వజ్రంలాంటి విశ్వాసం

14 May, 2018 23:29 IST|Sakshi

చెట్టు నీడ

అంధుడి మాటలు రాజుగారిలో కొత్త ఆశను రేకెత్తించడంతో అందుకు సరేనన్నారు. ఆ అంధుడు ఆ వజ్రాలను తడిమి చూసి, ఫలానా వజ్రం అసలైనది, ఫలానా వజ్రం నకిలీదని వెంటనే తేల్చి చెప్పాడు.

ఎప్పటిలాగే ఆ రోజు కూడా రాజుగారు ఎంతో ఉత్సాహంగా సభా వ్యవహారాలను ప్రారంభించారు. అంతలో ఒక వ్యక్తి రాజదర్బారులో ప్రత్యక్షమయ్యాడు. ‘‘నా దగ్గర అమూల్యమైన రెండు వజ్రాలున్నాయి అందులో ఏది అసలైనదో, ఏది నకిలీదో తెలుసుకునేందుకు నేను తిరగని సంస్థానమంటూ లేదు, చేరని రాజ్యమంటూ లేదు. మీరేమైనా పసిగట్టగలరా’’ అని ప్రశ్నించాడు. రాజుగారు ఆ రెండు వజ్రాలను చేతిలోకి తీసుకొని ‘‘ఈ రెండూ ఒకేలా ఉన్నాయిగా’’ అన్నారు ఆశ్చర్యంగా. దానికి ఆ వ్యక్తి ‘‘ఇందులో ఒకటి వెలకట్టలేని వజ్రం. రెండోది గాజుది. మీ కొలువులో ఉన్న వారిలో ఎవరైనా, ఇందులో అసలు వజ్రాన్ని పసిగడితే ఆ వజ్రాన్ని నేను కానుకగా అందిస్తాను. కనుక్కోలేకపోతే ఆ వజ్రానికి తగ్గ మూల్యం చెల్లించాలి’’ అని సవాల్‌ విసరాడు. రాజుగారు, మంత్రులు, ఇతర అధికారులు ఆ వజ్రాన్ని చేతిలో తీసుకుని ఎంత పరిశీలించినా వారికి అర్థం గాక తీవ్ర నిరాశ చెందారు. ఈ విషయం ఆ రాజ్యంలోని ఒక పుట్టుగుడ్డి చెవిలోనూ పడింది.

తెలిసిన వారి సహాయంతో రాజదర్బారుకు చేరుకున్న ఆ అంధుడు రాజుగారితో ‘‘అయ్యా! నేను అసలు వజ్రాన్ని పసిగట్టే ప్రయత్నం చేస్తాను. నాకో అవకాశం కల్పించండి’’ అని వేడుకున్నాడు. అంధుడి మాటలు రాజుగారిలో కొత్త ఆశను రేకెత్తించడంతో అందుకు సరేనన్నారు. ఆ అంధుడు ఆ వజ్రాలను తడిమి చూసి, ఫలానా వజ్రం అసలైనది, ఫలానా వజ్రం నకిలీదని వెంటనే తేల్చి చెప్పాడు. వజ్రాన్ని తెచ్చిన వ్యక్తి ఖంగుతిన్నాడు. షరతు ప్రకారం వజ్రం రాజుగారి సొంతమయ్యింది. కళ్లు లేకపోయినా అసలు వజ్రాన్ని కనిపెట్టిన అంధుడిని అభినందించారు అందరూ. ఎలా కనిపెట్టగలిగావంటూ అంధుడిపై ప్రశ్నల వర్షం కురిపించసాగారు. ‘ఈ రెండు వజ్రాల్లో ఒకటి వేడిగా ఉంది. ఒకటి చల్లగా ఉంది. ఎండకి వేడెక్కిన వజ్రం నకిలీదని పసిగట్టాను’ అని చెప్పాడు ఆ అంధుడు. అందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. 
అసలైన విశ్వాసులు నకిలీ వజ్రంలా వేడెక్కరు. అసలు వజ్రంలా ప్రశాంతంగా ఉంటారు. 

మరిన్ని వార్తలు