ఇప్పటికీ  పక్క తడుపు తున్నాడు...

5 Oct, 2018 01:04 IST|Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

హోమియో కౌన్సెలింగ్స్‌

మా బాబు వయసు 13 ఏళ్లు. చిన్న వయసు నుంచి రాత్రిళ్లు నిద్రలో పక్కతడిపే అలవాటు ఉంది. వాడి సమస్య వల్ల బయటకు ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. హోమియో చికిత్సతో వాడి సమస్యను పరిష్కరించవచ్చా?   – ఎస్‌కె. నూర్‌బాషా, గుంటూరు 
మీ బాబు రాత్రుళ్లు నిద్రలో  పక్క తడిపే ఈ అలవాటును వైద్య పరిభాషలో నాక్చర్నల్‌ ఎన్యురెసిస్‌ అంటారు. ఈ సమస్యతో బాధపడే పిల్లలు, వారి తల్లిదండ్రులు చాలా బాధపడతారు. ఈ సమస్య చిన్న పిల్లల్లోనే గాక కొంతమంది పెద్దల్లోనూ ఉంటుంది. సాధారణంగా పిల్లల్లో రాత్రి సమయంలో మూత్రవిసర్జనపై అదుపు అన్నది రెండు నుంచి ఐదేళ్ల వయసులో వస్తుంటుంది. కానీ ఐదు శాతం మంది పిల్లల్లో పదేళ్ల వయసు తర్వాత కూడా మూత్రవిసర్జనపై అదుపు సాధించడం జరగకపోవచ్చు. ఐదేళ్ల వయసు తర్వాత కూడా తరచూ పక్కతడిపే అలవాటు ఉండటాన్ని ప్రైమరీ ఎన్యురెసిస్‌ అంటారు. సాధారణంగా ఇది కొన్నాళ్లలోనే తగ్గిపోతుంది. ఎదుగుదల సమయంలో వచ్చే లోపం వల్ల ఇలా జరుగుతుండవచ్చు. అయితే కొంతమంది పిల్లలు పక్కతడపడం మానివేశాక, మళ్లీ ఆర్నెల్ల తర్వాత సమస్య తిరగబెట్టవచ్చు. ఇంతకుముందు పక్కతపడపకుండా ప్రస్తుతం మళ్లీ పక్కతడపడం మొదలుపెట్టినట్లయితే ఈ పరిస్థితిని ‘సెకండరీ ఎన్యురెసిస్‌’ అంటారు.

కారణాలు: నాడీ వ్యవస్థ ఎదుగుదల లోపాలు, జన్యుపరమైన సమస్యలు (ముఖ్యంగా డౌన్‌సిండ్రోమ్‌), ఇన్ఫెక్షన్లు, మూత్రాశయం సమస్యలు, కొందరిలో వంశపారంపర్య కారణాల వల్ల ఈ సమస్య కనిపిస్తుండవచ్చు. ఇంకొంతమంది పిల్లల్లో కండరాలు ఎక్కువ సార్లు అనియంత్రితంగా సంకోచం చెందడం వంటి కారణాలతోనూ ఈ సమస్య కనిపించవచ్చు. టైప్‌–1 డయాబెటిస్, మలబద్దకం వల్ల  మూత్రాశయంపై ఒత్తిడి పడటం వల్ల, కెఫిన్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కొంతమంది పిల్లల్లో మానసిక ఒత్తిడి, భయం వల్ల కూడా రాత్రివేళలో తమకు తెలియకుండానే మూత్రవిసర్జన జరిగిపోవచ్చు. 

చికిత్స: పక్క తడిపే పిల్లలను తిట్టడం, వాళ్లకు శిక్షలు విధించడం వల్ల పిల్లలు మరింత కుంగిపోయి సమస్య మరింత జటిలం అవుతుంది. ఇలా పిల్లలను మందలించడం వల్ల ప్రయోజనం చేకూరదు సరికదా... కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ పిల్లలను దండించకూడదు. హోమియో చికిత్సతో పిల్లల్లో ఈ అలవాటు పూర్తిగా మాన్పించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్‌ 
ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

కాళ్ల మీద  రక్తనాళాలు ఉబ్బి కనిపిస్తున్నాయి?
నా వయసు 47 ఏళ్లు. పట్టుమని పది నిమిషాల పాటు నిల్చోలేకపోతున్నాను. కాళ్లు విపరీతంగా లాగుతున్నాయి. కాళ్లపై నరాలు ఉబ్బి పాదాలు నలుపు రంగులోకి మారుతున్నాయి. నా సమస్యకు హోమియోలో పరిష్కారం చెప్పండి. – డి. కౌసల్య, కొత్తగూడెం 
మీరు వేరికోస్‌ వెయిన్స్‌ అనే సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలోని సిరలు బలహీనపడటం వల్ల ఏర్పడే సమస్యనే వేరికోస్‌ వెయిన్స్‌ అంటారు. అంటే శరీరంలోని రక్తనాళాలు రంగు మారతాయి లేదా నలుపు రంగులోకి మారతాయి. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, అవగాహన లేమి వల్ల ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చి ఇతర సమస్యలకు దారితీస్తోంది. సాధారణంగా రక్తం కింది నుంచి గుండెవైపునకు వెళ్లే సమయంలో భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో రక్త సరఫరా అవుతుండటం వల్ల  రక్తప్రసరణ మందగించడం, కాళ్ల ఒత్తిడి పెరగడం జరగవచ్చు. ఈ క్రమంలో సిరలు (రక్తనాళాలు) నలుపు లేదా ఊదా రంగుకు మారుతాయి. దీనివల్ల కాళ్లలో తీవ్రమైన నొప్పి ఏర్పడి నడవడానికీ వీలు కాదు. ఈ వేరికోస్‌ వెయిన్స్‌ వ్యాధి శరీరంలోని ఇతర భాగాలలోనూ వస్తుంది కానీ 80 శాతం కేసుల్లో ఇది కాళ్లపైనే కనిపిస్తుంది. సాధారణంగా 30 ఏళ్ల పైబడిన వారిలో ఈ వేరికోస్‌ వెయిన్స్‌ కనిపిస్తుంది. మహిళలు, స్థూలకాయులు, వ్యాయామం చేయనివారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. 

కారణాలు: ∙ముందుకు ప్రవహించాల్సిన రక్తం వెనకకు రావడం ∙కొంతమంది మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు ∙ఎక్కువ సేపు నిలబడి చేయాల్సిన ఉద్యోగాల్లో (పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, కండక్టర్, వాచ్‌మేన్, సేల్స్‌మెన్, టీచర్లు వంటి) ఉద్యోగాలలో ఉండేవారికి ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. 

లక్షణాలు: ’ కాళ్లలో నొప్పి, మంట, కాళ్లలోని కండరాలు బిగుసుకుపోవడం ∙కొద్దిసేపు నిలబడితే నొప్పి రావడం, దాని తీవ్రత పెరుగుతూ పోవడం ∙చర్మం దళసరిగా మారడం ∙చర్మం ఉబ్బడం, పుండ్లు పడటం 
వ్యాధి నిర్ధారణ: అల్ట్రాసౌండ్, డ్యూప్లెక్స్‌ డాప్లర్‌ అల్ట్రా సౌండ్‌. 

చికిత్స: వేరికోస్‌ వెయిన్స్, వేరికోసిల్‌ వంటి వ్యాధులకు హోమియోపతి చికిత్సలో  అనుభవం ఉన్న, పరిశోధనల అనుభవం ఉన్న వైద్యులు చికిత్స చేస్తారు. వ్యాధి తీవ్రతను పరిశీలించి, రోగి వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఆపరేషన్‌ అవసరం లేకుండానే మంచి మందులు సూచిస్తారు. హోమియోలో ఈ సమస్యకు హామామెలిస్, పల్సటిల్లా, కాల్కేరియా, గ్రాఫైటిస్, కార్బోవెజ్, ఆర్నికా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.
డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా, ఎండీ (హోమియో), 
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

యానల్‌  ఫిషర్‌కు  చికిత్స  ఉందా? 
నా వయసు 68 ఏళ్లు. మలవిసర్జన టైమ్‌లో తీవ్రంగా నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్‌  ఫిషర్‌ అని చెప్పారు. ఆపరేషన్‌ చేయాలన్నారు. ఆపరేషన్‌ లేకుండానే హోమియోలో దీనికి చికిత్స ఉందా? 
– ఎస్‌. రమేశ్‌బాబు, మహబూబ్‌నగర్‌ 

మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్‌ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్‌ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్‌ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్‌ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. 

కారణాలు: ∙దీర్ఘకాలిక మలబద్దకం ∙ఎక్కువకాలం విరేచనాలు ∙వంశపారంపర్యం ∙అతిగా మద్యం తీసుకోవడం ∙ఫాస్ట్‌ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ∙మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్‌ సమస్య వస్తుంది.

లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట ∙చురుకుగా ఉండలేరు ∙చిరాకు, కోపం ∙విరేచనంలో రక్తం పడుతుంటుంది ∙కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు  నొప్పి, మంట. 

చికిత్స: ఫిషర్‌ సమస్యను నయం చేయడానికి హోమిమోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్‌ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. 
డాక్టర్‌ టి.కిరణ్‌ కుమార్, డైరెక్టర్, పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌ 

మరిన్ని వార్తలు