విడాకుల పత్రాల్లో ఫేస్‌బుక్!

30 Jul, 2014 09:35 IST|Sakshi
విడాకుల పత్రాల్లో ఫేస్‌బుక్!

సామాజిక మాధ్యమాలు దేశాలకు స్వాతంత్య్రాలు తెచ్చేంత సత్ఫలితాలు సాధించినా వాటి విపరిణామాలు కూడా అంతే దారుణంగా ఉన్నాయి. దేశాలకు శాంతిని ప్రసాదించిన ఫేస్‌బుక్ చాలామంది అశాంతికి కూడా కారణమవుతోంది. ఎఫ్‌బీ ప్రమాదాలు కాపురాల్లోకి చేరాయి.
 
దాంపత్యం అన్నది ఇరువురికి సంబంధించింది. కానీ ఆ ఇరువురి ప్రమేయం లేకుండా వారి మధ్యకు మూడోది వచ్చింది. అదే ఫేస్‌బుక్. ఇండియాలో విద్యావంతులు ఫైల్ చేస్తున్న విడాకుల కేసుల్లో పెద్దసంఖ్యలో ఏదో ఒక రూపంలో ఫేస్‌బుక్ లేక ఇతర సామాజిక మాధ్యమాల ప్రస్తావన వస్తోంది. వీటి వినియోగం తక్కువ, దుర్వినియోగం ఎక్కువ. సరదాగా మొదలవుతున్న ఫేస్‌బుక్ అకౌంట్లు అనేక మలుపులు తీసుకుంటున్నాయి.

ఇటీవల ఓ తెలుగుదంపతులు ఎఫ్‌బీ వివాదంపై కోర్టుకు వెళ్లారు. 28 సంవత్సరాల ఓ యువతి పెళ్లయిన రెండు నెలలకే తనకు విడాకులు కావాలని కోర్టుకు వెళ్లింది. కారణమేంటంటే... భర్త ఫేస్‌బుక్‌లో ఇంకా ‘సింగిల్’ (పెళ్లి కానట్టు) స్టేటస్ ఉంచాడని, అంటే అతనికి వేరే ఉద్దేశాలున్నాయని పేర్కొంటూ విడాకులు కోరింది. ఔరంగాబాద్ కోర్టుకు వచ్చిన ఈ కేసులో భర్త రాజీపడి ‘నేను బిజీగా ఉండటం వల్ల మరిచిపోయాను, ఇపుడు మారుస్తాను లేదంటే అకౌంటే డిలీట్ చేస్తాను’ అని హామీ ఇచ్చినా వారి కాపురం నిలబడలేదు.
 
ఇదే కాదు, ఫేస్‌బుక్‌లో భిన్నవ్యక్తులు కలవడం అనేక అభిరుచులు, హోదాలు ఉన్నవారితో పరిచయం వల్ల కొంతకాలానికి ఇంట్లో తలెత్తే చిన్న పొరపొచ్చాలు కూడా విడాకులకు దారితీస్తున్నాయి.  వీటిని ఆన్‌లైన్ ఫ్రెండ్స్‌తో పంచుకుని అక్కడ లభించే సాంత్వనతో భాగస్వామి చేసే ప్రతిపని కూడా మరో కోణంలో తప్పుగా కనిపిస్తోంది. ముఖ్యంగా అమ్మాయిలు వేస్తున్న  కేసులు పరిశీలించినపుడు అర్థమవుతున్న విషయాలు ఏంటంటే... వారిని బుట్టలో వేసుకోవడానికి అదేపనిగా అపరిచితులు అబద్ధాలు చెప్పడం, ఆర్థిక స్థోమతకు సంబంధించి అతిచేసి చెప్పడం వల్ల తప్పుదారి పట్టిస్తున్నారు. ఇలాంటపుడు చాలా జాగ్రత్తగా ఉండకపోతే పెనుముప్పు తప్పదు.
 
డైవర్స్ ఆన్‌లైన్ అనే విడాకుల కేసులు డీల్ చేసే సంస్థ వద్దకు వచ్చిన 5000 కేసుల్లో మూడోవంతు కేసుల్లో ఫేస్‌బుక్ పేరు ఏదో ఒకరకంగా నమోదై ఉందట. మాజీ ప్రియులు, మాజీ భాగస్వాములతో అనుకోకుండా మొదలైన చాట్‌లు అతిపెద్ద సమస్యలుగా మొదలవుతున్నాయి. మరొకరిని ఆకర్షించడానికి ఇది అతిపెద్ద వేదిక కావడంతో సాధారణంగా చెప్పే విషెస్ కూడా అనుమానాలకు దారితీస్తున్నాయి. బంధం బలహీనంగా ఉన్నపుడు సెటైర్ కూడా అనుమానాలకు తావిస్తోంది.

విడాకులకు ఫేస్‌బుక్ ఆధారాలను కారణంగా చూపుతున్న వారిలో యువతులు అధికంగా ఉన్నారంటే... పురుషులు జాగ్రత్త పడాల్సిన అవసరం వచ్చేసింది. జాగ్రత్త పడటం అంటే దాచడం కాదు, కాపురంలో కలతలు తెచ్చే విషయాలకు దూరంగా ఉండటం. పెళ్లి/ప్రేమ పూర్తి ఇష్టంతో మొదలుపెడితే మరో వ్యక్తి మీద ఆకర్షణ కలిగే అవకాశమే తక్కువుంటుంది.

కాబట్టి ఎంపిక సమయంలో ఆలస్యమైనా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే అనుమానాలకు జీవితంలో తావుండదని ఫ్యామిలీ కౌన్సెలర్లు చెబుతున్నారు. పార్టీల్లో, ఫంక్షన్లలో ఇతర స్త్రీలతో మాటలు, చర్చలు కూడా ఫొటో యాంగిల్ కారణంగా చనువును చూపిస్తాయట. కాబట్టి అలాంటి పోస్టులను ఫేస్‌బుక్‌కు ఎక్కించకపోవడమే మంచిదంటున్నారు. అతిచనువును, ఆప్యాయతను చూపే స్టేటస్‌లను ఆపోజిట్ సెక్స్ వారికి పంపేటపుడు, చెప్పేటపుడు జాగ్రత్తగా ఉండాలి.
 

మరిన్ని వార్తలు