వడదెబ్బ  తగలకుండా  నివారించే  మందులున్నాయా? 

19 Apr, 2018 02:05 IST|Sakshi

హోమియో కౌన్సెలింగ్స్‌

నేను సేల్స్‌మేన్‌గా పనిచేస్తుంటాను. ఈ వేసవికాలం ఎండతీవ్రత ఎక్కువగా ఉంది. ఎండదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ మాలో కొందరికి వడదెబ్బ తగిలే అనారోగ్య పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోంది. వడదెబ్బకు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిబారిన పడకుండా ఉండేందుకు హోమియోలో ఏదైనా ముందస్తుగా వాడే నివారణ మందులు ఉన్నాయా? తెలుపగలరు. 
– ఆర్‌. రవికుమార్, విజయవాడ 

వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్సి సందర్భాల్లో ఎండలో పనిచేయాల్సి రావడంతో వడదెబ్బకు గురై అనారోగ్యం బారిన పడే పరిస్థితి ఉంటుంది. అయితే హోమియోలో ఎండదెబ్బకు గురికాకుండా రక్షించుకునే నివారణ మందులు (ప్రివెంటివ్‌ మెడిసిన్‌) అందుబాటులో ఉండటమే కాకుండా... దీని బారిన పడ్డవారికి మంచి చికిత్స కూడా అందుబాటులో ఉంది.  వడదెబ్బ ప్రాణాంతకమైన పరిస్థితి అని చెప్పవచ్చు. ఏ వయసు వారిపైనైనా ప్రతాపం చూసే ఈ వడదెబ్బ ఎక్కువగా చిన్నపిల్లలు, వృద్ధులపై తన ప్రభావం ఎక్కువగా చూపుతుంది. 

వడదెబ్బ అంటే : అధిక ఉష్ణోగ్రతకు ఎక్స్‌పోజ్‌ కావడం వల్ల శరీర ఉష్ణోగ్రత 102 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు పెరిగి, అది కేంద్ర నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం చూపే పరిస్థితిని వడదెబ్బగా పరిగణిస్తారు. సాధారణంగా వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు చెమటలు పట్టడం ద్వారా శరీరం తన సాధారణ (నార్మల్‌) ఉష్ణోగ్రతకు తిరిగి చేరుతుంది. అయితే ఇలా చెమటలు పట్టే సమయంలో నీరు, ఇతర కీలకమైన లవణాలను శరీరం ఎక్కువగా కోల్పోతుంది. ఇలా కోల్పోయిన వాటిని భర్తీ చేసేలా మళ్లీ నీరు, లవణాలను పొందనప్పుడు శరీరం డీ–హైడ్రేషన్‌కు గురవుతుంది. అలాంటి సమయాల్లో శరీరంలోని కణాలు రక్తంలోని నీటిని ఉపయోగించుకుంటాయి. దాంతో రక్తం పరిమాణం తగ్గి, గుండెతో పాటు మెదడు వంటి ఇతర కీలక అవయవాలకు తగినంత రక్తప్రసరణ అందకపోవడం వల చర్మం తాలూకు శీతలీకరణ వ్యవస్థ దెబ్బతిని శరీర ఉష్ణోగ్రత అనియంత్రితంగా పెరిగిపోతుంది. దాంతో వడదెబ్బ లక్షణాలు కనిపిస్తాయి. 

లక్షణాలు : వడదెబ్బ లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి. చర్మం పొడిబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండెదడ, వాంతులు, వికారం, విరేచనాలు, కండరాల తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి విషమిస్తే కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు :  ∙నీటితో పాటు మజ్జిగ, కొబ్బరినీళ్లు, పండ్లరసాల వంటి ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ∙ఎక్కువ ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఎండలోకి వెళ్ల్సాన పరిస్థితి ఉంటే పల్చటి, లేతరంగు దుస్తులు వేసుకోవాలి. కాటన్‌ దుస్తులు ధరిస్తే మంచిది. తలపై ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ∙మద్యం, కెఫిన్‌ ఎక్కువగా ఉండే పానియాలు తీసుకోకూడదు. అవి మూత్రం ఎక్కువగా విసర్జితమయ్యేలా చేసి, డిహైడ్రేషన్‌కు గురిచేస్తాయి. కాబట్టి వాటిని అసలు  తీసుకోకపోవడమే మంచిది. ∙వడదెబ్బ తగిలినప్పుడు బాగా గాలి తగిలేలా రోగిని ఉంచి, శరీరాన్ని చల్లబరచాలి. 
చికిత్స : హోమియోపతి వైద్యవిధానంలో వడదెబ్బకు గురికాకుండా చేసే నివారణ చికిత్స అందుబాటులో ఉంది. అంతేగాక వడదెబ్బకు గురైన వ్యక్తికి తగిన ప్రాథమిక చికిత్సతో పాటు అవసరమైన తదనంతర చికిత్స కూడా అందించి త్వరగా కోలుకునేలా చేసే మందులు అందుబాటులో ఉన్నాయి. 
డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లావర్, సీఎండీ, 
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

పేను కొరుకుడుకు చికిత్స ఉందా? 
మా అమ్మాయి వయసు 25 ఏళ్లు. ఈమధ్య జుట్టులో ఒకేచోట వెంట్రుకలు రాలిపోతున్నాయి. అందరూ పేనుకొరుకుడు అంటున్నారు. హోమియోలో పరిష్కారం చెప్పండి. 
– వెంకటలక్ష్మి, ఏలూరు 

పేను కొరుకుడు సమస్యను వైద్యపరిభాషలో అలొపేషియా అంటారు. ఈ కండిషన్‌లో ఒక నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా రాలిపోయి, నున్నగా మారుతుంది. శరీరం తనను తాను రక్షించుకోగలిగే శక్తిని కోల్పోయినప్పుడు జుట్టు రాలిపోతుంటుంది. అలాంటప్పుడు చాలాసార్లు తలపై అక్కడక్కడ ప్యాచ్‌లలాగా ఏర్పడతాయి. ఇది ఒక ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌. అంటే తన సొంత వ్యాధి నిరోధక శక్తి తన వెంట్రుకలపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య అన్నమాట. ఇది తలలోగానీ, గడ్డంలోగానీ, మీసాలలోగాని ఇది రావచ్చు. ఇది అంటువ్యాధి కాదు. సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య కనిపించదు. 

కారణాలు : 
∙మానసిక ఆందోళన ∙థైరాయిడ్‌ సమస్య ∙డయాబెటిస్, బీపీ వంటి సమస్య ఉన్నవాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది  వంశపారంపర్యంగా ∙కవలల్లో ఒకరికి ఉంటే మరొకరికి వచ్చే అవకాశం ఉంటుంది. 
లక్షణాలు : ∙తలపై మొత్తం జుట్టు ఊడిపోయి, బట్టతల లక్షణాలు కనిపిస్తాయి. ∙తలపై అక్కడక్కడ గుండ్రంగా ప్యాచ్‌లలా జుట్టు ఊడిపోతుంది ∙సాధారణంగా గుండ్రగా లేదా అండాకృతితో ఈ ప్యాచ్‌లు ఉంటాయి. 
నిర్ధారణ : ఈ సమస్య నిర్దిష్టంగా ఏ కారణం వల్ల వచ్చిందో తెలుసుకోవాలి. ట్రైకోస్కోపీ, బయాప్సీ, హిస్టలాజిక్‌ పరీక్షలు, పిగ్మెంట్‌ ఇన్‌కాంటినెన్స్‌ వంటివే మరికొన్ని పరీక్షలు. 
చికిత్స : పేనుకొరుకుడు సమస్యకు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యులు వ్యాధి కారణాలు, లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులను సూచిస్తారు. దీనికి హోమియోలో యాసిడ్‌ ఫ్లోర్, సల్‌ఫర్, ఫాస్ఫరస్, గ్రాఫైటిస్, సెలీనియమ్, సొరినమ్, తుజా వంటి మందులను డాక్టర్ల పర్యవేక్షణ లో వాడాల్సి ఉంటుంది. 
డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి, 
ఎండీ (హోమియో), 
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

పైల్స్‌ తగ్గుతాయా?

నా వయసు 47 ఏళ్లు. నాకు కొంతకాలం నుంచి మలద్వారం వద్ద బుడిపెలా బయటకు వస్తోంది. మల విసర్జన సమయంలో రక్తం కూడా పడుతోంది. అప్పుడప్పుడు సూదితో గుచ్చినట్లుగా నొప్పి వస్తోంది ఉంది. కూర్చోడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. డాక్టర్‌ను కలిస్తే పైల్స్‌ అని చెప్పారు. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. 
– శ్రీనివాసరావు, సంగారెడ్డి 

ఈ మధ్యకాలంలో తరచూ వినిపించే సమస్యలలో ఇది ఒకటి.  మలద్వారపు గోడల మార్పుల వల్ల ఆ చివరన ఉండే రక్తనాళాలు (సిరలు) ఉబ్బి మొలలుగా ఏర్పడతాయి. ఇవి మలాశయం లోపల, వెలుపల చిన్న చిన్న బుడిపెల రూపంలో ఏర్పడి ఇబ్బంది పెడతాయి. తీవ్రతను బట్టి వీటిని నాలుగు దశలుగా వర్గీకరించవచ్చు. 
మొలల దశలు : గ్రేడ్‌–1 దశలో మొలలు పైకి కనిపించవు. నొప్పి కూడా ఉండదు. కానీ రక్తం మాత్రం పడుతుంది. 
గ్రేడ్‌–2లో రక్తం పడవచ్చు, పడకపోవచ్చు కానీ మల విసర్జన సమయంలో బయటకు వస్తాయి. వాటంతట అవే లోపలకు వెళ్లిపోతుంటాయి. 
గ్రేడ్‌–3లో మల విసర్జన చేసేటప్పుడు మొలలు బయటకు వస్తాయి. కానీ మల విసర్జన తర్వాత వాటంతట అవి లోపలికి పోకుండా వేలితో నెడితే లోనికి వెళ్తాయి. 
గ్రేడ్‌–4 దశలో మొలలు మలద్వారం బయటే ఉండిపోతాయి. నెట్టినా లోనికి వెళ్లవు. 

కారణాలు : ∙మలబద్దకం ∙మలవిసర్జన సమయంలో గట్టిగా ముక్కడం వల్ల అక్కడే ఉండే కండరబంధనం సాగిపోతుంది. తద్వారా మొలలు బయటకు పొడుచుకుని వస్తాయి. ∙సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం ∙స్థూలకాయం (ఒబేసిటీ) ∙చాలాసేపు కూర్చొని పనిచేసే ఉద్యోగులకు ఈ సమస్య ఎక్కువ ∙మలబద్దకం మాత్రమే గాక అతిగా విరేచనాలు కావడం కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు ∙మంచి పోషకాహారం తీసుకోకపోవడం ∙నీరు తక్కువగా తాగడం  ఎక్కువగా ప్రయాణాలు చేయడం ∙అధిక వేడి ప్రదేశంలో పనిచేస్తుండటం ∙మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ. 

లక్షణాలు : నొప్పి, రక్తస్రావం, కొన్నిసార్లు దురద, ఏదో గుచ్చుతున్నట్లుగా నొప్పి ∙మలవిసర్జన సమయంలో ఇబ్బంది కలగడం. 
నివారణ : ∙మలబద్దకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ∙సమయానికి భోజనం చేయడం ముఖ్యం ∙ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం  కొబ్బరినీళ్లు ∙నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవడం  మసాలాలు, జంక్‌ఫుడ్, మాంసాహారం తక్కువగా తీసుకోవడం ∙మెత్తటి పరుపు మీద కూర్చోవడం వంటివి పైల్స్‌ నివారణకు తోడ్పడే కొన్ని జాగ్రత్తలు. 
హోమియోలో రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచేలా ఇచ్చే మందులు ఇచ్చి వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. 
డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, 
పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు