భార్యగారూ... ప్రేమించండి

22 Aug, 2019 07:36 IST|Sakshi

ప్రేమించిన వాళ్లను మళ్లీ ప్రేమించాలి ఇంట్లో. అభిమానించే వాళ్లని అభిమానిస్తూనే ఉండాలి ఇంట్లో. అనుబంధాన్ని కుండీలో మొక్కలా నీరు పోసి కళకళలాడిస్తూనే ఉండాలి ఇంట్లో.
ఎవరైనా ఎటైనా పోనీలే అనుకునే చోటు కాదు ఇల్లు.ఎవరైనా ఎలాగైనా ఉండచ్చులే అనుకునే చోటు కాదు ఇల్లు. మళ్లీ మళ్లీ దగ్గరగా హత్తుకుంటూనే ఉండాలి.మళ్ళీ మళ్లీ మన కుటుంబంతో ప్రేమలో పడుతూనే ఉండాలి.

నాలుక పచ్చగా అయిపోయిందా అన్న భ్రాంతి. లోపల లివర్‌ పెరిగిపోయిందేమోనన్న భ్రాంతి. తల తిరగదుగాని తిరిగిపోతున్నదేమోన్న భ్రాంతి. ఇంట్లో ఉంటే ఆఫీసుకు వెళ్లబుద్ధవుతుంది. ఆఫీసుకు వెళితే ఇంటికి పారిపోమని మనసు చెబుతుంది. పొట్ట ఏమీ కదిలినట్టు అనిపించదు. లేదా ఎంతో కదిలిపోయినట్టు అనిపిస్తుంది. గతంలో టిఫెనుకు కూచుంటే మూడు రకాల ప్లేట్లు లేవాలి. నేడు ఒక ఇడ్లీ గతికితే పెద్ద విషయం. లోకం మీద ఏ ఆశా లేదు. అసలు ఏం కావాలో అర్థం కావడం లేదు.

అతికష్టం మీద ఈ బడబాగ్నిని దాచుకుంటున్నాడు. భార్యకు తెలియకుండా. కూతురికి తెలియకుండా. కూతురు చాలా తెలివైనది. అది నాన్న పిల్ల.‘ఏంటి నాన్న అలా ఉంటున్నావు?’ అంది మొన్న చూసి.‘నాకేమైంది బాగున్నానే’ అన్నాడు హుషారు నటిస్తూ.‘బీరు తాగడం కూడా మానేశావు. ‘నా లగ్జరీ అదే... వారానికి ఒకసారి’ అంటే అమ్మా నేను పర్మిషన్‌ ఇచ్చాం కదా. మూడు వారాలుగా నువ్వు తాగట్లేదు. ఫ్రెండ్స్‌తో జోకులు వేయడం లేదు. ఎప్పుడూ లేనిది గుడికెళ్లి కూచుంటున్నావు. ఏమైంది నాన్నా?’

ఏం చెబుతాడు. ఏమీ చెప్పడు.
‘ఏం లేదమ్మా. ఫైనాన్షియల్‌గా ఎదుగుదల ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఫార్టీ ఫైవ్‌కు చేరుకున్నా కదా. కొత్త ఉద్యోగాలకు ఎవరూ పిలువరు. ఉన్న ఉద్యోగంలో ఎదుగుదల ఉండదు’ అన్నాడు.

భార్య వచ్చి కూచుంది.
‘ఇప్పుడు ఏం కొంప మునిగిపోయిందనండీ. మనమ్మాయి జెమ్‌. ఒకటికి నాలుగు స్కాలర్‌షిప్‌లు వస్తున్నాయి. రేపోమాపో అమెరికా వెళ్లిపోతుంది. అందుకు కావలసిన ఏర్పాట్లు అమౌంట్‌ మనం ముందే చూసుకున్నాం. తను అమెరికా వెళ్లిపోతే మన ఖర్చెంతని. మీరు ఉద్యోగం మానేసినా ప్రధాని రోజ్‌గార్‌ యోజన కింద పప్పులు ఉప్పులు అయినా వస్తాయిగా’ అంది జోక్‌ చేస్తూ.

తను కూడా నవ్వాడు.
చాలా రోజుల తర్వాత ముగ్గురు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు.

పట్టాల మీద నడుస్తూ ఉన్నాడు. కారు ఖైరతాబాద్‌ స్టేషన్‌ దగ్గర పెట్టేశాడు. తాళాలు జేబులో ఉన్నాయి. ఫోన్‌ కూడా జేబులోనే ఉంది. పర్స్, అందులో విజిటింగ్‌ కార్డులు కూడా ఉన్నాయి. గుర్తు పట్టడానికి ఆ మాత్రం ఆనవాలు చాలు. పట్టాలమీద అనుమానం రాకుండా ఉండేందుకు ఏదో క్యాజువల్‌గా నడుస్తున్నట్టు నడుస్తున్నాడు. కాని బ్రాండెడ్‌ ప్యాంట్‌ మీద బ్రాండెడ్‌ షర్ట్‌ ఇన్‌ చేసి పాయింట్‌ షూస్‌ వేసి ఎగ్జిక్యూటివ్‌లాగా వున్న వ్యక్తి అలా పట్టాల మీద నడవడం స్ట్రేంజ్‌గానే ఉంది. ఎంత స్ట్రేంజ్‌గా ఉన్నా ఇంకో ఐదు పది నిమిషాల సేపే. ఈలోపు ఏదో ఒక ట్రైన్‌ వస్తుంది. కథ కంచికి చేరుతుంది.

దూరంగా అలజడి మొదలైంది.
ఏదో ట్రైన్‌ చాలా వేగంగా వస్తున్నట్టు అర్థమైపోయింది.
చాలా ధైర్యంగా గుండెలు కూడగట్టుకుంటూ నిలబడ్డాడు.

ట్రైన్‌ సమీపిస్తూ ఉంది.
ఇంతలో ఫోన్‌. రింగవుతూనే ఉన్న ఫోన్‌. బహుశా తాను మాట్లాడబోయే లాస్ట్‌ కాల్‌. తీసి చూశాడు. కూతురు. మాట్లాడాలా వద్దా... మాట్లాడాలా వద్దా? అప్రయత్నంగా ప్రెస్‌ చేశాడు.
‘నాన్నా... ఎక్కడున్నావ్‌?’ ఆ ప్రశ్న కూతురి గొంతు అప్రయత్నంగా అతడి కళ్లల్లో నీళ్లు చిప్పిల్లేలా చేశాయి. అప్రయత్నంగా పట్టాల మీద నుంచి తప్పుకున్నాడు. పెద్ద హోరు చేస్తూ రైలు వెళ్లిపోయింది. కాని ఎప్పుడూ లేనిది తండ్రి ఫోనులో రైలు చప్పుడు విని ఆ అమ్మాయి ఎంతో అప్రమత్తం అయ్యింది.

‘సాధారణంగా మీలాంటి పేషెంట్లను పెద్దవాళ్లు తీసుకొస్తూ ఉంటారు. మిమ్మల్ని మీ అమ్మాయి తీసుకురావడం బాగుంది. గుడ్‌. పిల్లలు ఇలా ఉండాలి’ అంది లేడీ సైకియాట్రిస్ట్‌ అతనివైపూ అతని కూతురి వైపూ చూస్తూ.
‘నువ్వెళ్లి బయట కూచోమ్మా’ అని అతని వైపు చూసి అడిగింది– ‘చెప్పండి.. ఎందుకంత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు... బంగారంలాంటి జీవితం పెట్టుకొని’
అతడు తల వొంచుకొని జవాబు చెప్పడానికి మాటలు వెతుక్కుంటూ ఉన్నాడు.

ఇద్దరూ నచ్చాక పెద్దలు పెళ్లి చేయడం ఆనవాయితీ. అయితే నచ్చాక కూడా నచ్చని విషయాలు ఉండొచ్చు. చాలా ఏళ్లు నచ్చాక ఆ తర్వాత నచ్చని పరిస్థితులు రావచ్చు. ఇప్పుడు అతని పరిస్థితి అదే. భార్యతో పెద్ద అగాథం వచ్చేసింది. అగాథం అంటే కొట్టుకోవడం తిట్టుకోవడం కాదు. రోజూ ఒకే ఇంట్లో ఉంటున్నా కలిసి జీవిస్తూ ఉన్నా మాట్లాడుకుంటున్నా ఏదో దూరం ఉంది అని అనిపిస్తూ ఉంటుందే అలాంటిది అది. భార్య ఏ తప్పూ చేయడం లేదు. కూతురు వయసులోకి వచ్చాక ఆ అమ్మాయి అన్ని అవసరాల కోసం ఉద్యోగం మానేసి మరీ ఇంట్లో కూచుంది. కొన్నేళ్ల క్రితం వరకూ భర్త సర్వస్వంగా ఉండేవాడు. ఇప్పుడు కూతురు సర్వస్వంగా ఉంది.
‘నేను ఈ లోకాన్ని నమ్మను. నా కూతురి మనసు అటూ ఇటూ వెళ్లనివ్వను. ఆ తర్వాత తీరిగ్గా బాధ పడను. దానికి ఫ్రెండ్‌గా ఉండి దాని జీవితం గట్టెక్కిస్తాను’ అని అతనితో ఒకరోజు వాదనలో అంది.

‘మీరు ఉద్యోగానికి వెళతారు. రేపు అది ప్రేమ గీమ అని ఎవరినో ఒకరిని తీసుకొస్తే లేనిపోని తలనొప్పి. అదొక్కటే కాదు సెక్యూరిటీ కూడా పెద్ద విషయం. అలాగని అవసరానికి ముందే పెళ్లి చేసి ఇంటి నుంచి సాగనంపాలని లేదు. దాని సంగతి నేను చూసుకుంటానుగా’ అంది.

నిజమే కాని ఏదో వెలితి మొదలైనట్టు అనిపించసాగింది అతనికి.
అప్పుడే తను హెడ్‌గా పని చేస్తున్న హెచ్‌ఆర్‌లో ఒక అమ్మాయి చేరింది. మొదట సార్‌.. సార్‌ అనేది. తర్వాత చనువుగా ‘ఏమిటిది సుభాష్‌జీ’ అనేది. ఆ తర్వాత ‘గుడ్‌మాణింగ్‌ సుభాష్‌’ అని మెసేజ్‌ పెట్టేది. ఆమె వయసుకు తనను దించడం మొదట అతనికి థ్రిల్లింగ్‌ అనిపించింది. ఆ తర్వాత ఏదో ఆకర్షణగా అనిపించింది. ఆ తర్వాత మాయ కమ్మేసింది. రోజూ ఆఫీసయ్యాక ఇంటి వరకూ దింపడం ఉదయాన్నే ఇంటి మీదుగా వస్తూ ఆఫీసుకు తేవడం... జోకులేస్తూ అప్పుడప్పుడు ఆ అమ్మాయి చేయి తట్టేది. నవ్వుతూ భుజాన్ని భుజంతో తాకించేది. మాయ ఎంతగా కమ్మేసిందంటే ఇంత వరకూ గడుపుతున్న జీవితం రస హీనమైనదని, ఇప్పుడే తన జీవితంలోకి సంతోషం వచ్చిందని అతనికి అనిపించింది. వీలైతే డివోర్స్‌ చేసుకొని ఈ అమ్మాయితో పెళ్లి చేసుకుందామా అని అనిపించేంత.

నాలుగు నెలలు ఇలాగే గడిచాక ఆ అమ్మాయి ఢిల్లీ ఆఫీసుకు లెటర్‌ పెట్టుకొని షిఫ్ట్‌ అయిపోయింది.
‘ఈ ఉద్యోగం నాకు చాలా ముఖ్యం సార్‌. నా గోల్‌ ఢిల్లీ. అక్కడ నా బోయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడు. తప్పులు చేసి పోగొట్టుకుంటే దెబ్బ తింటానని మీతో ఫ్రెండ్లీగా ఉన్నాను. మీరు కూడా చాలా హెల్ప్‌ చేశారు. థ్యాంక్యూ’ అని ఒక కాడ్‌బరీ చాక్లెట్‌ ఇచ్చి వెళ్లిపోయింది.ఆ తర్వాత నుంచి ఇతనికి ఈ డిప్రెషన్‌.

లేడీ సైకియాట్రిస్ట్‌ బెల్‌ నొక్కి కూతురుని పిలిచింది. అతను కంగారుగా ఆమెవైపు కూతురివైపు చూస్తున్నాడు ఏం చెబుతుందోనని. సైకియాట్రిస్ట్‌ కళ్లతోనే అభయం ఇస్తూ...
‘మీ నాన్న ప్రేమలో పడాలనుకుంటున్నాడమ్మా’ అంది. కూతురు కంగారు పడింది.

‘ఎవరితో డాక్టర్‌?’
‘మీ అమ్మతోనే. మీ అమ్మను చాలా మిస్‌ అవుతున్నాడు. నువ్వూ మీ అమ్మా కలిసి మీ నాన్నను మిస్‌ కొడుతున్నారు. ఇక మీదట ఆయన రాసే లవ్‌ లెటర్‌కు నువ్వే పోస్ట్‌మేన్‌ అవ్వాలి. రోజూ లెటర్‌ రాసేలా చూడు. దానికి మీ అమ్మను రిప్లై ఇచ్చేలా చూడు. ఇదే నేను చెప్పే ట్రీట్‌మెంట్‌. ’
కూతురు ఫైనలియర్‌ బీటెక్‌ చదువుతోంది. చిన్నపిల్ల కాదు.
తల్లిదండ్రులు మళ్లీ ప్రేయసీ ప్రియులుగా మారే విధంగా తల్లికి ఏం కౌన్సెలింగ్‌ చేయాలో మననం చేసుకుంటూ తండ్రి చేయి పట్టుకుని బయటకు నడిచింది. కారును ఒకచోట ఆపి ‘అమ్మకు ఏదైనా గిఫ్ట్‌ తీసుకో నాన్నా.. ఇద్దువుగానీ’ అంది నవ్వుతూ.ట్రీట్‌మెంట్‌ మొదలైనట్టే. – కథనం: సాక్షి ఫ్యామిలీ

అగాథం అంటే కొట్టుకోవడం తిట్టుకోవడం కాదు. రోజూ ఒకే ఇంట్లో ఉంటున్నా కలిసి జీవిస్తూ ఉన్నా మాట్లాడుకుంటున్నా ఏదో దూరం ఉంది అని అనిపిస్తూ ఉంటుందే అలాంటిది అది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు