ఊపిరితో వ్యాయామం...ఉబ్బసానికి ఉపశమనం

15 Dec, 2017 00:06 IST|Sakshi

ఉబ్బస వ్యాధితో సతమతమయ్యేవారికి ఊపిరితో చేసే వ్యాయామం ఎంతో మేలు చేస్తుందని ఓ అధ్యయనం ద్వారా తేల్చారు శాస్త్రవేత్తలు. లాన్‌సెట్‌ రెస్పిరేటరీ మెడిసిన్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నా.. సమస్యలు ఎదుర్కొనే వారికి బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజులు మేలు చేస్తాయి. కొన్ని వందల మంది కార్యకర్తలను మూడు గ్రూపులుగా విభజించి కొందరికి డీవీడీ ద్వారా ఇంకొందరికి ఫిజియోథెపరిస్టు ద్వారా బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజుల్లో శిక్షణ ఇచ్చారు. మూడో గ్రూపుకు సాధారణ చికిత్స కొనసాగించారు. దాదాపు పన్నెండు నెలల తరువాత వీరందరి దైనందిన జీవితంలో ఉబ్బసం వల్ల కలిగిన ఇబ్బందులు ఎలా ఉన్నాయి? అని ఒక పద్ధతి ప్రకారం లెక్కకట్టారు.

మందులు మాత్రమే తీసుకుంటున్న వారితో పోలిస్తే వ్యాయామం చేసే వారి ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడిందని, గాలిగొట్టాల్లో ఇన్‌ఫ్లమేషన్‌ కూడా తగ్గిందని తెలిసింది. ఉబ్బసం అటాక్‌లు కూడా వ్యాయామం చేసే వారిలో తగ్గినట్లు తాము గుర్తించామని కాకపోతే ఇవి లెక్క కట్టే స్థాయిలో లేవని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హైవెల్‌ విలియమ్స్‌ తెలిపారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ప్రభుత్వ ఆరోగ్యసేవల సంస్థ చేపట్టిన ఈ స్టడీ వల్ల ఉబ్బస వ్యాధిగ్రస్థుల జీవితంలో ఒకంత మెరుగుదల కనిపించడం మాత్రమే కాకుండా, ప్రభుత్వాలు చికిత్సకు పెట్టాల్సిన ఖర్చులూ తగ్గుతాయని అంచనా. 

మరిన్ని వార్తలు