బాబుకు ఆస్తమా  తగ్గుతుందా?

1 May, 2018 00:26 IST|Sakshi

నేడు వరల్డ్‌ ఆస్తమా డే

ఆస్తమా కౌన్సెలింగ్‌

మా బాబుకు ఐదేళ్లు. వాడికి తరచూ ఆస్తమా వస్తూ ఉంటుంది. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని మందులు ఇచ్చారు. మాది చాలా రూరల్‌ ఏరియా. మా బాబుకు ఆస్తమా తగ్గుతుందా? దయచేసి వివరించండి. 
– నిహారిక, తల్లాడ 

చిన్నపిల్లల్లో ఆస్తమా వస్తే వారు పెరిగే కొద్దీ... అంటే టీన్స్‌లోకి ప్రవేశిస్తున్నప్పుడు  లేదా యుక్తవయస్కులుగా మారుతున్నప్పుడు ఆ ఆస్తమా లక్షణాలు క్రమంగా తగ్గిపోవచ్చు. అయితే కొంతమందిలో కొన్నాళ్లు కనిపించకుండా పోయిన ఆ లక్షణాలు  కొంతకాలం తర్వాత మళ్లీ కనిపించవచ్చు. చిన్నప్పుడు మరీ తీవ్రమైన ఆస్తమా వస్తే అది పెద్దయ్యాక కూడా తగ్గకపోవచ్చు. అయితే మీవాడి తీవ్రత తక్కువే అని మీ లేఖను బట్టి తెలుస్తోంది కాబట్టి అది తగ్గే అవకాశమే ఉంది. బాధపడకండి. మీ బాబు ఆస్తమాకు రెండు రకాల చికిత్స అవసరమవుతుంది. అది... 

∙దీర్ఘకాలంలో మళ్లీ రాకుండా నివారించేందుకు అవసరమైన ప్రివెంటివ్‌ చికిత్స.  ఇందులో భాగంగా ఇచ్చే ఇన్‌హేలర్‌ను ప్రతిరోజూ తీసుకోవాల్సి ఉంటుంది. 
∙తక్షణ ఉపశమనం కోసం తీసుకోవాల్సిన చికిత్స.  ఆస్తమా వచ్చినప్పుడు వాయునాళాల వాపు తగ్గించి, హాయిగా శ్వాస తీసుకోవడాని దోహదపడేందుకు ఉపయోగించే మందులు దీనికోసం వాడాల్సి ఉంటుంది. వీటినే రెస్క్యూ మెడికేషన్‌ అనీ, క్విక్‌ రిలీఫ్‌ మెడికేషన్‌ అని కూడా అంటారు. ఇది ఆస్తమా అటాక్‌ ఉన్నప్పుడు చేసే స్వల్పకాలిక చికిత్స. కొందరు పిల్లల్లో ఆటలు లేదా వ్యాయామానికి ముందు కూడా ఈ చికిత్సను డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు.  మీ బాబు వయసు ఐదేళ్లు కాబట్టి ఇలాంటి పిల్లల్లో స్పేసర్‌తో ఇన్‌హేలర్‌ ఉపయోగించాలి. మీరు మీకు దగ్గర్లోని పెద్దసెంటర్‌లో ఉన్న నిపుణులను సంప్రదించండి. పిల్లల్లోని ఆస్తమాకు డాక్టర్లు సూచించినట్లు మందులు వాడితే ఇప్పుడు చాలామందిలో అది పెద్దయ్యేనాటికి తప్పక తగ్గుతుంది.

చలవ  పదార్థాలతో ఆస్తమా వస్తుందా? 
నా వయసు 37 ఏళ్లు. నాకు చాలాకాలంగా ఆస్తమా ఉంది. అయితే కొందరు చల్లటి పదార్థాలు తినకూడదు, చలవ పదార్థాల వల్ల ఆస్తమా వస్తుందని అంటున్నారు. నిజమేనా? 
– ఆర్‌. రామచంద్రరావు, కాకినాడ 

సాధారణంగా ఆస్తమాను చాలా అంశాలు ప్రేరేపిస్తుంటాయి. నిర్దిష్టంగా ఏ పదార్థం ఆస్తమాను ప్రేరేపిస్తుందో దాన్ని అలర్జెన్‌ అంటారు. అదే పదార్థం అందరిలోనూ అదేవిధంగా ఆస్తమాను కలిగించదు. అలెర్జన్లు వ్యక్తి నుంచి వ్యక్తికి మారతాయి. కొందరిలో పుప్పొడి, మరికొందరిలో దుమ్ము, ధూళి, ఇంకొందరిలో పొగ... ఇలా రకరకాల పదార్థాలు ఆస్తమాకు కారణం కావచ్చు. అయితే చాలామందిలో ఏదో ఒక తినే పదార్థం సరిపడక ఆస్తమా రావచ్చు. ఉదాహరణకు... కొందరిలో సముద్రపు ఆహారం (సీఫుడ్స్‌), కొన్ని రకాల నట్స్, పల్లీలు, పులుపు ఎక్కువగా ఉండే పండ్లు, పులుసుకూరలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు, ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి వాడే ప్రిజర్వేటివ్స్‌ కలిపిన ఆహారాలు, నెయ్యికి బదులుగా మార్జరిన్‌ వంటి నూనెలు ఉపయోగించిన నిల్వసరుకులతో ఆస్తమా రావచ్చు. ఇలా సరిపడని ఆహారం వల్ల ఆస్తమా వచ్చే సందర్భాల్లో అసలు రోగికి సరిపడని ఆహారం ఏదో గుర్తించి దాన్ని మాత్రమే నివారించాలి. అది మినహా వ్యాధి తగ్గడానికి, రోగనిరోధక శక్తి పెంపొందడానికి విటమిన్లు, ఖనిజలవణాలు, పోషకాలు పుష్కలంగా ఉన్న మిగతా ఆహారాలన్నింటినీ యథావిధిగా తీసుకోవచ్చు. ఆకకూరలు, ఒమెగా ఫ్యాటీ ఆసిడ్స్‌ ఎక్కువగా ఉండే మంచినీటి చేపలు అలర్జీలను కలిగించవు. ఇలా సరిపడని ఆహారం మినహా ఆరోగ్యకరమైన అన్ని రకాల ఆహారాలూ తీసుకోవచ్చు. అంతేగానీ... ఫలానా చలవచేసే ఆహారాలే ఆస్తమాను తీసుకొస్తాయన్నది సరికాదు. ఎందుకంటే చలవగా భావించే చాలా పదార్థాలు ఆస్తమా ఉన్నవారికీ ఒకవేళ సరిపడితే... అవి రోగికి ఆస్తమాను ఎంతమాత్రమూ ప్రేరేపించలేవు. స్వీయ ప్రయత్నం మీద తమకు ఏ పదార్థం సరిపడటం లేదో రోగి గుర్తించి, దానికి మాత్రమే దూరంగా ఉంటే చాలు. 

ఈసీజన్‌లో నా   ఆయాసానికి కారణం  ఆస్తమాయేనా? 

నా వయసు 69 ఏళ్లు. గతంలో ఆస్తమా ఉంది. కానీ వేసవిలో ఎప్పుడూ వచ్చేది కాదు. అయితే ఇటీవల ఇంత వేసవి తీవ్రతలోనూ బాగా ఆయాసపడ్డాను. ఇది  నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. నేను కాస్త లావుగానే ఉంటాను. నా స్థూలకాయం వల్లనే ఇలా జరిగిందా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.  – ఎమ్‌. సుదర్శన్‌రావు, భీమవరం
స్థూలకాయం నేరుగా ఆçస్తమాను కలగజేయదు. కానీ ఒక్కోసారి స్థూలకాయం వల్ల వచ్చిన ఒళ్లు కారణంగా మనిషి ఆయాసపడుతున్నట్లు కనిపించడం సాధారణం. ఇందువల్ల స్థూలకాయం ఆస్తమాను ప్రేరేపిస్తుందనే అపోహ కొందరిలో ఉంటుంది. అయితే పూర్తిగా ఇది వాస్తవం కాకపోయినా... స్థూలకాయం ఉండటం వల్ల శరీరంలోని జీవప్రక్రియల్లో జరిగే ఆక్సిడేషన్‌ స్ట్రెస్, ప్రాంతంలోని గాలిగొట్టాలు సన్నబారడం, స్థూలకాయం కారణంగా స్లీప్‌ఆప్నియా (గురక) వచ్చి ఊపిరి అందకపోవడం వంటి పరోక్ష కారణాల వల్ల కూడా ఒక్కోసారి ఆయాసం రావచ్చు. మీ వయసు వారిలో ఇటీవల ఆస్తమా కేసులు పెరుగుతున్నాయి. దాంతో పాటు ఆ వయసులో ఆస్తమా రావడం వల్ల శారీరకంగా తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడి అవి ఒక్కోసారి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. వృద్ధాప్యంలో వచ్చిన శారీరక మార్పుల వల్ల మన రోగనిరోధకశక్తి స్పందించే తీరు మారుతుంది. ఈ మార్పు కారణంగా ఏవైనా యాంటిజెన్స్‌కు (సరిపడని పదార్థాల కారణంగా శరీరంలో ఉత్పత్తి అయ్యే ద్రవాలు లేదా పదార్థాలు), ఇరిటెంట్స్‌ (శరీరాన్ని చికాకు పరిచే జీవపదార్థాల)కూ  శరీరం అతిగా స్పందించడం వల్ల కూడా ఆస్తమా రావచ్చు. మీరు ఒకసారి వైద్యనిపుణులను కలిసి ఏ కారణం వల్ల ఆయాసం వచ్చిందో పరీక్షించుకోండి. వైద్యపరీక్షల్లో వచ్చిన ఫలితాలను బట్టి డాక్టర్లు మీకు చికిత్స సూచిస్తారు. 
డాక్టర్‌ ఎ. జయచంద్ర
సీనియర్‌ ఇంటర్వెన్షనల్, పల్మునాలజిస్ట్, 
సెంచరీ హాస్పిటల్స్, రోడ్‌ నెం. 12, 
బంజారాహిల్స్, హైదరాబాద్‌  

మరిన్ని వార్తలు