గౌట్‌తో ఎంతో బాధ..

12 Jul, 2018 00:23 IST|Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

హోమియో కౌన్సెలింగ్స్‌

నా వయసు 45 ఏళ్లు. కొన్నాళ్లుగా కాలి బొటనవేలు వాచింది. విపరీతమైన నొప్పి ఉంది. డాక్టర్‌గారు గౌట్‌ అని చెప్పారు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? 
– ఎమ్‌. అహ్మద్‌బాషా,

కందుకూరు గౌట్‌ అనేది ఒక రకం కీళ్లవ్యాధి. మన శరీరంలో ‘యూరిక్‌ యాసిడ్‌’ జీవక్రియలు సరిగా లేనందున ఇది వస్తుంది. మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్యూరిన్స్‌ అనే పదార్థాల విచ్ఛిన్నంలో యూరిక్‌ యాసిడ్‌ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి, కదలికలు కష్టమౌతాయి. ఆ కండిషన్‌నే ‘గౌట్‌’ అంటారు. 

కారణాలు: ∙ప్యూరిన్స్‌ ఎక్కువగా ఉండే ఆహారం (ఉదా: మాంసం, గుడ్లు, చేపలు) వంటి ఆహారం ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం ∙అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు. 

లక్షణాలు:తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి.చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది.మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది.ఈ సమస్యను నిర్లక్ష్యం చేసి సరైన చికిత్స తీసుకోకపోతే మరింత తీవ్రతరమై కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. 

నివారణ / జాగ్రత్తలు: మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్‌ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్‌ వంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారంలోని లివర్, కిడ్నీ, ఎముక మూలుగా, పేగుల వంటి తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి. 
చికిత్స: హోమియో వైద్యవిధానం ద్వారా అందించే అధునాతనమైన కాన్స్‌టిట్యూషన్‌ చికిత్స ద్వారా గౌట్‌ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది.
డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

మూత్రంలో మంట... తగ్గేదెలా?
నా వయసు 37 ఏళ్లు. మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు మంటగా ఉంటోంది. డాక్టరుకు  ఈ సమస్య చెప్పుకోడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. దయచేసి నా సమస్యకు హోమియోలో పరిష్కారం చెప్పండి. 
– సోదరి, కరీంనగర్‌ 

మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌గా పేర్కొంటారు. మహిళల్లో ఇవి చాలా సాధారణంగా వస్తుంటాయి. జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతివారూ యూరినరీ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడతారు. 
కారణాలు: యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌లో దాదాపు 90 శాతం కేసుల్లో ఈ–కొలై అనే బ్యాక్టీరియా ప్రధానంగా కారణమవుతుంది. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా జీవిస్తూ ఉంటుంది. సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్‌కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యురినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ రావచ్చు. అందుకే హెచ్‌ఐవీ/ఎయిడ్స్, డయాబెటిస్, క్యాన్సర్‌తో బాధపడేవారికి తరచూ ఈ ఇన్ఫెక్షన్లు కనిపిస్తుంటాయి. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించే మహిళల్లో, ప్రోస్టటైటిస్‌తో బాధపడే పురుషుల్లో సులభంగా ఈ ఇన్ఫెక్షన్లు వస్తాయి. 
లక్షణాలు: మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంటు ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం. 

హోమియోపతి చికిత్స: రోగిలో మళ్లీ మళ్లీ యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ రాకుండా చేయడానికి హోమియో మందులు తోడ్పడతాయి. యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యా«ధిలక్షణాలు, వ్యక్తి తత్వాన్ని బట్టి – బెల్లడోనా, ఎపిస్, క్యాంథరిస్, సరసాపరిల్లా వంటి మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. 
డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, 
పాజిటివ్‌ హోమియోపతి,  హైదరాబాద్‌

వెన్ను నొప్పి తగ్గుతుందా? 
నాకు విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. దీనికి హోమియోలో చికిత్స ఉందా? వివరించగలరు.  – డి. బాలసుందరం, పెనుగంచిప్రోలు 
ఇటీవల వెన్నునొప్పి చాలా ఎక్కువ మందిలో కనిపిస్తున్న చాలా సాధారణమైన  సమస్య. వెన్నుభాగంలో లిగమెంట్లు, కండరాలు, ఫేసెట్‌ జాయింట్లు ఒకదానితో ఒకటి అనుసంధానితమై శరీరానికి స్థిరతావన్ని ఇస్తాయి. మన రోజువారీ జీవితంలో శారీరకంగా ఎదురయ్యే ఎన్నో సమస్యలను తట్టుకొని నరాల మీద ఎలాంటి ఒత్తిడి పడకుండా కాపాడుకోవడం వెన్నెముక ప్రధాన లక్షణం. అధికంగా బరువు ఎత్తడం, దించడం, ఊబకాయం, ఇన్ఫెక్షన్లు, క్యాల్షియమ్‌ లోపం, విటమిన్‌ బి12, డీ3 లోపాలు, ఎముకల సాంద్రత తగ్గడం వంటివి వెన్నునొప్పికి కొన్ని కారణాలు. మనం ఏ పని చేయాలన్నా ప్రతిక్షణం మెడ, నడుములోని వెన్నుపూసలు పనిచేయాలి. అందుకే ప్రతి పదిమందిలో ఆరు నుంచి ఎనిమిది మంది వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. వెన్నుపూసలు అరిగినందువల్ల వెన్నునొప్పి వస్తుంది కాబట్టి మందులతో దాన్ని పరిష్కరించలేమనీ, ఆపరేషన్‌ అవసరమని చాలామందిలో ఒక అపోహ ఉంది. వెన్నునొప్పికి కారణమైన డిస్క్‌ బల్జ్, డిస్క్‌ కంప్రెషన్, నరాలమీద ఒత్తిడి పెరగడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. ఇలాంటి వెన్ను సంబంధమైన నొప్పులు వచ్చినప్పుడు... ఉదాహరణకు డిస్క్‌ బల్జ్‌ వల్ల నరాలమీద ఒత్తిడి పెరిగినప్పుడు తగ్గించడానికి హోమియోలో కోబాల్ట్‌ లాంటి మంచి మందులు  అందుబాటులో ఉన్నాయి. ఇక మెడభాగంలో ఉండే వెన్నుపూసలు అరిగినప్పుడు వచ్చే నొప్పిని సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ అంటారు. మెడ భాగంలో సి1 నుంచి సి7 వరకు ఉండే వెన్ను పూసలను సర్వైకల్‌ పూసలు అంటారు. ఇవి అరిగినప్పుడు వెన్నుపూసల కీళ్ల మధ్య భాగం తగ్గిపోవడం వల్ల డిస్క్‌బల్జ్‌ ఏర్పడటం, వెన్నుపూసల మధ్య రాపిడి పెరగడం వంటి కారణాల వల్ల మెడ భాగం నుంచి నొప్పి మొదలై చేతి వేళ్ల వరకు నొప్పి పాకుతూ ఉంటుంది. దాంతో పాటు తిమిర్లు, చేయి మొద్దుబారడం, మెడ ఫ్రీగా తిరగలేకపోవడం, మెడ పట్టివేసినట్లుగా ఉండటం వంటివి చూస్తుంటాం. ఇలాంటి వారికి కూడా యాసిడ్‌ఫాస్‌ అనే మందు బాగా పనిచేస్తుంది. ఇక మెడ, నడుము, వెన్నెముక నొప్పిలకు ఆస్కు్కలస్‌ హిప్, రస్టాక్స్, బ్రయోనియా ఆల్బ్, కాల్కేరియా ఫ్లోర్, హైపరికం, మహిళల్లో వచ్చే ఇలాంటి సమస్యలకే సిమిసిఫ్యూగా వంటివి అద్భుతంగా పనిచేస్తాయి.
డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా,  ఎండీ (హోమియో), స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌  

మరిన్ని వార్తలు