ట్యూబ్‌లో పిండం పెరిగింది.. అప్పట్నుంచి గర్భం రావడం లేదు

25 Jul, 2018 00:11 IST|Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

నేడు  ఐవీఎఫ్‌ డే

నా వయసు 28 ఏళ్లు. పెళ్లయి రెండేళ్లు అవుతోంది. పెళ్లయిన రెండు నెలలకే నాకు గర్భం వచ్చింది. దురదృష్టవశాత్తు పిండం ట్యూబ్‌లో పెరగడం వల్ల లాపరోస్కోపీ చేసి, దాన్ని తొలగించారు. ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకొని, గత నాలుగు నెలలుగా ప్రయత్నిస్తున్నాం. అయితే ఇప్పటికీ గర్భం రాలేదు. నా వైద్యచరిత్రను బట్టి నాకు స్వాభావికంగానే గర్భం వస్తుందా లేక డాక్టర్‌ను సంప్రదించాలా తెలపండి. 
– స్వప్న, విజయవాడ 

మీకు మున్ముందు స్వాభావికంగానే గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ మీకు కేవలం ఒకే ఫెలోపియన్‌ ట్యూబ్‌ మాత్రమే ఉన్నా... అప్పుడు కూడా గర్భం వచ్చే అవకాశాలు తగ్గడం చాలా స్వల్పం మాత్రమే. అయితే మీ ట్యూబ్స్‌ ఆరోగ్యంగానే ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు ఒకసారి హిస్టెరోసాల్పింగోగ్రామ్‌ (హెచ్‌ఎస్‌జీ) అనే పరీక్ష చేయించుకోండి. ఒకవేళ ట్యూబ్స్‌ నార్మల్‌గానే ఉంటే మరో 6–8 నెలల్లో మీకు నేచురల్‌గానే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.  చాలామందిలో ఇలా ట్యూబ్‌లో వచ్చే ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ అన్నది ఒకసారి మాత్రమే వస్తుంది. అంతేగాని ఒకసారి వచ్చింది కదా అని మాటిమాటికీ అదే వచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ ఉన్నా మీలో మరోసారి అది వచ్చే అవకాశం కేవలం 10 శాతం మాత్రమే. మరోసారి మీకు గర్భం వచ్చినప్పుడు యుటెరస్‌లో అది సరిగా పెరుగుతోందా లేదా అని తెలుసుకునేందుకు మీరు 6–8 వారాలప్పుడు ఒకసారి అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేయించుకోండి.  ఒకవేళ హెచ్‌ఎస్‌జీ పరీక్షలో మీ ట్యూబ్‌ మూసుకుపోయిందని తేలితే, లాపరోస్కోపీ చేయించాల్సి ఉంటుంది. అది చేశాక కూడా ట్యూబ్‌ తెరచుకోకపోతే అప్పుడు మీకు ఐవీఎఫ్‌ ప్రక్రియను సూచిస్తాం. 

ఐదేళ్లలో  మూడు  అబార్షన్లు... ఎందుకిలా అవుతోంది? 
నా వయసు 36 ఏళ్లు. పెళ్లయి ఆరేళ్లు అయింది. గత ఐదేళ్లలో మూడు అబార్షన్లు అయ్యాయి. అన్నీ రెండో నెలలోనే అయ్యాయి. ఇలా ఎందుకు జరుగుతోందో అని ఎంతో ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. 
– లావణ్య, విశాఖపట్నం 

మీకు ఇలా కావడాన్ని రికటెంట్‌ ప్రెగ్నెన్సీ లాస్‌గా చెప్పవచ్చు. ఇలా జరగడానికి అనేక కారణాలుంటాయి. కొన్ని పరీక్షల ద్వారా మీకిలా జరగడానికి గల కారణాలను అన్వేషించాలి. పెరిగే వయసు, క్రోమోజోమల్‌ సమస్యలు, యాంటీఫాస్ఫోలిపిడ్‌ సిండ్రోమ్, వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన సమస్యలు, హార్మోనల్‌ సమస్యలు (థైరాయిడ్‌ సమస్యలు, డయాబెటిస్, పీసీఓఎస్‌) తో పాటు సెప్టేట్‌ యుటెరస్‌ వంటి సమస్యల వంటివి కొన్ని ముఖ్యమైన కారణాలు కావచ్చు.  మీ పరీక్షలను బట్టి మీకు ఎలాంటి చికిత్స ప్రక్రియ అవసరమవుతుందో చూడాలి. ఆ తర్వాత ఆ చికిత్సను అందించాలి. కొన్నిసార్లు వైద్యపరీక్షలు చేశాక కూడా సమస్యకు గల కారణాలు తెలియకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో సమస్యంతా అండం లేదా శుక్రకణాల్లో నాణ్యత లేకపోవడం కావచ్చు. ఇలాంటప్పుడు వారు ఐవీఎఫ్‌ వంటి ప్రక్రియలకు వెళ్లవచ్చు. 

రుతుక్రమం  సక్రమంగా  రావడం లేదు...  ఎందుకు?  ఏం చేయాలి? 
నా వయసు 26 ఏళ్లు. నా ఎత్తు ఐదడుగుల రెండు అంగుళాలు. బరువు 50 కిలోలు. నాకు మొదట్లో రుతుక్రమం సరిగా వచ్చేది కాదు. ఒక్కోసారి 2 – 3 నెలలకు ఒకసారి వచ్చేది. దాంతో కొన్నిసార్లు టాబ్లెట్లు కూడా వాడాల్సి వచ్చేది. నాకు రుతుక్రమం సక్రమంగా వచ్చేందుకూ, ఆ తర్వాత గర్భధారణ కూడా జరిగేందుకు ఎలాంటి చికిత్స తీసుకోవాల్సి ఉంటుందో తెలపండి.
 – స్వాతి, కరీంనగర్‌ 

మీకు రుతుక్రమం సక్రమంగా రాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైనది హార్మోన్లలో అసమతౌల్యత. దాని కారణంగా పీసీఓఎస్, థైరాయిడ్‌ సమస్యల వంటివి రావచ్చు. థైరాయిడ్‌ సమస్య కారణంగా ఇలా జరుగుతుంటే దాన్ని మందులతో తేలిగ్గా నయం చేయవచ్చు. పీసీఓఎస్‌ అయితే గర్భధారణ కోసం ప్లాన్‌ చేసుకున్నప్పుడు హార్మోన్లను ఇస్తూ సమస్యను చక్కదిద్దాల్సి ఉంటుంది. అలాగే అండం పెరగడానికి కూడా మందులు వాడాల్సి ఉంటుంది. మీలాంటి సమస్య ఉన్నవారిలో చాలామంది కొన్ని ప్రాథమిక చికిత్సల తర్వాతే గర్భవతులు అవుతుంటారు. ఇక ఇలా రుతుక్రమం సక్రమంగా రాకపోవడానికి మరో కారణం అండాల సంఖ్య, నాణ్యతల్లో మార్పులు రావడం. సాధారణంగా మహిళల్లో 35 ఏళ్ల తర్వాత అండం నాణ్యత క్రమంగా తగ్గుతూ పోతుంటుంది. అయితే కొందరిలో అది 20 ఏళ్ల వయసప్పటి నుంచే తగ్గుతూ పోతుంటుంది. అందుకే ఇలాంటి వారు గర్భధారణకు ప్లాన్‌ చేసుకుంటే కొన్ని రకాల పరీక్షలు తప్పక అవసరమవుతాయి. 

పరీక్షలన్నీ నార్మల్‌... కానీ శుక్రకణాల్లో కదలికలు తగ్గాయంటున్నారు...
నా వయసు 29 ఏళ్లు. నా భర్త వయసు 35 ఏళ్లు. గత రెండుళ్లుగా మేం సంతానం కోసం ప్రయత్నిస్తున్నాం. అన్ని పరీక్షలూ చేయించుకున్నాం. అన్నీ నార్మల్‌ అని తేలింది. అయితే నా భర్తకు డయాబెటిస్‌ ఉంది. దాంతో ఆయన శుక్రకణాల్లో కదలికలు తగ్గాయని తేలింది. దీనివల్ల నాకు గర్భం వచ్చే అవకాశాలు తగ్గుతాయా? నాకు తగిన సలహా ఇవ్వండి. 
–ఒక సోదరి, నెల్లూరు 

పురుషుల్లో రక్తంలోని చక్కెర అనియంత్రితంగా ఉన్నప్పుడు శుక్రకణాల నాణ్యత కూడా తగ్గుతుంది. దాంతో వాటి కదలికలు కూడా తగ్గడమే గాక, వాటి ఆకృతిలోనూ మార్పులు వస్తాయి. ఇలా డయాబెటిస్‌ ఉన్నవారిలో ఇన్ఫెక్షన్లు వచ్చే రిస్క్‌ కూడా ఎక్కువే. ఇక కలయికకు సంబంధించిన కొన్ని సమస్యలు కూడా ఉండవచ్చు. వీటన్నింటి ప్రభావం గర్భధారణ అవకాశాల మీద పడుతుంది. అందుకే మీరు గర్భధారణ ప్లాన్‌ చేసుకునే ముందుగా మీ భర్త చక్కెర పరీక్షలు చేయించడం అవసరం. దాన్ని బట్టి తదుపరి కార్యాచరణను డాక్టర్లు నిర్ణయిస్తారు. 

- డాక్టర్‌ ప్రీతిరెడ్డి
సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్,
బర్త్‌ రైట్‌ బై రెయిన్‌బ, హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు