మెడ నొప్పి... భుజానికి పాకుతోంది!

2 Nov, 2017 23:45 IST|Sakshi

ఆర్థోపెడిక్‌ కౌన్సెలింగ్‌

నా వయసు 28 ఏళ్లు. సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్‌ని. ఎక్కువ సేపు కంప్యూటర్‌ ముందు కూర్చొని పనిచేస్తుంటాను. రెండువారాలుగా నాకు తీవ్రమైన మెడ నొప్పి వస్తోంది. మెడ నుంచి కుడిభుజంలోకి పాకుతోంది. డాక్టర్‌గారిని కలిస్తే వెన్నుపూసల్లోని డిస్క్‌ వాపు వచ్చిందనీ, సర్జరీ అవసరం అని చెప్పారు. నాకు సర్జరీ అంటే భయం. శస్త్రచికిత్సకు బదులుగా ఏదైనాప్రత్యామ్నాయం ఉందా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – సుహాస్, హైదరాబాద్‌
మీలా చాలా సేపు కూర్చొని పనిచేసే వారిలో ఇలాంటి సమస్య రావడం చాలా సాధారణం. అదేపనిగా గంటలకొద్దీ తప్పుడు భంగిమల్లో (ఫాల్టీ పోష్చర్‌లో)  కూర్చొని పనిచేసేవారిలోవెన్నుపూసల్లోని డిస్క్‌లు బలహీనపడతాయి. ఒక్కోసారి వాటిలో వాపు కూడా రావచ్చు. దీని వల్ల కొద్ది నెలల తర్వాత తీవ్రమైన నొప్పి వస్తుంది. అయితే మంచి ఫిజియోథెరపిస్ట్‌ఆధ్వర్యంలో తగిన వ్యాయామాలు చేయడం వల్ల, వెన్నెముకకు అనువైన, తగిన భంగిమలో కూర్చోవడం వల్ల పరిస్థితి మెరుగుపడి కొద్దిరోజుల్లోనే పరిస్థితి మెరుగుపడుతుంది.ఇలాంటివారు తాము కూర్చొనిపనిచేసే సమయంలో ప్రతి రెండు గంటలకు లేదా మూడు గంటలకు ఒకసారి లేచి తమ మెడను కాస్త అటు ఇటు తిప్పుతూ ఉండాలి. మీరు కూడా అటుఇటు తిరుగుతూ ఉండాలి.ఇక సర్జరీ విషయానికి వస్తే ఇలాంటి కేసుల్లో శస్త్రచికిత్స చాలా అరుదుగా అవసరమవుతుంది. నొప్పి భరించలేనంత ఉండి ఆర్నెల్లకు కూడా తగ్గకపోవడంతోపాటు ఏదైనా శరీరభాగంస్పర్శ కోల్పోయినప్పుడు సర్జరీ అవసరం అవుతుంది. ఇలాంటి పరిస్థితి రెండు శాతానికి మించదు. కాబట్టి మీరు అప్పుడే శస్త్రచికిత్స గురించి ఆలోచించకండి. తొలుత మీరుఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించి మీ మెడ నొప్పి తగ్గడానికి అవసరమైన వ్యాయామాలను చేయండి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు ఆర్థోపెడిక్‌ సర్జన్‌ను కలిసి, తగిన ప్రత్యామ్నాయంగురించి ఆలోచించవచ్చు.

మణికట్టు క్లిక్‌మంటోంది!

నా వయసు 30 ఏళ్లు. బైక్‌ డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు, నా కుడి మణికట్టులో కొద్ది నెలలుగా తీవ్రమైన నొప్పి వస్తోంది. దాన్ని కొద్దిగా వంచినప్పుడు క్లిక్‌ మనే శబ్దం వచ్చి నొప్పి వస్తోంది. నొప్పికారణంగా ఏ పనీ చేయలేకపోతున్నాను. నాకు తగిన పరిష్కారం చెప్పండి. – పి. మహేంద్ర, నెల్లూరు
మణికట్టు చాలా సంక్లిష్టమైన నిర్మాణం. మణికట్టులో 15 ఎముకలతో పాటు ఎన్నో లిగమెంట్లు ఉంటాయి.  కొన్ని చిన్న ఎముకలు విరిగినప్పుడు ఆ విషయమే మనకు తెలియదు.ఉదాహరణకు స్కాఫాయిడ్‌ అనే ఎముక మనం మణికట్టును గుండ్రగా తిప్పడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు కొన్ని రకాల ఎముకలు విరిగిన విషయం సాధారణ ఎక్స్‌రేలోతెలియపోవచ్చు కూడా. అయితే కొన్నిసార్లు రెండు, మూడు వారాల తర్వాత చేసే రిపీటెడ్‌ ఎక్స్‌రేలో తెలుస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలు స్కాఫాయిడ్‌ ఎముక విరిగినట్లుసూచిస్తున్నాయి. మీ సమస్య టీనోసైనోవైటిస్‌ లేదా రిపిటేటివ్‌ స్ట్రెయిన్‌ ఇంజ్యురీ కూడా కావచ్చు. మీరు ఒకసారి ‘ఆర్థోపెడిక్‌ సర్జన్‌’ ను కలిసి తగిన ఎక్స్‌–రే పరీక్షలు చేయించుకోండి.సమస్యను బట్టి చికిత్స ఉంటుంది.

అప్పుడెప్పుడో బెణికింది... ఇప్పటికీ నొప్పెడుతోంది

ఆర్నెల్ల క్రితం నా కాలు స్లిప్‌ అయ్యి, నా చీలమండ బెణికింది. అప్పట్లో ప్లాస్టర్‌ వేశారు. కానీ ఇప్పటికీ నాకు ఆ ప్రాంతంలో తరచూ నొప్పి తిరగబెడుతూ ఉంది. చీలమండ వద్ద వాపు,నొప్పి కనిపిస్తున్నాయి. ఇంతకాలం తర్వాత కూడా ఇలా ఎందుకు నొప్పి వస్తోంది. – వాసవి, కోదాడ  
మీ కాలు బెణికినప్పుడు చీలమండ వద్ద ఉన్న లిగమెంట్లు గాయపడి (స్ప్రెయిన్‌ అయి) ఉండవచ్చు. మీరు ప్లాస్టర్‌ కాస్ట్‌ వేయించుకున్నానని చెబుతున్నారు. కాబట్టి ఆ సమయంలో మీలిగమెంట్లు ఉన్న పరిణామం కంటే కాస్త తగ్గి పొట్టిగా మారే అవకాశం ఉంది. పైగా అవి తమ సాగే గుణాన్ని (ఎలాస్టిసిటీని) కోల్పోయి, అవి ఉండాల్సిన స్థానంలో ఉండకపోవచ్చు. ఆతర్వాత కాలు ఏ కొద్దిపాటి మడతపడ్డా పాత గాయాలు మళ్లీ రేగి లిగమెంట్లు మళ్లీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దాంతో నొప్పి, వాపు వస్తాయి. మీరు స్ట్రెచింగ్‌ వ్యాయామాలు చేస్తూ, మీలిగమెంట్లు మళ్లీ మామూలు దశకు వచ్చేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

మెట్లు ఎక్కుతుంటే మరీ నొప్పి..
నా వయసు 29 ఏళ్లు. గత కొద్ది నెలలుగా రెండు మోకాళ్లలో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. ముఖ్యంగా మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ నొప్పి మరీ ఎక్కువగా ఉంటోంది. చాలా మందులు వాడాను. ఇంత చిన్న వయసులోనే ఇలా కీళ్లనొప్పులు రావడం చాలా ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల మున్ముందు శాశ్వతమైన సమస్యకు దారితీస్తుందోమోనని ఆందోళనగా ఉంది. తగిన సలహా ఇవ్వండి.
– మోహన్‌కుమార్, గన్నవరం

మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు మోకాలిచిప్ప ముందు భాగంలో ఉండే పటెల్లా అనే ఎముకపై ఒత్తిడి పడుతున్నట్లుగా అనిపిస్తోంది. చాలామంది యువకుల్లో కనిపించేసాధారణమైన సమస్య ఇది. కొందరిలో కొన్ని నెలల నుంచి కొన్నేళ్ల వరకు ఉంటుంది. ఏవైనా బరువులు ఎత్తినప్పుడు మోకాలి చిప్పపై పడే అదనపు భారం వల్లనే ఈ సమస్యవస్తుంటుంది. లేదా అతిగా మెట్లు ఎక్కుతుండటం, ఎప్పుడూ బాసిపట్లు (స్కాటింగ్‌) వేసుకొని కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇది చాలా తాత్కాలికమైన సమస్య. ఇదిఆర్థరైటిస్‌ వంటి దీర్ఘకాలిక సమస్య కాదు. కాబట్టి అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు ఆర్థోపెడిక్‌ సర్జన్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి.
డాక్టర్‌ కె. సుధీర్‌రెడ్డి, ఆర్థోపెడిక్‌ సర్జన్,
ల్యాండ్‌మార్క్‌ హాస్పిటల్స్, కేపీహెచ్‌బీ, హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు