయనకు బస్ టికెట్ తీస్తే.. ఈ అసమానతల కారణంగా కలిసి ప్రశాంతంగా ఎలా పని చేయగలం’అని నిర్మొహమాటంగా చెప్పా. ఆ ప్రొడ్యూసర్ కూడా నా బాధ అర్థం చేసుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చాకే కాదు. చిన్నప్పట్నుంచీ నేనింతే.  
 
 రాజీ పడి బతక్కపోతే ఇండస్ట్రీలో ఎదగలేం అంటారు. మీరేమో అందుకు భిన్నంగా ఉన్నారు?

 హరీష్‌శంకర్: చూడండీ... సినిమా ఇండస్ట్రీకి రావాలని చాలామందికి ఉంటుంది. కానీ లైఫ్‌తో రాజీపడిపోయి ఆ కోరికను చంపుకుంటారు. రకరకాల బరువుబాధ్యతలు వాళ్లను ధైర్యంగా ముందుకు వెళ్లనీయవు. అద్భుతమైన టాలెంట్ ఉండి కూడా తెరవెనుకే మిగిలిపోతారు. కానీ నేను అలాకాదు. లైఫ్‌తో కాంప్రమైజ్ అవ్వడం ఇష్టం లేక... ఇండస్ట్రీకి వచ్చాను. వచ్చిన తర్వాత మళ్లీ రాజీపడమంటే ఎలా చెప్పండి. దానికి నేను అస్సలు ఒప్పుకోను.
 
 చిన్నప్పట్నుంచీ మీరింతేనా?

 హరీష్‌శంకర్: ఇంతే... ఈ రాముడు మంచి బాలుడూ కాదు. అలాగని చెడ్డబాలుడూ కాదు.  
 
 మీ కుటుంబ నేపథ్యం తెలుసుకోవాలనుంది..?
 హరీష్‌శంకర్: నేను పుట్టిందీ పెరిగిందీ అంతా హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్‌లోనే. 10వ తరగతి మాత్రం జగిత్యాలలో చదివాను. మా నాన్నగారు తెలుగు మాస్టర్. అష్టావధాని కూడా. అమ్మ హౌస్‌వైఫ్. నేను ఇంటికి పెద్దకొడుకుని. తమ్ముడు ప్రస్తుతం జాబ్‌లో ఉన్నాడు. చెల్లికి పెళ్లయ్యింది. బావకు యూఎస్‌లో జాబ్. మా నాన్న నాకిచ్చిన ఆస్తి ఒక్కటే.. తెలుగుభాష. అందరూ నన్ను ఇంగ్లిష్ మీడియంలో జాయిన్ చేయమని చెబుతున్నా.. నాన్నమాత్రం తెలుగు మీడియంలోనే చేర్చారు. నేను అదృష్టవంతుణ్ణి అయ్యింది అక్కడే. నాన్నగారు నా అంత స్పీడ్‌కాదు. చాలా నెమ్మదస్థుడు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. హైదరాబాద్ బాగా డెవలప్ అవుతుంది కదా... ఓ స్థలం కొనేద్దాం అనే తెలివితేటలు కూడా ఆయనకు ఉండేవి కావు. అప్పుడప్పుడు నేను తెలీనితనంతో అంటుండేవాణ్ణి.. ‘ఏమిచ్చారు మీరు మాకు’ అని. ఇప్పుడు నేను డెరైక్టర్ అయ్యాక తెలిసింది ఆయన నాకు ఏమిచ్చారో.  
 
 మీ నాన్న నుంచి మీరేం నేర్చుకున్నారు?
 హరీష్‌శంకర్: నాకు ఆయన తండ్రి మాత్రమే కాదు. గురువు కూడా. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఆయనే. స్కూల్లో నేను మంచి స్టూడెంట్‌ని. టెన్త్ వరకూ క్లాస్ ఫస్ట్ వచ్చేవాణ్ణి. ఇంటర్‌కి వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌నయ్యాను. నా చదువుపై మా నాన్నకు పూర్తి నమ్మకం. మా నాన్న తెలుగు టీచర్ అవడంతో... స్కూల్ అయ్యాక ఆయనకు పెద్ద పనుండేది కాదు. మ్యాథ్య్, సైన్స్ చెప్పే టీచర్లు మాత్రం సాయంత్రం పూట ట్యూషన్లు చెప్పుకుంటూ చేతినిండా సంపాదించేవారు. అందుకే మా నాన్నకు పెద్ద కోరిక ఉండేది. ఎలాగైనా నా కొడుకుని  మ్యాథ్స్ టీచర్నో లేక సైన్స్ టీచర్నో చేయాలి అని. కాలేజ్ అయ్యాక అప్పుడు మేం కూడా ఇంట్లో ట్యూషన్లు చెప్పుకోవచ్చు అనేది ఆయన ఆశ. మేం ఆర్థిక బాధలు పడకూడదని, మాకు ఏ లోటు కలగకూడదని ఓ వైపు టీచర్‌గా చేస్తూ, మరోవైపు నాన్న పౌరోహిత్యం కూడా చేసేవారు. నాకు బాధ అనిపించేది. ‘దేనికి బాధ.. పౌరోహిత్యం అంటే పదిమంది హితం కోరడం’ అని నాన్న నాకు సర్ది చెప్పేవారు. నాకు గాయత్రీ మంత్రోపదేశం చేశారు కాబట్టి సంధ్యావందనం వచ్చు. ఇదిగాక వేదపఠనం నేర్పారు.
 
 మీరు సాహిత్యాభిలాషి, రచయిత అని విన్నాం. సాహిత్యాభిమానం ఎలా మొదలైంది మీకు?  
 హరీష్‌శంకర్: నాకు సమ్మర్ ఎలర్జీ ఉండేది. ఎండలు ఎక్కువగా ఉంటే ముక్కులోంచి బ్లీడింగ్ అవుతుండేది. దాంతో సమ్మర్ వచ్చిందంటే చాలు ఇంట్లో అందరికీ టెన్షన్. పైగా నేను చిన్నప్పట్నుంచీ బాగా హైపర్. ఒకచోట ఉండేవాణ్ణికాదు. దాంతో నాన్న నన్ను బయటకు వెళ్లనీయకుండా... చిన్నప్పట్నుంచీ మధుబాబు డిటెక్టివ్ నవలలు తీసుకొచ్చి చదవమనేవారు. వాటిల్లో పడైనా బయటకు వెళ్లకుండా ఉంటాడని నాన్న ఆలోచన. అలా పుస్తకాలు చదవడం అలవాటైంది. నైన్త్‌క్లాస్‌కి వచ్చేసరికే యండమూరి, మల్లాది నవలలు ఆల్‌మోస్ట్ నమిలేశా. తర్వాత చలం, తిలక్, శ్రీశ్రీ, శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి, అడవిబాపిరాజు... ఇలా మహామహుల రచనలన్నింటినీ చదివేశా. ఓ విధంగా చెప్పాలంటే మా ఇల్లే ఓ లైబ్రరీ. ఈ రోజున నేను రాయగలిగున్నానంటే... కారణం ఆ పుస్తకాలే.
 
 సరే... డెరైక్టర్ అవాలనే ఆలోచన ఎలా మొదలైంది?
 హరీష్‌శంకర్: బీహెచ్‌ఈఎల్ అంటే... అదొక కల్చరల్ హబ్. పరిషత్తు నాటకాలకు పెట్టింది పేరు. ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడే పరిషత్ నాటకాల్లోకి ఎంటరయ్యా. నాయుడు గోపి, మిశ్రో మాకు హీరోలు. వారి నాటకం అంటే.. స్టేజ్ డెకరేషన్ నుంచి ‘పరబ్రహ్మ...’ పాడేంత వరకూ వారితోనే ఉండేవాణ్ణి. చాలా నాటకాల్లో బాలనటుడిగా నటించాను. తర్వాత మా గురువు మోహన్‌రావుగారు నాటకాన్ని డెరైక్ట్ చేస్తుంటే... ఆయనకు సహాయకునిగా ఉండేవాణ్ణి. అలా నాటకరంగంలో అసిస్టెంట్‌గా నా దర్శక ప్రస్థానం మొదలైంది. అయిదొందలు ఇస్తామంటే... వారం రోజులు కష్టపడి రిహార్సల్స్ చేసి దూరదర్శన్‌లో డ్రామాలు వేసేవాళ్లం. ఆ అనుభవమే నన్ను సినిమాలవైపు నడిపించింది.
 
 ఫస్ట్ ఎవర్ని కలిశారు?
 హరీష్‌శంకర్: ఈవీవీ గారిని. ఆయన రైటర్లను బాగా ఎంకరేజ్ చేస్తారు. ‘రచనా సహకారం’ అని ఓ పదిమంది రైటర్ల పేరు టైటిల్స్‌లో వేస్తారు. అందులో ఒకడిగా జాయిన్ అయితే చాలని తిరిగాను. అవకాశం రాలేదు.
 
 తొలిసారి ఎవరిదగ్గర పనిచేశారు?
 హరీష్‌శంకర్: పర్టిక్యులర్‌గా ఒకరి దగ్గర అని లేదు. చాలామంది దగ్గర ఘోస్ట్‌గా చేశా. అయితే.. కెరీర్ ప్రారంభంలో నన్ను ఎంకరైజ్ చేసిన వ్యక్తుల్లో ఇద్దరి పేర్లు మాత్రం కచ్చితంగా చెప్పాలి. వారే దుర్గా ఆర్ట్స్ ఎస్.గోపాల్‌రెడ్డి, కె.ఎల్.నారాయణ. వారి తర్వాత రవిరాజా పినిశెట్టి. ఆయన ‘వీడే’ సినిమాకు పనిచేశా. అప్పుడే ‘నేనూ ఓ సినిమాకు డెరైక్ట్ చేయొచ్చు’ అనే నమ్మకం ఏర్పడింది.
 
 మరి రామ్‌గోపాల్‌వర్మతో పరిచయం ఎలా?
 హరీష్‌శంకర్: దానికి కారణం రవితేజగారు. ‘నా ఆటోగ్రాఫ్’ టైమ్‌లో ఆయనకు ఓ కథ చెప్పాను. అది ఆయనకు నచ్చేసి డవలప్ చేయమన్నారు. ఈ లోపు వర్మగారు హిందీ, తెలుగు భాషల్లో ‘షాక్’ ప్రాజెక్ట్‌ని లైన్లో  పెట్టారు. ‘ఢర్‌నా మనాహై’ఫేం ప్రవాల్‌రామన్ డెరైక్టర్. తెలుగు వెర్షన్‌కి తెలుగు తెలిసిన కో-డెరైక్టర్ కావాలి అనుకున్నప్పుడు రవితేజ నా పేరు సజెస్ట్ చేశారు. ‘షాక్’ సినిమా కో-డెరైక్టర్‌గా, కోన వెంకట్‌తో కలిసి ముంబయ్‌లో అడుగుపెట్టా. వర్మ మా ఇద్దరికీ ‘షాక్’ కథ చెప్పారు. ఒక మారియో ప్యూజో నవల చదువుతున్నట్లు కళ్ల ముందు సినిమా కనిపించింది. ఇలాక్కూడా కథ చెప్పొచ్చా అనిపించింది. ఎలా ఉంది అన్నారు. మనకు నోటి దూల ఎక్కువ కదా. ‘కథ అద్భుతంగా ఉందిసార్. అయితే... రవితేజ మీద వర్కవుట్ అవ్వదు’ అని టక్కున అనేశాను. కోన పక్కనుండి గిల్లుతున్నా పట్టించుకోలా. వర్మ నా వంక కోరగా చూశారు. ‘హైదరాబాద్ నుంచి వచ్చి నా కథ వర్కవుట్ అవ్వదంటావా... నీ డెసిషన్ తీసుకొని సినిమా తీయడం మానేస్తాననుకున్నావా?’ అన్నారు సూటిగా. ‘మీరేం మానొద్దండీ.. ఇది రవికి బాగోదు అన్నాను అంతే’ అన్నాను రెట్టిస్తూ.. ‘సరే ఏం చేస్తే బావుంటుందో చేయ్. ఈ సినిమాకు నువ్వే డెరైక్టర్‌వి’ అని సీరియస్‌గా నన్ను డెరైక్టర్‌ని చేసేసి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. అందరూ షాక్. అప్పటికే రవితేజకు కథ చెప్పి ఉండటంతో ఆలోచనలో పడ్డాను. ‘వర్మతో పాటు నీ పేరు స్క్రీన్‌మీద వస్తుంది. ఇది మామూలు అవకాశం కాదు. డెరైక్ట్‌గా ప్లేట్ నీ ముందుకొస్తే తిననంటావేంటి?’ అని నచ్చజెప్పారు కోన. వర్మగారి లైన్ అలాగే ఉంచి, స్క్రీన్‌ప్లేలో కొన్ని మార్పులు చేశా. ఒకవేళ సినిమా అందుకే పోయిందేమో. ఆయన చెప్పినట్టు తీస్తే ఫలితం ఎలా ఉండేదో.
 
 వర్మ వద్ద పనిచేయకపోయినా... ఆయన లక్షణాలు మీలో కొన్ని కనిపిస్తుంటాయి?
 హరీష్‌శంకర్: ఒకళ్లను చూసి ఎడాప్ట్ అవ్వలేమండీ.. గాంధీమహాత్ముణ్ణి చూసి ప్రపంచం అంతా అడాప్ట్ అయిపోవచ్చుగా.. మనం అవ్వలేం. మనలో ఏది ఉంటుందో.. అదే మనకు నచ్చుతుంది. అది ఎదుటివారిలో కనిపిస్తే ఆటోమేటిగ్గా వాళ్లను మనం ఇష్టపడతాం. బహుశా.. నాలో నాకు నచ్చే అంశాలు ఆయనలో నాకు కనిపించి ఉండొచ్చు. చూడండీ.. మన సెల్‌లో సిమ్‌కార్డ్ ఉంటేనే సిగ్నల్స్ వస్తాయి.
 
 ఆ విషయాన్ని పక్కనపెడదాం... మీది ప్రేమ వివాహమట కదా. కాస్త మీ ప్రేమకథ చెబుతారా?
 హరీష్‌శంకర్: పెద్ద లవ్‌స్టోరీ ఏం లేదండీ... తను ఎన్‌ఆర్‌ఐ. కెనడాలో ఉండేది. పేరు స్నిగ్ద. క్లినికల్ సైకాలజిస్ట్. ఆటిజంతో ఇబ్బంది పడుతున్న పిల్లలకు కౌన్సెలింగ్ చేస్తుంది. స్నేహితుని బర్త్‌డే పార్టీలో తొలిసారి తనను చూశాను. అప్పుడే ఆమెతో పరిచయం అయ్యింది. తర్వాత తను కెనడా వెళ్లిపోయింది. అనుకోకుండా ఇంటర్‌నెట్‌లో కలిసింది. మా ఇద్దరి అభిప్రాయాలూ కలిశాయి. కానీ మా కులాలు వేరవడంతో మా ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. ఎలాగోలా ఒప్పించి చెల్లి పెళ్లి అయ్యాక... పెళ్లి చేసుకున్నా.  సినిమాలపై తనకు లీస్ట్ నాలెడ్జ్. ఒక దర్శకునిగా కాక, వ్యక్తిగా నన్ను ఇష్టపడటం నాకు నచ్చింది. అందుకే పెళ్లి చేసుకున్నాను.
 
 పిల్లల సంగతేంటి?

 హరీష్‌శంకర్: పిల్లలపై ఇంట్రస్ట్ లేదండీ. నా మార్కుల గురించి, నా లైఫ్ గురించి టెన్షన్ పడుతున్న ఈ దశలో... పిల్లల మార్కుల గురించి, పిల్లల లైఫ్‌ల గురించి ఆలోచించలేను.


 - బుర్రా నరసింహ
 
 ‘గబ్బర్‌సింగ్’ విషయంలో పవన్‌కల్యాణ్ కంట్రిబ్యూషన్ ఎంత?
 హరీష్‌శంకర్: ఆ సినిమా విషయంలో కల్యాణ్‌గారి కంట్రిబ్యూషన్ చాలా ఉంది. ‘గబ్బర్‌సింగ్’ టైటిల్ పెట్టింది ఆయనే. క్యారెక్టరైజేషన్ విషయంలో కూడా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమాలో ఓ మంచి మద్దెల ప్రోగ్రామ్ ఉంటే బాగుంటుందని ఆయన చెబితే.. ‘అంత్యాక్షరి ఎపిసోడ్’ని డిజైన్ చేసి దాన్ని పర్పస్‌ఫుల్‌గా వాడాను. సినిమా మొత్తానికి ఎంత కష్టపడ్డానో.. ఆ ఒక్క ఎపిసోడ్ విషయంలో అంత కష్టపడ్డాను. దాదాపు మూడొందల పాటల్ని విని, అందులోంచి కొన్ని పాటల్ని వడపోత కట్టి, ఆ ఎపిసోడ్ చేశాం. తర్వాత చాలా సినిమాల్లో దాన్ని ప్రేరణగా తీసుకొని సన్నివేశాలొచ్చాయి. ఆ సినిమా మాతృక ‘దబాంగ్’ను నేనెంత ఛేంజ్ చేయకపోతే.. ‘మాటలు, మార్పులు’ అనే టైటిల్ కార్డ్ వేసుకుంటానో అర్థంచేసుకోండి. కల్యాణ్‌గారి ‘తొలిప్రేమ’ షూటింగ్ బీహెచ్‌ఈఎల్‌లో జరిగినప్పట్నుంచీ, ‘గబ్బర్‌సింగ్’ తొలిషాట్ తీసేంతవరకూ.. ఈ మధ్యలో వచ్చిన వపన్ సినిమాలు, పవన్ డైలాగులు, పవన్ స్టైల్స్‌తో కలిసి నేను చేసిన ప్రయాణ ఫలితమే ‘గబ్బర్‌సింగ్’ సినిమా. పవన్‌పై నాకున్న ఇష్టానికి ప్రతీక ‘గబ్బర్‌సింగ్’.
 
 
 లైఫ్‌లో గుర్తుండిపోయిన సంఘటనలు?
 హరీష్‌శంకర్: మనసుకు బాధ పెట్టిన సంఘటనలే నన్ను ఎక్కువ హంట్ చేస్తుంటాయి. ఉదాహరణకు వడ్డే నవీన్‌గారి సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా నేను ఓకే అయ్యాను. అన్నపూర్ణ స్టూడియోలో ఓపెనింగ్. ముహూర్తం అయిపోగానే... సదరు దర్శకుడు పక్కకు పిలిచి... ‘నేను ఫస్ట్ టైమ్ డెరైక్ట్ చేస్తున్నాను. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టాఫ్‌ని పెట్టుకోలేం’ అన్నారు. బాధతో బయటకెళ్లిపోయాను. తర్వాత అదే డెరైక్టర్ ఇంకో సినిమాకు నన్ను తీసుకొని రెండ్రోజుల తర్వాత పంపించేశారు. ఆ క్షణంలో ఎంత బాధ అనిపిస్తుందో అర్థం చేసుకోండి. అంలాంటి బాధల్ని ఎన్నోసార్లు ఫేస్ చేశా. బంజారాహిల్స్ నుంచి అమీర్‌పేట వరకు కన్నీటితో నడుచుకుంటూ వెళ్లిపోయిన సందర్భాలున్నాయి. ఓ ప్రైవేటు ఆల్బమ్ షూటింగ్ చేస్తున్నాం. ప్రముఖ కెమెరామేన్ ఆ ఆల్బమ్‌కి పనిచేస్తున్నారు. ఏదో పనిచేస్తూ... తెలీక కెమెరాకు అడ్డుగా నిలబడ్డాను. అప్పటికే ఆ కెమెరామేన్ చాలా ఇరిటేషన్‌లో ఉన్నట్టున్నారు. నేను లొకేషన్‌లో ఉండేసరికి... ఆయనకు కోపం ఆగలేదు. నా చొక్కా కాలర్ పట్టుకొని బయటకు లాక్కెళ్లారు. కచ్చితంగా అక్కడ తప్పు నాదే అయినా.. ఆ క్షణాన చాలా బాధ పడ్డాను. ఆ సంఘటన నాకు అలాగే ఎందుకు గుర్తుండిపోయిందంటే... ఆ రోజు నా పుట్టిన రోజు . అయితే.. నేను డెరైక్టర్‌ని అయ్యాక ఆయనతోనే కలిసి పనిచేశా. నేను ఎంత ఎగ్రెసివ్‌గా ఉంటానో, అంత సున్నితంగా ఉంటా. పిలిస్తే కన్నీళ్లు వస్తాయి నాకు. ఉదాహరణకు ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ఇన్సిడెంట్ జరిగాక, వారం రోజులు మనిషిని కాలేకపోయాను.
 

మరిన్ని వార్తలు