గడప దాటకుండానే గడించండి...

22 Aug, 2014 22:54 IST|Sakshi
గడప దాటకుండానే గడించండి...

కాస్తంత నైపుణ్యం .. మరికాస్త సమర్ధత ఉంటే చాలు ఇంటి నుంచి కదలకుండా ఆదాయాన్ని ఆర్జించేందుకు ప్రస్తుతం మార్గాలనేకం ఉన్నాయి. టైమ్ మేనేజ్‌మెంట్ గురించి తెలిస్తే ఇటు ఇంటి బాధ్యతలు అటు వ్యాపార బాధ్యతల మధ్య సమతూకం పాటించడం అంత కష్టం కాదు. చక్కగా చేసుకోగలిగితే పెద్దగా పెట్టుబడితో పనిలేకుండానే .. చెప్పుకోతగ్గ స్థాయిలో ఆదాయం అందించే చిన్న స్థాయి వ్యాపారాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్ని..
 
కుకింగ్ క్లాసులు

నోరూరించే, రుచికరమైన వివిధ రకాల వంటకాలు.. ప్రయోగాలు చేయడంలో మీరు ఎక్స్‌పర్టా? అందరి వహ్వాలు అందుకుంటుంటారా. అలాంటప్పుడు మీ నైపుణ్యాన్ని కేవలం వంటగదికే పరిమితం చేయకండి. మీకు తెలిసిన విద్యను ఇంకొందరికి నేర్పించే ప్రయత్నం చేయండి. కుకింగ్ క్లాస్‌ల్లాంటివి నిర్వహించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాకా ఎక్కడెక్కడి వంటల గురించి తెలుసుకునే వీలు ఉంటోంది. అలాంటి  వాటిపై ఆసక్తి కూడా పెరుగుతోంది. కాబట్టి దీన్ని మీరు వ్యాపారావకాశంగా మార్చుకునే వీలుంది. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ రకాల్లో కొంగొత్త వంటకాలను పరిచయం చేయండి. కుదిరితే వంటకాల తయారీ ప్రక్రియను వీడియోలు తీసి ఆన్‌లైన్లో అప్‌లోడ్ చేయొచ్చు. తమిళనాడుకు చెందిన డెభ్భై ఏళ్ల బామ్మగారు ఇదే పనిచేస్తున్నారు కూడా.   తాను చేసే వంటకాలను కుటుంబసభ్యులతో వీడియోలు తీయించి యూట్యూబ్‌లో ఉంచుతారు. ప్రస్తుతం ఆ బామ్మగారికి దేశ విదేశాల్లో బోల్డంత మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు.
 
టేస్ట్‌కు తగ్గట్లు కస్టమైజేషన్
 
కొన్ని మినహాయించి చాలామటుకు ఉత్పత్తులను ఎలా ఉంటే అలా కొనేయకుండా తమ అభిరుచులకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చే యించి తీసుకునేందుకు (కస్టమైజేషన్) కొనుగోలుదారులు ప్రాధాన్యమిస్తున్నారు. విక్రేతలు కూడా ప్రత్యేకంగా ఆయా కస్టమర్లు కోరుకున్నట్లు తగిన మార్పులు చేసి అందిస్తున్నారు. ఆభరణాలు, వాల్ ఆర్ట్, ఫ్యాబ్రిక్స్, దుస్తులు, టీ-షర్టులు, పిల్లల దుస్తులు, ఇతర యాక్సెసరీలు లాంటివాటిల్లో కస్టమైజేషన్‌కి ప్రాధాన్యం పెరిగింది. కనుక, ఇలాంటి సర్వీసులు అందించగలిగితే మంచి ఆదాయమార్గం అందుకోవచ్చు.
 
నర్సరీ..

ప్రస్తుతం నగరవాసుల్లో మొక్కల పెంపకంపై ఆసక్తి పెరుగుతోంది. పచ్చదనంపై ఆసక్తి ఉన్న పక్షంలో దీన్ని కూడా వ్యాపారావకాశంగా మల్చుకోవచ్చు. కాస్త జాగా అందుబాటులో ఉంటే చిన్నపాటి నర్సరీ లాంటిది ప్రారంభించవచ్చు. మొక్కలు ఒక మోస్తరు స్థాయికి ఎదిగిన తర్వాత రిటైల్‌గా గానీ లేదా వ్యాపార సంస్థలకు గానీ విక్రయించేసేయొచ్చు. వీలైతే ఒక వెబ్‌సైట్ పెట్టి.. మీ దగ్గరున్న మొక్కలు, విక్రయించే ఇతరత్రా ఉత్పత్తులు మొదలైన వాటి వివరాలు అందులో ఉంచడం ద్వారా ఆన్‌లైన్‌లో కస్టమర్లను కూడా సంపాదించుకోవచ్చు.
 
మేకప్ సర్వీసులు...

మేకప్, ఫ్యాషన్, సౌందర్య సాధనాలపై మీకు మంచి అభిరుచి ఉంటే దాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. వివాహాల్లో పెళ్లికూతుళ్ల అలంకరణకు సంబంధించిన సర్వీసులు అందించవచ్చు. ఇందుకోసం కుటుంబ సభ్యులు, సన్నిహితులు.. కొండొకచో ఇతరత్రా వెబ్‌సైట్లలో ప్రకటనల ద్వారా మార్కెటింగ్ చేసుకోవచ్చు. మెహందీ, సంగీత్ వంటి ఫంక్షన్లు పరిపాటిగా మారిపోతున్నాయి కనుక.. తర్వాత దశలో ఆ సర్వీసులు కూడా అందించవచ్చు.
 
వెడ్డింగ్ ప్లానింగ్...
 
ఫంక్షన్లంటే బోలెడంత హడావుడి ఉంటుంది. అన్నింటిని సమర్థంగా చూసుకోగలిగితేనే ఏ మాట రాకుండా ఉంటుంది. ఇలాంటి వాటిని నిర్వహించగలిగే సామర్థ్యాలు, నైపుణ్యాలు మీలో ఉంటే .. వెడ్డింగ్ ప్లానింగ్‌వంటి సర్వీసులు అందించవచ్చు. ఏమేం ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది, ఎంత బడ్జెట్ అవుతుంది, ఎలా నిర్వహించవచ్చు ఇలాంటి వన్నీ ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది. మిగతా సన్నిహితులు ఎవరికైనా కూడా ఇలాంటి ఆసక్తి ఉంటే వారితో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.  ప్రస్తుతం ఈ తరహా ప్లానర్లకు డిమాండ్ బాగానే ఉంటోంది.
 
వెబ్ డిజైనింగ్.. డీటీపీ..
 
ఇంటర్నెట్  ప్రాచుర్యం పెరుగుతున్న నేపథ్యంలో అంతా ఆన్‌లైన్ బాటపడుతున్నారు. కనుక, వెబ్ డిజైనింగ్ వంటి సాంకేతిక నైపుణ్యాలు మీకు ఉంటే వాటిని వినియోగించుకుని ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ఒక కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్, అవసరమైన సాఫ్ట్‌వేర్ ఉంటే చాలు ఇంటి దగ్గర్నుంచే వెబ్ డిజైనింగ్ సేవలు అందించవచ్చు. చిన్న చిన్న సంస్థలు ఇలాంటి జాబ్స్‌ను ఫ్రీలాన్సర్లకు ఔట్‌సోర్సింగ్ చేస్తుంటాయి కూడా. వాటి దగ్గర్నుంచి ప్రాజెక్టులు తీసుకుని, క్లయింట్ల కోసం వెబ్‌సైట్లను అందించవచ్చు. ఇక తక్కువ పెట్టుబడితో మొదలెట్టగలిగే వ్యాపారాల్లో డీటీపీ (డెస్క్‌టాప్ పబ్లిషింగ్) కూడా ఒకటి. ప్రతీ సంస్థకు ఏదో ఒక సందర్భంలో లెటర్‌హెడ్లు, కేటలాగ్స్, బ్రోచర్లు మొదలైనవి అవసరం పడుతూ ఉంటాయి. ఇలాంటి ప్రాజెక్టులు దక్కించుకోగలిగితే డీటీపీ సేవల ద్వారా ఆదాయాన్ని ఆర్జించవచ్చు.
 
దుస్తుల డిజైనింగ్.. బొటిక్...
 
మహిళలకు అత్యంత అనువైన ఉపాధి అవకాశాల్లో ఇది ఒకటి. సాధారణంగానే మహిళలకు ఫ్యాషన్‌పై మంచి టేస్ట్ ఉంటుంది. యాక్సెసరీలు, కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ మొదలైన వాటిపై అవగాహన ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంట్లోనే దుస్తుల డిజైనింగ్ వ్యాపకంగా ఎంచుకోవచ్చు. అలాగే, చేతితో తయారు చేసిన యాక్సెసరీస్‌ని కూడా రూపొందించవచ్చు. సాధ్యపడితే తమ సొంత బొటిక్‌ను ఏర్పాటు చేయొచ్చు.
 

మరిన్ని వార్తలు