‘నా భర్తను చంపుకుంటే నాకేం వస్తుంది.. ఎలా బతుకుతా’

5 Dec, 2018 00:39 IST|Sakshi

అతడు : నా బొట్టు చెరిపేసే సమయం వచ్చింది.
ఆమె : ఆ పని నా చేతుల మీదుగా చేస్తాను.
అతడు : అప్పుడు నేను ఇంటి నుంచి బయటపడతాను.
ఆమె : అప్పుడు నిన్ను నాదాన్ని చేసుకుంటాను.

పోలీసులు ఈ సంభాషణ చదివి కన్ఫ్యూజన్‌లో పడ్డారు.

ఆగస్టు 26, 2017. ఉదయం. తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం. ఏరియా ఆస్పత్రిలో పోలీసులు అడుగుపెట్టే సరికి పెద్ద హడావుడిగా ఉంది. చిన్న ఊరు కనుక సంబంధం ఉన్నవాళ్లు లేనివాళ్లు కూడా పోగై ఉన్నారు. లోపల ఒక మనిషి చావుబతుకుల మధ్య ఉన్నాడు. పోతే? అని ఒక డిస్కషన్‌. పోయాడేమో అని మరో డిస్కషన్‌.పోలీసులు ఎమర్జెన్సీ చేరుకునేసరికి ఒకామె తల బాదుకుంటూ ఎదురొచ్చింది. ‘సార్‌... మీరైనా చెప్పండి... ఇప్పటి దాకా డాక్టర్లు ట్రీట్‌మెంట్‌ మొదలెట్టలేదు. నా భర్త చావుబతుకుల్లో ఉన్నాడు’... ఎస్‌.ఐ ఆమెను దాటుకుంటూ డాక్టర్‌ దగ్గరకు వెళ్లాడు. ఇలాంటి సమయంలో పక్కకు వెళ్లి మాట్లాడటం మామూలే కనుక డాక్టర్‌ నోరు తెరిచి ఏమీ చెప్పకముందే అతనితో పాటు పక్కకు వెళ్లి నిలబడ్డాడు.‘సర్‌... నా పేరు డాక్టర్‌ రఘు. ఇతని పేరు రాకేష్‌. నోటి నుంచి రక్తం కారుతుందని తీసుకొచ్చారు. కాని టెస్ట్‌ చేస్తే మూడు – నాలుగు గంటల ముందే చనిపోయాడని అనిపిస్తోంది. ఈ విషయం వాళ్లకు చెప్పడానికన్నా ముందు మీకు ఇన్‌ఫార్మ్‌ చేద్దామని ఫోన్‌ చేశాను’ అన్నాడతను. ఎస్‌.ఐ ఊపిరి పీల్చుకున్నాడు.ఇద్దరూ కలిసి రాకేష్‌ భార్య దగ్గరకు చేరారు.‘అతను చనిపోయాడమ్మా’ డాక్టర్‌ చెప్పాడు.ఆ మాట వినడంతోటే అతని భార్య స్పృహ తప్పి పడిపోయింది.రాకేష్‌ అనే వ్యక్తి చనిపోయాడు.ఎలా చనిపోయాడు? గుండెపోటు వచ్చిందని కొందరు అంటుంటే, ఆత్మహత్య అని కొందరు లేదు ఎవరో హత్య చేసి ఉంటారని మరికొందరు.రాకేష్‌ మృతదేహాన్ని ఎస్సై, సీఐలు పరిశీలించారు. చేతి మీద చాలా చిన్నదిగా ఉన్న గాయం మినహా మరెక్కడా గాయాల ఆనవాళ్లు లేవు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. ‘బలవంతంగా ఊపిరాడకుండా చేయడం వల్ల జరిగిన హత్యగా అనుమానించాల్సి వస్తోంది’ అని ఉంది అందులో.అయితే అలా ఎవరు చేసి ఉంటారు?


రాకేష్‌ భార్య కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. అలాంటి సమయంలో ఆమెను విచారణ పేరుతో ఇబ్బంది పెట్టడం సరికాదని పోలీసులు భావించారు. అయినా వారిపనిలో వారు పడ్డారు. రాకేష్‌ నివాసం ఉంటున్న అపార్టుమెంట్‌లోని ఫ్లాట్‌కి చేరుకున్నారు. ఆ ఫ్లాట్‌లోకి ఎవరూ రాకుండా అప్పటికే జాగ్రత్తలు తీసుకున్నారు. ఎస్‌.ఐ రాకేష్‌  బెడ్‌ రూంను నిశితంగా పరిశీలించాడు.క్లూస్‌ టీం వచ్చింది. అయినా ఏమీ దొరకలేదు.‘రాకేష్‌ ఎలాంటివాడు?’ స్నేహితులను ఆరాతీశారు.‘బజారులో అతనికి ఒక షాప్‌ ఉంది సార్‌. అందులో కూచుని ఫైనాన్స్‌ చేస్తుంటాడు. చిన్న చిన్న మొత్తాలే. అప్పులేమీ లేవు. భార్యతో కూడాగొడవలులేవు. ఎప్పుడూ హ్యాపీగా ఉంటాడు. ఫేస్‌బుక్‌ చూసే పిచ్చి ఉంది. ఇరవై నాలుగ్గంటలు అందులో ఉంటాడు’ అన్నారు వాళ్లు.ఫేస్‌బుక్‌లో అతని వాల్‌ మీదకు వెళ్లి చూశారు పోలీసులు.ఇంటి ఫొటోలు, భార్య ఫొటోలు, పిల్లల ఫొటోలు ఇలాంటివే తప్ప పెద్దగా అనుమానించాల్సింది ఏమీ కనిపించలేదు.ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌షిప్స్‌ ఈ మధ్య ప్రమాదాలు తెస్తున్నాయి. అలాంటి పరిచయం ఏమైనా ఈ సంఘటనకు కారణమా అనేది చూశారు. ఏమీ దొరకలేదు.కేసు ఎలా సాల్వ్‌ చేయాలి?

రాకేష్‌ చనిపోయి 11 రోజులు గడిచిపోయాయి.ఇక భార్యతో మాట్లాడవచ్చని అతని భార్యను పిలిపించారు.‘సార్‌... నా పేరు రమ్య. రాకేష్‌ అంటే నాకు ప్రాణం. ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆయన బయటకు వెళ్లాడు. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలకు వెళ్లడం మామూలే. అలా వెళ్లి లేటుగా వస్తుంటాడు. ఆ రోజు కూడా ఇంచుమించు ఒంటి గంటకు ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు టీ కావాలని అడిగితే ఇచ్చాను. అది తాగకుండానే కడుపులో నొప్పి అని వెళ్లి పడుకున్నాడు. ట్యాబ్లెట్‌ ఇవ్వనా అని అడిగితే వద్దన్నాడు. ఉదయం పిల్లలను స్కూల్‌కు రెడీ చేసేందుకు లేచి చూస్తే ఆయన నోట్లోంచి రక్తం వస్తున్నట్టు కనిపించింది. నా పై ప్రాణాలు పైనే పోయాయి.  వెంటనే  ఇంటి చుట్టుపక్కల వారి సహాయంతో ఆసుపత్రికి తీసుకువచ్చాను’ ఏడుస్తూ చెప్పింది రమ్య. ‘మీ ఫోన్‌ హ్యాండొవర్‌ చేసి వెళ్లండి’ అన్నాడు ఎస్‌.ఐ.ఆమె సంకోచం లేకుండా దానిని ఇచ్చేసి వెళ్లింది.రమ్య కాల్‌డేటాను క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. ఆమె వాట్సప్‌ను చెక్‌ చేశారు. అనుమానించాల్సింది ఏమీ కనిపించలేదు.రాకేష్‌ మృతి వెనుక ఆమె హస్తం ఉన్నట్టయితే ఒక్కత్తే ఆమె అతణ్ణి చంపే అవకాశం లేదు. ఎవరితోడో కావాలి. కావాలంటే ఎవరితో ఒకరితో ఏదో ఒక పద్ధతిలో మాట్లాడాలి. కాని ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు. అది చిన్న ఊరు.అపార్ట్‌మెంట్‌కు సిసి కెమెరాల ఏర్పాటు లేదు. కేసును ఛేదించడం ఎలా?

రమ్యను మళ్లీ పిలిపించాడు ఎస్‌.ఐ.‘రమ్యా... ఎలా చూసినా ఈ చావు వెనుక మీ హస్తం ఉన్నట్టు కనపడుతోంది. ఏం జరిగిందో నిజం చెప్పండి’ రమ్య మళ్లీ బోరుమంది. ‘నాకేం తెలుసు సార్‌! నా భర్తను చంపుకుంటే నాకేం వస్తుంది. నేను ఎలా బతుకుదామని’.... ఏడుస్తూనే ఉంది.ఎస్‌.ఐ ఆ రోజు వేరే ఏ పనీ పెట్టుకోలేదు.మళ్లీ ఫేస్‌బుక్‌లోకి వెళ్లాడు.రాకేష్‌ వాల్‌ మీదకు వెళ్లి అన్ని ఫొటోలు చూడటం మొదలెట్టాడు. రెండు మూడు చోట్ల రాకేష్‌తో పాటు మరో అతను కూడా ఫొటోల్లో ఉన్నాడు. ఒక ఫొటోలో రాకేష్, రమ్య, ఆ మూడో వ్యక్తి ఉన్నారు. క్యాజువల్‌గా దిగిన ఫొటోయేగాని రమ్య బాడీ లాంగ్వేజ్‌ను బట్టి ఆ మూడో వ్యక్తికి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. రాకేష్‌ ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో అతను ఉన్నాడు. పేరు కిశోర్‌. రమ్య కూడా ఉంది. వెంటనే ఎస్‌.ఐ రమ్య వాల్‌ మీదకు వెళ్లి చూశాడు. పెద్దగా ఏమీ కనిపించలేదు.జానకి రామ్‌ వాల్‌ మీదకు వెళ్లి చూశాడు. అక్కడా ఏమీ కనిపించలేదు.కాని ఏదో ఉందని అనిపించింది.ఈ ఇద్దరి రిజిస్టర్డ్‌ ఫోన్‌ నంబర్ల మీద ఇంకేమైనా ఫేస్‌బుక్‌ అకౌంట్లు ఉండొచ్చా అనే అనుమానం వచ్చింది ఎస్‌.ఐ.కి. వెంటనే టెక్నికల్‌ టీమ్‌కు ఆ పని అప్పగించాడు. సరిగ్గా రెండు మూడు గంటల్లోనే రిజల్ట్స్‌తో వచ్చాడు కానిస్టేబుల్‌.‘ఏమైంది?’ ఎస్‌.ఐ అడిగాడు.‘ఇద్దరికీ ఫేక్‌ అకౌంట్స్‌ ఉన్నాయి సార్‌.కానీ...’‘కానీ..’‘ఆమె అబ్బాయి పేరుతో అకౌంట్‌ ఓపెన్‌ చేసింది. అతడు అమ్మాయి పేరుతో ఓపెన్‌ చేశాడు. బహుశా వాళ్లిద్దరూ మెసెంజర్‌లో మాట్లాడుకుంటూ హత్యకు ప్లాన్‌ చేసి ఉంటారు’ఎస్‌.ఐ నిమిషం ఆలస్యం చేయలేదు.వెంటనే రమ్య ఇంటికి వెళ్లి ఆమె ఫోన్‌ హ్యాండోవర్‌ చేసుకున్నాడు. అందులో ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయగానే బై డిఫాల్ట్‌ ‘నిఖిల్‌’ పేరుతో ఓపెన్‌ అయ్యింది.ఎస్‌.ఐ రమ్యను అరెస్ట్‌ చేశాడు.‘ఏంటయ్యా.. ఇది. చాలా సింపుల్‌గా అనిపిస్తోంది. కానీ, క్రిటికల్‌గానూ ఉంది. ఎవరు హత్య చేసి ఉండచ్చు..’ కానిస్టేబుల్‌తో మాట్లాడుతున్న సీఐ ఫోన్‌లో ఫేస్‌బుక్‌ని ఓపెన్‌ చేశాడు. ‘నిఖిల్‌ అకౌంట్‌..’ అని ఉంది. ‘ఏంటిదీ..??’ అనుకుంటూ మెసెంజర్‌లోకి వెళ్లి వచ్చిన మెసేజ్‌లను చూస్తున్నాడు. ఒక మెసేజ్‌ చూసిన సీఐ భృకుటి ముడిపడింది. ఆ తర్వాత వరుసగా ఉన్న మెసేజ్‌లను చదివాడు.అంతే, పోలీసు జీపు రయ్యిమంటూ రాకేష్‌ ఇంటికి వెళ్లింది. 


15 ఏళ్ల క్రితం రమ్య, రాకేష్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు. అంతా హ్యాపీగా గడిచిపోతుండగా అనుకోకుండా వారి జీవితంలోకి కిషోర్‌ వచ్చాడు. కిశోర్‌ రాకేష్‌ ఫ్రెండ్స్‌. ఫైనాన్స్‌ లావాదేవీలు కలిసి చేసేవారు. ఇంటికి రాకపోకల్లో రమ్యకు అతడితో స్నేహం ఏర్పడింది. అది సంబంధంగా మారింది. కాని రాకేష్‌కు ఇది తెలిసిపోయింది. ఇద్దరి మధ్య గొడవలు మొదలై ప్రశాంతత లేకుండా పోయింది. ఈ విషయం బంధువులకు ఎక్కడ చెబుతాడోనని భయపడింది రమ్య. రాకేష్‌ అడ్డు తొలగించుకుంటే సమస్యే ఉండదనే ఉద్దేశంతో కిషోర్‌తో చేతులు కలిపింది. ఫోన్‌లో సంభాషించుకుంటే తెలిసిపోతుందని ఫేస్‌బుక్‌లో రమ్య అబ్బాయి పేరుతోను, కిషోర్‌ అమ్మాయి పేరుతోను ఫేక్‌ అకౌంట్లు ప్రారంభించారు. మెసెంజర్‌ ద్వారా చాట్‌ చేసుకుంటూ కలిసేవారు. హత్యకు కూడా అలానే ప్లాన్‌ చేశారు. పథకం ప్రకారం ఆగస్టు 25వ తేదీ రాత్రి కిషోర్‌ పట్టణంలోని రాకేష్‌ ఉంటున్న అపార్టుమెంటుకు చేరుకున్నాడు.  సిద్ధంగా ఉన్న రమ్య అతను ఇంట్లోకి చేరే విధంగా చేసింది. రాకేష్‌కు అప్పటికే నిద్రమాత్రలు ఇవ్వటంతో అతను మత్తులోకి వెళ్లిపోయాడు. మంచంపై ఉన్న రాకేష్‌ను ఇద్దరూ కలిసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. కిషోర్‌కు 2 లక్షల రూపాయలు ఇచ్చిన రమ్య ఈ విషయం ఎక్కడా బయటపడకుండా ఉండాలని జాగ్రత్తలు చెప్పింది. ఉదయం యథాప్రకారం ఏమీ తెలియనట్టు రమ్య వ్యవహరించింది. ఇది జరిగాక కిశోర్‌ హైదరాబాద్‌ పారిపోయాడు. అక్కడే కిషోర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఫేక్‌ అకౌంట్లు ఫేట్‌ను మారుస్తాయి.నకిలీ పనులు అసలు జీవితాన్ని ధ్వంసం చేస్తాయి.మాట్లాడకూడని వారితో మాట్లాడకూడని మాటలు మాట్లాడితే మాట్లాడ్డానికి మనిషి ఉండని జైలు జీవితం గడపాల్సి వస్తుంది. బీ కేర్‌ఫుల్‌.

రాకేష్‌ మృతి వెనుక ఆమె హస్తం ఉన్నట్టయితే ఒక్కత్తే ఆమె అతణ్ణి చంపే అవకాశం లేదు. ఎవరి  తోడో కావాలి. కావాలంటే ఎవరితో ఒకరితో ఏదో ఒక పద్ధతిలో మాట్లాడాలి. కాని ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు. అది చిన్న ఊరు. అపార్ట్‌మెంట్‌కు సిసి కెమెరాల ఏర్పాటు లేదు. కేసును ఛేదించడం ఎలా? 
– చెల్లుబోయిన శ్రీనివాసు, సాక్షి,
రామచంద్రపురం, తూర్పుగోదావరి జిల్లా

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా