చేదు పాయసం

4 Oct, 2018 00:04 IST|Sakshi

చెట్టు నీడ

‘‘ఏమైంది, మీరంతా పాయసం పారేశారు? ఎందుకు తినలేదు?’’అని ప్రశ్నించాడు నవాబు. ‘‘జీ హుజూర్, ఆ పాయసం పరమ ఉప్పగా, చేదుగా ఉంది.  దాన్ని మేమెలా  తినగలం?’’ అని సమాధానం వచ్చింది.

పూర్వకాలంలో సులేమాన్‌ ఒక నవాబు ఉండేవాడు. అతని దగ్గర రియాజ్‌ అనే నమ్మకస్తుడైన ఒక పల్లెటూరి యువకుడు సేవకుడుగా ఉన్నాడు. అతడంటే నవాబుకు అంతులేని ప్రేమ, అభిమానం. అంత నమ్మకంగా సేవలందించేవాడు రియాజ్‌. రాజుగారి కొలువులో ఎంతో తెలివైన, గొప్పగొప్ప మంత్రులు కూడా ఉండేవాళ్లు. వారందరికీ ఈ పల్లెటూరి యువకుడిపై అసూయ కలిగింది. ఎలాగైనా ఇతణ్ణి రాజదర్బారునుండి గెంటించి వేయాలని పథకం పన్నారు. రాజుకు లేనిపోనివన్నీ కల్పించి చెప్పారు. రాజు వీళ్ల దుర్బుద్ధిని పసిగట్టి, ఏదో ఒకరోజు వీళ్లకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఒకరోజు పాయసం వండించాడు. అందులో చక్కెరకు బదులు ఉప్పువేసి, వరుసగా మంత్రులందరికీ వడ్డించారు. అందరూ ఒక్క చెంచా నోట్లో పెట్టుకోగానే ముఖం మాడ్చుకొని ‘యాక్‌ థూ’ అంటూ ఉమ్మేశారు. కాని పల్లెటూరి యువకుడయిన రియాజ్‌ మాత్రం లొట్టలేసుకుంటూ సంతోషంగా తినేశాడు. అప్పుడు రాజు వారినుద్దేశించి, ‘‘ఏమైంది, మీరంతా పాయసం పారేశారు? ఎందుకు తినలేదు?’’ అని ప్రశ్నించాడు. ‘‘జీ హుజూర్, ఆ పాయసం పరమ ఉప్పగా, చేదుగా ఉంది. దాన్ని  మేమెలా  తినగలం?’’ అని సమాధానం వచ్చింది.

వెంటనే నవాబు ఆ పల్లెటూరి యువకుణ్ణి ఉద్దేశించి, ‘‘అంత ఉప్పగా, చేదుగా ఉన్న పాయసాన్ని నువ్వు ఎలా తినగలిగావు? నీకు చేదుగా అనిపించలేదా?’’ అని ప్రశ్నించాడు. అందుకు ఆ యువ కుడు.. ‘‘అయ్యా! పాయసం ఉప్పగా, చేదుగా ఉన్నమాట నిజమే. కాని జీవితాంతం తమరు నాకు ఎంతో తియ్యనైన, రుచికరమైన పదార్థాలు పెట్టారు. నేను అడగకుండానే నా సమస్త అవసరాలు తీరుస్తున్నారు.అలాంటిది ఒక్కపూట ఉప్పు ఎక్కువైతే ఏమౌతుంది? ఒక్కపూట కాస్త ఇబ్బంది పడ్డందుకే జీవితాంతం చేసిన మేలును ఎలా మరిచిపోగలను?’‘ అన్నాడు కృతజ్ఞతగా. నిజమే, అల్లాహ్‌ అనునిత్యం మనపై అసంఖ్యాక అనుగ్రహాలు కురిపిస్తున్నాడు. అడగకుండానే అన్నీ సమకూరుస్తున్నాడు. కాని కాస్త బాధ కలగగానే మనం అవన్నీ మరచిపోతాం. దేవుడు నాకు ఏంచేశాడు? అనేస్తాం. పుట్టిన దగ్గరి  నుండి మరణించే వరకు చేసిన మేళ్లను మరచిపోయి, కాస్తంత కష్టం కలగగానే బాధపడిపోవడం దైవాన్ని నమ్మినవారికి ఉండవలసిన గుణం కాదు.
– మదీహా 

మరిన్ని వార్తలు