ఫేస్‌బుక్ చంపేసింది!

5 Mar, 2015 22:51 IST|Sakshi
ఫేస్‌బుక్ చంపేసింది!

చదివింత...
 సత్యవర్షి

 
‘‘అదిగో పులి ఇదిగో తోక... అదిగో చావు ఇదిగో సంతాపం’’ అన్నట్టుంది పరిస్థితి. ముక్కూ ముఖం కాస్త తెలిసున్న వ్యక్తి  కాలధర్మం చెందినట్టు  గాసిప్పు రాజేస్తే చాలు... ఫేస్‌బుక్కులూ వాట్సప్పులూ సంతాప సందేశాలను కుప్పలుగా ‘పొగే’యడానికి రెడీ. ఈ విషయాన్ని రుజువు చేస్తోందీ ఉదంతం. లండన్, సౌత్‌వేల్స్‌కు చెందిన 52 ఏళ్ల ఎయిర్‌పోర్ట్ షటిల్ బిజినెస్ వుమెన్ త్రిషా మెఖలే రోజు మొత్తం ఆఫీసుకు గైర్హాజరైంది. అదే రోజున... తన ఫ్రెండ్ త్రిష బాగా మందుకొట్టి మేడ మీద నుంచి జారిపడి చనిపోయిందని, ఆమె మరణం తననెంతో బాధిస్తోందంటూ... ఓ పరిచయస్థుడు ఫేస్‌బుక్‌లో సంతాప సందేశం పోస్ట్ చేశాడు. అంతే... కొన్ని నిమిషాల్లోనే అది వైరస్ కంటే వేగంగా పాకేసింది. ఇంకేముంది... త్రిష సన్నిహితులు, బంధువులు శోకాలు పెడుతూ అంత్యక్రియలకి సైతం డబ్బులు పోగేయడం మొదలుపెట్టారు. మరోవైపు ఆమె కస్టమర్లు తమ లావాదేవీలకు సంబంధించి ఆందోళన చెందుతూ సంబంధీకులకు ఫోన్‌లు చేయడం ప్రారంభించారు. మొత్తానికి త్రిష తిరిగి రానే వచ్చింది.

ఆమెని చూసి చుట్టుపక్కల వాళ్లు చుట్టపక్కాలు చుట్టుముట్టేసి కళ్లమ్మట నీళ్లతో ‘‘ఉన్నావా అసలున్నావా...’’ అంటూ కౌగిలింతలతో ఉక్కిరి బిక్కిరి చేసేశారు. అప్పటికే ఈ విషయం తెలుసుకున్న త్రిష... ఆ ఫేస్‌బుక్ రూమర్ అంతా అబద్ధమని తాను బతికే ఉన్నానని చెప్పలేక నానా సతమతమైందట. ‘‘ఇంకా నయం! వారం రోజులు టూర్ వెళదామనుకున్నా. అప్పుడు గాని ఈ గాసిప్ వచ్చి ఉంటే... వీళ్లిక నేను తిరిగొచ్చి చెప్పినా నమ్మేవారు కాదేమో’’ అంటూ వాపోతోతున్న త్రిష... దీనిపై కోర్టులో కేసు వేస్తానంటోంది.

మరిన్ని వార్తలు