విషాలను విసర్జించే ముల్లంగి

19 Sep, 2017 00:03 IST|Sakshi
విషాలను విసర్జించే ముల్లంగి

గుడ్‌ ఫుడ్‌

సాంబారులో కూర ముక్కలను వెతుక్కునే అలవాటు ఉన్నవారు ముల్లంగిని బాగా ఇష్టపడతారు. దుంపకూరల్లో ఒకటైన ముల్లంగి ముక్కలను సలాడ్‌గా కూడా తింటారు. ముల్లంగితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని...

ముల్లంగి కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది. అది ఒంటిలోని విషపదార్థాలను హరిస్తుంది. అలా కాలేయం మీద భారాన్ని తొలగిస్తుంది. కామెర్ల రోగుల్లో జరిగే ఎర్ర రక్త కణాల వినాశనాన్ని నివారిస్తుంది. అందుకే ముల్లంగిని కామెర్లు వచ్చిన రోగులకు సిఫార్సు చేస్తారు.   ముల్లంగి జీర్ణవ్యవస్థను కూడా శుద్ధి చేస్తుంది. పేగులను శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చూడటంతో పాటు పేగుల్లో తగినన్ని నీటిపాళ్లు ఉండేలా చేసి మలబద్దకాన్ని నివారిస్తుంది. తద్వారా మొలల (పైల్స్‌) సమస్య రాకుండా కాపాడుతుంది.  ముల్లంగిలో విషాలను హరించడంతో పాటు, ఆ విషాలను బయటకు పంపించే గుణం వల్ల అది  మూత్రవిసర్జక వ్యవస్థ

ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మూత్రపిండాలను శుభ్రపరచడంతో పాటు మూత్రవ్యవస్థను ప్రక్షాళన చేస్తుంది.  ముల్లంగిలో ముడుచుకుపోయిన గాలి గొట్టాలను విప్పార్చే గుణం ఉంది. అందుకే బ్రాంకైటిస్, ఆస్తమా సమస్యలకు ముల్లంగి మంచి విరుగుడుగా పనిచేస్తుంది. అంతేకాదు... అనేక అలర్జీలు, జలుబు లేదా శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లకు స్వాభావికమైన మంచి మందుగా కూడా పనిచేస్తుంది. ముల్లంగిలో పొటాషియమ్‌ పాళ్లు ఎక్కువ. అందుకే ఇది అధిక రక్తపోటును సమర్థంగా నివారిస్తుంది. రక్తనాళాలపై పడే ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా రక్తప్రసరణ వ్యవస్థ సమర్థంగా పనిచేసేలా చూస్తుంది. 

మరిన్ని వార్తలు