ఎంత సమయం కేటాయిస్తున్నారు?

11 Jan, 2020 03:00 IST|Sakshi

పేరెంటింగ్‌

తీరికలేని పనులు ఎన్ని ఉన్నా పిల్లలతో తల్లిదండ్రులు రోజులో కొంత క్వాలిటీ టైమ్‌ గడపాలని నిపుణులు చెబుతుంటారు. పిల్లలు చాలాసార్లు చిరాకు పెట్టిస్తుంటారని తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో వారిని తిట్టి చెప్పడానికి బదులు తల్లిదండ్రులుగా మొదట పిల్లల ప్రవర్తనకు గల కారణాన్ని గుర్తించాలి. పిల్లలు కోరుకునేది తమ పట్ల పెద్దలు కొంత శ్రద్ధ చూపడాన్నే. అది కరువైనప్పుడు పిల్లలు నిరాశకు లోనై తమ ప్రతికూల వైఖరి ద్వారా కోపాన్ని వ్యక్తం చేస్తారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపాలని పెద్దలు, నిపుణులు పదే పదే చెబుతుంటారు. మీకు ఎన్ని పనులున్నప్పటికీ పిల్లలతో రోజులో కనీసం 30 నిమిషాలు కేటాయించడం వల్ల వారి నుంచి మంచి ఫలితాలను రాబట్టవచ్చు అంటున్నారు మానసిక నిపుణులు. పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి

తల్లిదండ్రులు ఎంచుకోదగిన విషయాలు ఇవి...
1. రోజులో పిల్లలతో గడపడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించండి. రాత్రి భోజనానికి ముందు లేదా నిద్రపోయే సమయంలో మీ షెడ్యూల్‌ను వారికోసం కేటాయించవచ్చు. ఈ సమయంలో పిల్లలతో కలిసి పుస్తక పఠనం.. వంటి ఆసక్తి కలిగించే పనుల్లో మీరూ పాల్గొనండి.
2. ఏదైనా సరే మీరు పిల్లలతో గడిపే సమయం ప్రత్యేకంగా ఉండాలి. పిల్లలతో కలిసి ఒకే గదిలో కబుర్లు చెబుతూ ఉండటం కావచ్చు లేదా బయట ఏదైన ఫంక్షన్‌కు వారితో కలిసి హాజరు కావచ్చు. మీరు మీ బిడ్డతో గడిపే ఆ 30 నిమిషాల్లో వారి దృష్టి కేంద్రంగా మీరు ఉండాలి.
3. మీ బిడ్డకు కూడా సమయం కేటాయించడం విషయంలో ఒక స్పష్టత ఇవ్వండి. మీ పిల్లల కోసం ఈ సమయాన్ని వినియోగిస్తున్నామని తెలియజేయండి.  
4. ఎంచుకున్న క్వాలిటీ సమయంలో పిల్లలు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పమనండి. దానికి మీరు ఓకే అనేస్తే పిల్లలు తమ మాటకు పెద్దలు విలువ ఇస్తున్నారని గమనిస్తారు. అంతేకాదు తాము చెప్పాలనుకున్న సృజనాత్మక విషయాల్లో ఆసక్తిని చూపుతారు.
5. పిల్లలకోసం కేటాయించిన సమయంలో ఇతర సమస్యలపై దృష్టి పెట్టకండి. మీరు పిల్లలతో కూర్చున్నప్పుడు మీ స్వంత పనులు లేదా వృత్తిపరమైన కట్టుబాట్లు ఇతర విధుల గురించి మాట్లాడకుండా ఉండటం మంచిది.

మరిన్ని వార్తలు