-

వరుసగా గర్భస్రావాలు...సంతానభాగ్యం ఉందా? 

10 Aug, 2018 00:20 IST|Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

హోమియో కౌన్సెలింగ్స్‌
నా వయసు 32 ఏళ్లు. పెళ్లయి ఆరేళ్లు అవుతోంది. మూడుసార్లు గర్భం వచ్చింది. కానీ గర్భస్రావం అయ్యింది. డాక్టర్‌ను సంప్రదిస్తే అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని అన్నారు. అయినా ఈ విధంగా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు. హోమియో ద్వారా నాకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉందా? – శైలజ, సికింద్రాబాద్‌ 
గర్భధారణ జరిగి అది నిలవనప్పుడు, ముఖ్యంగా తరచూ గర్భస్రావాలు అవుతున్నప్పుడు అది వారిని మానసికంగానూ కుంగదీస్తుంది. మరోసారి గర్భం ధరించినా అది నిలుస్తుందో, నిలవదో అన్న ఆందోళనను కలగజేస్తుంది. ఇలా రెండు లేదా మూడుసార్లు గర్భస్రావం అయితే దాన్ని ‘రికరెంట్‌ ప్రెగ్నెన్సీ లాస్‌’గా పేర్కొంటారు. 

కారణాలు: ఇలా గర్భస్రావాలు జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో కొన్ని... ∙గర్భాశయం అసాధారణంగా నిర్మితమై ఉండటం (రెండు గదుల గర్భాశయం) ∙గర్భాశయంలో కణుతులు / పాలిప్స్‌ ఉండటం ∙గర్భాశయపు సర్విక్స్‌ బలహీనంగా ఉండటం ∙కొన్ని రకాల ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు ∙కొన్ని ఎండోక్రైన్‌ వ్యాధులు ∙వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం ∙రకరకాల ఇన్ఫెక్షన్లు రావడం వంటి ఎన్నో కారణాలు గర్భస్రావానికి దారితీస్తాయి. అయితే కొంతమందిలో ఎలాంటి కారణం లేకుండా కూడా గర్భస్రావాలు జరుగుతుండవచ్చు. 

చికిత్స: రోగనిరోధకశక్తిని పెంపొందించడం, హార్మోన్ల అసమతౌల్యతను చక్కదిద్దడం వంటి చర్యల ద్వారా సంతాన లేమి సమస్యను పరిష్కరించవచ్చు. అలాగే  గర్భస్రావానికి దారితీసే అనేక కరణాలు కనుగొని, వాటికి తగి చికిత్స అందించడంతో పాటు కాన్‌స్టిట్యూషన్‌ పద్ధతిలో మానసిక, శారీరక తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందిస్తే సంతాన సాఫల్యం కలుగుతుంది. అయితే అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో కారణాలతో పాటు వేర్వేరు అంశాలను పరిగణనలోకి తీసుకొని సరైన ఔషధాలను వాడితే సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది.
డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

కూర్చుంటే లేవలేకపోతున్నాను...
నా వయసు 29 ఏళ్లు. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ని. రెండేళ్ల నుంచి చాలాసేపు కూర్చున్న తర్వాత లేవలేక, నడవలేకపోతున్నాను. వెన్నుపూసలో పట్టివేసినట్లు ఉంటోంది. హెచ్‌ఎల్‌ఏ బి27 పాజిటివ్‌ వచ్చింది. నా సమస్యకు హోమియోలో చికిత్స ఉందా? – కె. అరుణ్‌కుమార్, విశాఖపట్నం 
మీరు చెబుతున్న అంశాలను బట్టి చూస్తే మీరు యాంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌తో బాదపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది దీర్ఘకాలికంగా బాధించే సమస్య. ఇది ఒక ఆటోఇమ్యూన్‌ డిజార్డర్‌. అంటే తమ వ్యాధి నిరోధక శక్తే తమకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య అన్నమాట. ముఖ్యంగా కీళ్లు, వెన్నెముక భాగాలలో సమస్యను కలిగిస్తుంది. యుక్తవయస్కులు అంటే... సాధారణంగా 18–30 ఏళ్ల వారిలో కీళ్లు, మెడ బిగుసుకొని, నొప్పి ఎక్కువగా ఉంటుంది.  వ్యాధి పురుషుల్లో చాలా సాధారణం. అంతేకాదు... మరీ ఎక్కువ తీవ్రతతో కూడా వస్తుంది. హెచ్‌ఎల్‌ఏ బి27 అనే ప్రోటీన్‌ గల జన్యువు ఉన్నవారిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ.  యాంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌ సమస్య వెన్నుపూసల మధ్య వాపును కలగజేస్తుంది. ఈ వాపు వచ్చిన డిస్క్‌లు వెన్నెముకను పైకి పైకి జరుపుతాయి. ఫలితంగా ఇది పెల్విస్‌ భాగంలోని కీళ్లను ప్రభావితం చేస్తుంది. 

కారణాలు: ∙వాతావరణ/పర్యావరణ సంబంధిత అంశాలు ∙బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌తో  వంశపారం పర్యం/జన్యుపరంగా వచ్చే అవకాశాలు ఉంటాయి.

లక్షణాలు: ∙కంటి సమస్యలు కనిపిస్తాయి. కళ్లు ఎర్రబారతాయి. ∙కీళ్లు, మెడ బిగుసుకుపోతాయి. నొప్పి తీవ్రత ఎక్కువగాఉంటుంది ∙నడుమునొప్పి, శరీరంలో చాలాచోట్ల స్టిఫ్‌నెస్‌ వస్తుంది. ∙శరీరకంగా కదలికలు తగ్గుతాయి.

చికిత్స: యాంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌ను హోమియో మందులతో పూర్తిగా తగ్గించవచ్చు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన బయలాజికల్‌ మందులు వ్యాధి పెరగడాన్ని నిరోధిస్తాయి. హోమియోలో దీనికి కాల్కేరియా ఫాస్, ఫాస్ఫరస్, ఫాస్ఫారిక్‌ యాసిడ్, లైకోపోడియమ్, పల్సటిల్లా, నక్స్‌వామికా, ఆరమ్, సైలీషియా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని హోమియో డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. 
డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా, 
ఎండీ (హోమియో), స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

చర్మంపై  పొలుసుల్లాగా రాలుతున్నాయి... పరిష్కారం చెప్పండి
నా వయసు 36 ఏళ్లు.  ఐదు సంవత్సరాలుగా చర్మంపైన మచ్చలుగా ఏర్పడి పొట్టు రాలిపోతున్నది. ఎంతో మంది డాక్టర్లకు చూపించాను. ప్రయోజనం కనిపించడం లేదు. కీళ్లనొప్పులు కూడా వస్తున్నాయి. హోమియో మందులతో తగ్గుతుందా? – ఎల్‌. విజయ్, కర్నూలు
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ వ్యాధి సోరియాసిస్‌గా తెలుస్తోంది. ఇందులో చర్మంపై మచ్చలు లేదా బొబ్బల్లా ఏర్పడి, అవి పొలుసులుగా ఊడిపోతోంది. సోరియాసిస్‌ సాధారణంగా 15–30 ఏళ్ల మధ్యవయస్కులకి ఎక్కువగా వస్తుంది. కానీ వంశపారంపర్యంగా ఏ వయసువారికైనా రావచ్చు. 

లక్షణాలు: 
∙చేతులు, కాళ్లు, తల, ముఖం, చర్మంపై మచ్చలు లేదా బొబ్బలు వచ్చి చేప పొలుసులుగా చర్మం ఊడిపోతుంది. ∙కేవలం చర్మం మీద మాత్రమే గాక గోళ్లపై మచ్చలు రావడం, కీళ్లనొప్పులు ఉంటాయి. ∙తలపై చుండ్రులాగా పొలుసులతో పాటు జుట్టు కూడా రాలిపోతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు తాము చూడటానికి కూడా బాగాలేకపోవడంతో  మానసిక క్షోభకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. 

ఇటీవలి వ్యాధి ట్రెండ్‌: 
ఆధునిక జీవన శైలి వల్ల ఇటీవల వంశపారంపర్యంగా వ్యాధి లేని వారిలోనూ ఇది కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. చాలా హడావుడి, ఆదుర్దా కలిగిన జీవనశైలి వల్ల ఇది చాలామందిలో కనిపిస్తోంది. కాబట్టి ఒత్తిడిని వీలైనంత దూరంగా ఉంచుతూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. చర్మం మరీ పొడిబారిపోకుండా తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి. 

చికిత్స: ముందుగా రోగి స్వభావం, తత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి పెంచేలా జెనెటిక్‌ కన్‌స్టిట్యూషన్‌ పద్ధతిలో చికిత్స చేయడం ద్వారా సోరియాసిస్‌ సమస్యకు సమూలమైన చికిత్స అందించడం హోమియో  ప్రక్రియలో పూర్తిగా సాధ్యమవుతుంది.
డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, 
పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌

 

మరిన్ని వార్తలు