ఫ్యామిలీ డాక్టర్‌

16 Jan, 2018 23:09 IST|Sakshi

గ్యాస్ట్రోఎంటరాలజీ  కౌన్సెలింగ్‌

గుండె సమస్య కాదంటున్నారు... మరెందుకీ నొప్పి?
నా వయసు 39 ఏళ్లు. నాకు తరచూ ఛాతీ ఎడమభాగంలో నొప్పి వస్తోంది. గత మూడేళ్ల నుంచి ఈ నొప్పితో బాధపడుతున్నాను. కార్డియాలజిస్టును కలిసి గుండెకు సంబంధించిన అన్ని పరీక్షలూ చేయించుకున్నాను. సమస్య ఏమీ లేదని అంటున్నారు. కానీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. రాత్రివేళల్లో నొప్పి మరీ ఎక్కువ అవుతోంది. సమస్య ఏమై ఉంటుంది? ఈ నొప్పి తగ్గే మార్గం లేదా? 
– ఆంజనేయరెడ్డి, కర్నూలు 

మీరు తెలిపిన వివరాలు, పేర్కొన్న లక్షణాలను బట్టి మీకు ఆహార వాహికకు సంబంధించిన ‘రిఫ్లక్స్‌ డిసీజ్‌’తో బాధపడుతున్నట్లు అర్థమవుతోంది. ఇది సాధారణంగా స్థూలకాయం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఒకసారి ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోండి. అందులో మీ రిఫ్లక్స్‌ డిసీజ్‌ తీవ్రత తెలుస్తుంది. రాత్రివేళల్లో నొప్పి ఎక్కువ అంటున్నారు కాబట్టి గ్యాస్ట్రో ఎంటరాలజిస్టును కలసి, ఆ  నొప్పిని తగ్గించుకునే మందులు వాడండి. మంచి ఫలితం ఉంటుంది. దీంతోపాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహారపదార్థాలు మీ సమస్యను తీవ్రతరం చేస్తాయి. వాటిని వాడటం వల్ల లక్షణాలు పెరుగుతాయి. వాటిని గుర్తించి, వాటినుంచి దూరంగా ఉండాలి. ఇటువంటి మార్పులతో మీ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. 

ఛాతీలో మంట.. తగ్గేదెలా?
నా వయసు 42 ఏళ్లు. నేను చాలా రోజుల నుంచి ఛాతీలో మంటతో బాధపడుతున్నాను. యాంటాసిడ్‌ సిరప్‌ తాగినప్పుడు మంట తగ్గుతోంది. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్లీ పరిస్థితి మామూలే. దీన్ని శాశ్వతంగా తగ్గించుకోవడానికి ఏం చేయాలి? నాకు తగిన సలహా ఇవ్వగలరు. 
– అనిల్‌కుమార్, మిర్యాలగూడ 

మీరు తెలిపిన వివరాలు, లక్షణాలను బట్టి చూస్తే మీరు గ్యాస్ట్రో ఈసోఫేజియల్‌ రిఫ్లక్స్‌ డిసీజ్‌ (జీఈఆర్‌డీ)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల వచ్చే అనారోగ్యమిది. మీ రోజువారీ జీవనశైలినీ, ఆహారపు అలవాట్లనూ సరిచేసుకుంటే ఈ వ్యాధి చాలావరకు తగ్గుముఖం పడుతుంది. ఈ సమస్య తగ్గడానికి కొన్ని సూచనలివి... 

మీరు తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించడం  కాఫీ, టీలను పూర్తిగా మానేయడం ∙పొగతాగే అలవాటు ఉంటే పూర్తిగా మానేయడం, మద్యం అలవాటుకు దూరంగా ఉండటం ∙బరువు ఎక్కువగా ఉంటే దాన్ని సరైన స్థాయికి తగ్గించడం ∙భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కాస్త సమయం తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి తలవైపున పడక కొంచెం ఎత్తుగా ఉండేలా అమర్చుకోవాలి. 

పై సూచనలతో పాటు మీ డాక్టర్‌ సలహా మీద పీపీఐ డ్రగ్స్‌ అనే మందులు వాడాలి. అప్పటికీ తగ్గకపోతే ఎండోస్కోపీ చేయించుకొని తగిన చికిత్స తీసుకోండి. 

హెచ్‌బీఎస్‌ఏజీ పాజిటివ్‌... పరిష్కారం చెప్పండి
నా వయసు 32 ఏళ్లు. నేను ఒక సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాను. ఇటీవల మా సంస్థ నిర్వహించిన మెడికల్‌ క్యాంప్‌లో నాకు హెచ్‌బీఎస్‌ఏజీ పాజిటివ్‌ వచ్చిందని తెలిసింది. దీనివల్ల కాలేయం చెడిపోయే అవకాశం ఉందని అంటున్నారు. నిజమేనా? నా వ్యాధి మందులతో తగ్గిపోతుందా? తగిన సలహా చెప్పి, పరిష్కారం చూపండి. 
– ఎమ్‌.ఎస్‌.ఎస్‌. హైదరాబాద్‌ 

మీరు హెపటైటిస్‌–బి అనే ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఈ వైరస్‌ రక్తంలో ఉన్నంత మాత్రాన కాలేయం చెడిపోయే అవకాశం లేదు. రక్తంలో ఈ వైరస్‌ ఉండే దశను బట్టి లివర్‌ చెడిపోయే అవకాశం ఉంటుంది. వైరస్‌ ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి కొన్ని రక్త పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. లివర్‌ ఫంక్షన్‌ పరీక్షలో తేడా వస్తే ఒకసారి మీకు దగ్గర్లో ఉండే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలిసి చికిత్స తీసుకోవచ్చు. 

కడుపులో అల్సర్, పిత్తాశయంలో రాయి...! 
నా వయసు 40 ఏళ్లు. గత నెలరోజులుగా కడుపులో మంట, నొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాను. పరీక్షల్లో కడుపులో అల్సర్‌ (చిన్న పుండు) ఉంది అని తేలింది. అల్ట్రాసౌండ్‌లో పిత్తాశయంలో రాయి ఉన్నట్లుగా వచ్చింది. ఈ సమస్య మందులతో తగ్గుతుందా, ఆపరేషన్‌ అవసరమా? 
– మల్లయ్య, వరంగల్‌ 

సాధారణంగా వయసు పెరిగేకొద్దీ పిత్తాశయంలో (గాల్‌బ్లాడర్‌లో) రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. పిత్తాశయంలో రాళ్లు ఉన్నంతమాత్రాన ఆపరేషన్‌ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ రాళ్ల వల్ల తరచూ నొప్పి వస్తుంటే అప్పుడు గాల్‌బ్లాడర్‌ను తొలగించాల్సి ఉంటుంది. మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీకు యాసిడ్‌ పెప్టిక్‌ డిసీజ్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మీకు వచ్చే నొప్పి పిత్తాశయానికి సంబంధించినది కాదు. కాబట్టి మీరు భయపడాల్సిందేమీ లేదు. ఒకసారి వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. 

డాక్టర్‌ భవానీరాజు
సీనియర్‌ 
గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,
కేర్‌ హాస్పిటల్స్,
బంజారాహిల్స్,
హైదరాబాద్‌

మరిన్ని వార్తలు