పేరెంట్స్‌కు డయాబెటిస్‌ ఉంటే మనకూ వస్తుందా? 

14 Mar, 2018 00:39 IST|Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

డయాబెటిస్‌ కౌన్సెలింగ్‌

నా వయసు 32 ఏళ్లు. మా నాన్నగారికి డయాబెటిస్‌ ఉంది. నాకు కూడా ఉందేమోనని అనుమానం వచ్చి, ఇటీవల ఎఫ్‌బీఎస్‌ (ఫాస్టింగ్‌ బ్లడ్‌ షుగర్‌) పరీక్ష చేయించుకున్నాను. ఆ పరీక్షలో ఫలితం 114 ఎంజీ/డీఎల్‌ అని వచ్చింది. నాకు డయాబెటిస్‌ లేదని చెప్పారు. అయితే మా నాన్నగారికి మధుమేహం ఉంది కాబట్టి నాకు కూడా కచ్చితంగా డయాబెటిస్‌ వస్తుందా? ఒకవేళ వస్తే ఏ వయసులో వస్తుంది? దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు.  – సుధాకర్‌రావు, గుడివాడ 
మీకు ఎఫ్‌బీఎస్‌ పరీక్షల్లో వచ్చిన ఫలితాన్ని బట్టి చూస్తే మీరు ప్రీ–డయాబెటిక్‌ దశలో ఉన్నారని తెలుస్తోంది. అంటే డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న దశ అని అర్థం. మీ నాన్నగారికి డయాబెటిస్‌ ఉందని తెలిపారు కాబట్టి మీరు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డయాబెటిస్‌ వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ దశలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటిస్‌ను దరిచేరకుండా జాగ్రత్తపడవచ్చు. మీరు ముందుగా పరీక్షలు చేయించుకోవడం మంచి విషయం. ఎందుకంటే డయాబెటిస్‌  వచ్చిన తర్వాత నియంత్రించుకోవడం మినహా చేయగలిగినదేమీ లేదు. అయితే ఇప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను నివారించుకోవచ్చు. మీరు ఇకపై డాక్టర్లు సూచించిన ప్రకారం క్రమం తప్పకుండా రక్త పరీక్షలు  చేయించుకోండి. ఇకపై మీ జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి. ప్రధానంగా మీ బరువును అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. అధిక క్యాలరీలు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండండి. మద్యపానం, పొగాకు వంటి అలవాట్లు ఏమైనా ఉంటే వెంటనే వాటిని మానేయండి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. అలా వీలుకాకపోతే కనీసం వారంలో ఐదురోజులైనా... రోజుకు అరగంట పాటు కచ్చితంగా వ్యాయామం చేయండి. తాజా ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోండి. పెసర్లు, మొలకెత్తి గింజలు శ్నాక్స్‌గా తీసుకుంటే చాలా మంచిది. ఆహారం విషయంలో కచ్చితంగా సమయపాలనను పాటించండి. సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. 

డయాబెటిస్‌ ఉన్నవారు  బరువు తగ్గితే ప్రమాదమా? 
నా స్నేహితుడి వయసు 45 ఏళ్లు. అతడికి డయాబెటిస్‌ వ్యాధి ఉంది. తాను బాగా లావుగా ఉండటంతో తన బరువు తగ్గించుకోడానికి రోజూ వ్యాయామం చేస్తున్నాడు. ఇటీవల అతడి బరువు అకస్మాత్తుగా తగ్గడం మొదలయ్యింది. ఈమధ్య బాగా బరువు తగ్గి, చాలా సన్నగా కనిపిస్తున్నాడు. అతడిని చూస్తేనే ఆందోళనగా ఉంది. డయాబెటిస్‌ వ్యాధి ఉన్నవారు ఇలా అకస్మాత్తుగా బరువు తగ్గితే ఏదైనా ప్రమాదమా?  – దామోదర్‌రావు, విజయవాడ 
సాధారణంగా ఏమాత్రం ఊబకాయం ఉన్నా బరువు తగ్గడం ఆరోగ్యానికి మంచిదనే అందరమూ అనుకుంటాం. శారీరక వ్యాయామం చేస్తూ, క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ, క్రమంగా ఉండాల్సినంత బరువుకు చేరడం మంచిదే. ఇలా బరువు తగ్గడం  కొలెస్ట్రాల్, బీపీని అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనికితోడు బరువు తగ్గడం ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ను తగ్గించడమే కాకుండా కండరాలు, కణజాలం, రక్తంలోని కొవ్వులు ఇన్సులిన్‌కు స్పందించేలా చేస్తుంది కూడా. శరీర కణజాలం, కండరాలు గ్లూకోజ్‌ను ఉపయోగించుకొని శక్తి పొందడానికి ఇన్సులిన్‌ అవసరమవుతుంది. ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ వల్ల కండరాలు, కణజాలం గ్లూకోజ్‌ను వాడుకోవాలంటే మామూలు కంటే అధిక స్థాయిలో ఇన్సులిన్‌ అందుబాటులోకి రావాలి. టైప్‌–2 డయాబెటిస్‌లో ఇదే పరిస్థితి ఉంటుంది. ఫలితంగా ఒక విషవలయం ఏర్పడుతుంది. ఇన్సులిన్‌ లెవల్‌ ఎక్కువ అవుతున్న కొద్దీ శరీరం బరువు తగ్గడం కష్టమవుతుంది. మరోవైపు శరీరం బరువు అధికమవుతున్నకొద్దీ ఇన్సులిన్‌ లెవెల్‌ పెరుగుతూ ఉంటుంది. ఈ చక్రవలయాన్ని ఛేదించడం కష్టం. డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు ఉద్దేశపూర్వకంగా బరువు తగ్గించుకోవడం మంచిదే. కానీ తమ ప్రయత్నమే లేకుండా అకస్మాత్తుగా బరువు తగ్గడం మాత్రం మంచి సూచన కాదు. రక్తంలో చక్కెర పరిమాణం ఎక్కువగా ఉన్నవారు వారు తరచూ మాత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. ఇది డీ–హైడ్రేషన్‌కు దారితీస్తుంది. దాంతో శరీరం బరువు తగ్గిపోతుంది. డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు చాలామంది మొదటిసారి డాక్టర్‌ను కలిసినప్పుడు చేసే ఫిర్యాదు తమ బరువు తగ్గిందనే. డయాబెటిస్‌తో పాటు థైరాయిడ్, క్యాన్సర్‌ వంటి వ్యాధుల వల్ల కూడా శరీరం బరువు తగ్గిపోతుంది. అందువల్ల వ్యాయామం, డైటింగ్‌ వంటి తమ ప్రయత్నాలు ఏమీ లేకుండా బరువు తగ్గడం ఒక ప్రమాద సూచిక. రక్తంలోని చక్కెర పరిమాణంలో మార్పులకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయేమో అని కచ్చితంగా తేల్చుకోవడం అవసరం. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా మీ స్నేహితుడికి పూర్తిస్థాయి వైద్యపరీక్షలు చేయించండి. 

డయాబెటిస్‌ రోగులు... పాదాల జాగ్రత్తలు 
డయాబెటిస్‌ రోగులు పాదాల విషయంలో జాగ్రత్తలు పాటించాలంటారు. ఎందుకలా? ఆ జాగ్రత్తలను సూచించండి.  – ధనరాజ్, నూతలపాడు 
డయాబెటిస్‌ రోగుల్లో సాధారణంగా పాదాలకు గాయం అయినప్పుడు ఉండే నొప్పి తెలియదు. దాంతో ఆ గాయం పెద్దదైపోయి మాననివిధంగా మారి, కుళ్లడం ప్రారంభమయ్యే వరకు (గ్యాంగ్రీన్‌లా మారేవరకు) తెలియదు. ఒక్కోసారి ఈ పరిస్థితి పాదాన్ని తొలగించే పరిస్థితి వరకు తేవచ్చు. అందుకే డయాబెటిస్‌ రోగులు క్రమం తప్పక రోజూ పాదాలను పరిశీలించుకోవాలంటూ డాక్టర్లు హెచ్చరిస్తుంటారు. షుగర్‌ ఉన్న ప్రతివారూ, అందునా ఐదు నుంచి పదేళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్నవారు తమ కాళ్లనూ ప్రత్యేకంగా పాదాలను చాలా జాగ్రత్తగానూ, నిశితంగానూ పరిశీలించుకుంటూ ఉండాలి. ఆ క్రమంలో పాటించాల్సిన మార్గదర్శకాలివి... 
   
తరచూ కాలి పరీక్ష స్వయంగా చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రక్రియంలో భాగంగా పాదాల కింద అద్దం పెట్టుకుని, పాదం ఏవిధంగా ఉందో చూసుకోవాలి. కాలి పైభాగాన్నీ నిశితంగా పరీక్షించుకోవాలి. అలాగే కాలి వేళ్ల మధ్య భాగాలనూ పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ పరిశీలనలో చిన్న పొక్కులాంటిది ఉన్నా దాన్ని విస్మరించకూడదు. భవిష్యత్తులో అది పుండుగా మారే ప్రమాదం కూడా ఉండవచ్చు. ∙నిత్యం పాదాలను పొడిగా ఉంచుకోవాలి. కాళ్లు కడుక్కున్న వెంటనే పొడిగా అయ్యేలా తుడుచుకోవాలి. కాలి వేళ్ల మధ్య కూడా పొడిగా ఉండటం కోసం పౌడర్‌ రాసుకోవాలి.  ∙కాలికి చెప్పులు, బూట్లు లేకుండా నడవకూడదు. అయితే ఈ చెప్పులు, బూట్లూ కాలికి చాలా సౌకర్యంగా ఉండాలి. ఏమాత్రం అసౌకర్యం ఉన్నా ఆ పాదరక్షలు వాడకండి. సౌకర్యంగా ఉండేవి మాత్రమే ఎంచుకోవాలి. ∙వేడి వస్తువులనుంచి మీ కాళ్లను దూరంగా ఉంచుకోండి. డయాబెటిస్‌ ఉన్నవారు  హాట్‌ వాటర్‌ బ్యాగ్‌తో కాళ్లకు కాపడం పెట్టుకోకపోవడమే మంచిది.  ∙పాదాలను మృదువుగా ఉంచుకోవాలి. ఇందుకోసం కాళ్లు కడుకున్న తర్వాత పొడిగా తుడుచుకొని, ఆ తర్వాత వాజిలైన్‌తో కాళ్లను రుద్దుకొని, మళ్లీ ఆ తర్వాత  పొడిగానూ మారేలా శుభ్రం చేసుకోవాలి. 
     
కాళ్ల మీద పులిపిరి కాయల్లాంటివి ఏవైనా ఏర్పడితే డాక్టర్‌ను సంప్రదించి, ఆయన పర్యవేక్షణలోనే వాటిని తొలగించుకోవడం చాలా ముఖ్యం.      కాలిగోళ్లను ప్రతివారమూ తొలగించుకోవాలి. ఈ సమయంలో గోళ్లను మరీ లోపలికి కట్‌ చేసుకోకూడదు. అలాంటప్పుడు ఒక్కోసారి గోరు మూలల్లో రక్తం వచ్చేంతగా గోరు కట్‌ కావచ్చు. ఇది జరిగినప్పుడు కొందరిలో గోరు లోపలి వైపునకు పెరగవచ్చు. ఇది డయాబెటిస్‌ రోగుల్లో మరింత ప్రమాదం. ఇంట్లో కూడా పాదరక్షలు లేకుండా నడవకండి. ప్రత్యేకంగా తడి, తేమలో పనిచేసే మహిళలు స్లిప్పర్స్‌ వంటివి తొడుక్కునే పనిచేసుకోవాలి. ∙ఏడాదికోసారి కాలి వైద్య నిపుణులకు చూపించుకుంటూ ఉండాలి. ఇవన్నీ కాలి సంరక్షణకు ఉపయోగపడే మార్గాలు. 
డాక్టర్‌  అశోక్‌ వెంకట నరసు
సీనియర్‌ ఎండోక్రై నాలజిస్ట్‌ అండ్‌ డయాబెటాలజిస్ట్‌ యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్‌ 

మరిన్ని వార్తలు