‘కాఫ్‌  వేరియెంట్‌  ఆస్తమా’ అంటే..?

4 Oct, 2018 00:27 IST|Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

పల్మునాలజీ కౌన్సెలింగ్‌

మా అబ్బాయి వయసు 17 ఏళ్లు. అతడు ఎప్పుడూ పొడి దగ్గుతో బాధపడుతున్నాడు. శ్వాస అందడం లేదు. అప్పుడప్పుడూ కొద్దిగా జ్వరం కూడా వస్తోంది. మా డాక్టర్‌ను సంప్రదిస్తే వాడిది ‘కాఫ్‌ వేరియెంట్‌ ఆస్తమా’ అని చెప్పారు. అంటే ఏమిటి? – ఆర్‌. సురేశ్, ఆదిలాబాద్‌ 
కాఫ్‌ వేరియెంట్‌ ఆస్తమా అనేది ఆస్తమాలోనే ఒకరకం. దీనిలో బాధితుడికి ఎప్పుడూ పొడిదగ్గు వస్తూ ఉంటుంది. అంటే తెమడ పడదన్నమాట. వీళ్లకు పిల్లికూతలు లాంటి సంప్రదాయ ఆస్తమా లక్షణాలు కనపడవు. దీన్నే కొన్నిసార్లు ‘క్రానిక్‌ కాఫ్‌’ (దీర్ఘకాలం వచ్చే దగ్గు) అని కూడా అంటారు. అంటే ఇది ఆరు నుంచి ఎనిమిది వారాల పైగానే కొనసాగుతుంది. రాత్రీ పగలూ అనే తేడా లేకుండా దగ్గు వస్తూనే ఉంటుంది. రాత్రివేళ ఎడతెరపి లేని దగ్గు వల్ల నిద్రపట్టదు. ఇలాంటి రోగుల్లో వాళ్లకు సరిపడని దానికి ఎక్స్‌పోజ్‌ అయితే అది ఆస్తమాను ప్రేరేపిస్తుంది. ఉదాహరణకు ఘాటైన వాసనలు, దుమ్ము, చల్లగాలి వంటివి. ఈ కాఫ్‌ వేరియెంట్‌ ఆస్తమా ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇది ఎక్కువ. ఇది ఆ తర్వాత సాధారణ ఆస్తమాకు దారితీస్తుంది. అంటే శ్వాస అందకపోవడం, పిల్లికూతలు తర్వాతి దశలో వస్తాయన్నమాట. సాధారణ ఆస్తమా లాగే కాఫ్‌ వేరియెంట్‌ ఆస్తమాకు కూడా కారణాలు అంతగా తెలియవు. కాకపోతే సరిపడని వస్తువులు, చల్లగాలి దీనికి కారణాలుగా భావిస్తుంటారు. కొందరిలో అధిక రక్తపోటు, గుండెజబ్బులు, హార్ట్‌ఫెయిల్యూర్, మైగ్రేన్, గుండెదడ (పాల్పిటేషన్స్‌) వంటి జబ్బులకు వాడే మందులైన బీటా–బ్లాకర్స్‌ తీసుకున్న తర్వాత ‘కాఫ్‌ వేరియెంట్‌ ఆస్తమా’ మొదలైన దాఖలాలు కొన్ని ఉన్నాయి. అలాగే గ్లకోమా వంటి కంటిజబ్బులకు వాడే చుక్కల మందులోనూ బీటా బ్లాకర్స్‌ ఉండి, అవి ఆస్తమాను ప్రేరేపిస్తాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరిలో ఆస్పిరిన్‌ సరిపడకపోవడం వల్ల కూడా దగ్గుతో కూడిన ఆస్తమా రావచ్చు. కాఫ్‌ వేరియెంట్‌ ఆస్తమాలో కేవలం దగ్గు తప్ప ఇతర లక్షణాలేమీ కనిపించకపోవడం వల్ల దీని నిర్ధారణ ఒకింత కష్టమే. ఎందుకంటే కాఫ్‌ వేరియెంట్‌ ఆస్తమా విషయంలో సాధారణ పరీక్షలైన ఛాతీఎక్స్‌రే, స్పైరోమెట్రీ వంటి పరీక్షలూ నార్మల్‌గానే ఉంటాయి.  కాబట్టి మీరు వెంటనే మీకు దగ్గర్లో ఉన్న ఛాతీ నిపుణుడిని కలవండి. ఆ డాక్టర్‌ మీ కుమారుడిని అనేక ప్రశ్నలు అడిగి తెలుసుకొని, మీ కుటుంబ వ్యాధుల చరిత్రను అధ్యయనం చేసి, శ్వాసించే తీరును విని వ్యాధి నిర్ధారణా, తగిన చికిత్సా చేస్తారు. 

పీరియడ్స్‌  సమయంలో శ్వాస అందడం లేదు..?
నా వయసు 35 ఏళ్లు. గృహిణిని. నాకు పీరియడ్స్‌ సమయంలో సరిగా శ్వాస అందడం లేదు. ఆ సమయంలో దగ్గు, పిల్లికూతలు కూడా వస్తుంటాయి. దీనికి కారణాలు ఏమిటి? పరిష్కారం చెప్పండి. 
– ఎల్‌. దీపిక, కాకినాడ  

రుతుక్రమం వచ్చే సమయం మహిళల్లో  ఒక కీలకమైన దశ. ఆ సమయంలో మహిళల భౌతిక, మానసిక, ప్రవర్తనల్లో ఎన్నో మార్పులు కనిపించవచ్చు. దాంతో కొన్నిసార్లు  అటు శారీరక, ఇటు మానసిక సమస్యలు కనిపించవచ్చు. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు ఉన్న సమస్యను కెటామెనియల్‌ ఆస్తమాగా చెప్పవచ్చు. కెటామెనియల్‌ ఆస్తమాను రుతుక్రమం ముందు వచ్చే ఆస్తమా (ప్రీమెనుస్ట్రువల్‌ ఆస్తమా)గా పరిగణించవచ్చు. ఈ సమయంలో మహిళల్లో ఆస్తమా లక్షణాలు తీవ్రమవుతాయి. రుతుక్రమానికి ముందుగా చాలామంది మహిళల్లో ఆస్తమా ఎక్కువ కావడం, ఆసుపత్రిలో చేరాల్సిరావడం వంటి సందర్భాలూ ఉన్నాయి. పీరియడ్స్‌కు ముందు శ్వాస అస్సలు అందకపోవడం వల్ల ఈ పరిణామాలు సంభవిస్తాయి. దీనికి నిర్దిష్టమైన కారణాలు తెలియకపోయినా సాధారణంగా ప్రోజెస్టెరాన్‌ లేదా ప్రోస్టాగ్లాండిన్స్‌ వంటి హార్మోన్లలోని మార్పులు ఇందుకు దారితీస్తాయని కొంతవరకు ఊహించవచ్చు. 

ఇక అండం రూపుదిద్దుకునే దశలో ప్రోజెస్టెరాన్‌ పాళ్లు క్రమంగా పెరుగుతాయి. ఆ తర్వాత పీరియడ్స్‌కు ముందు ఇవే పాళ్లు గణనీయంగా పడిపోతాయి. మహిళల్లో కండరాలు రిలాక్స్‌ కావడానికి తోడ్పడే స్రావాలు సైతం ఊపిరితిత్తుల్లోని గాలి ప్రయాణించే పైప్‌లనూ ప్రభావితం చేస్తాయి. ప్రోజెస్టెరాన్‌ పెరగడం వల్ల కలిగే మార్పులు శ్వాస అందనివ్వకుండా చేసి, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అలాగే  రుతుక్రమానికి ముందుగా వ్యాధినిరోధకత విషయంలో వచ్చే మార్పులు కూడా ఆస్తమాను ప్రేరేపించవచ్చు. అందుకే... రుతుక్రమం సమయంలో ఆస్తమా కనిపిస్తే దానికి నిర్దిష్టమైన కారణమేమిటన్నది నిశితంగా నిర్ధారణ చేయడం చాలా అవసరం. ఇక మీకు ఏ అంశం ఆస్తమాను ప్రేరేపిస్తుందో నిశితంగా తెలుసుకొని, దానికి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఒకసారి మీకు దగ్గర్లోని పల్మునాలజిస్ట్‌ను కలవండి. 

ఆక్సిజన్‌  థెరపీ  అంటే  ఏమిటి? 
నా వయసు 49 ఏళ్లు. నేను కొద్దికాలంగా సీవోపీడీ (క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మునరీ డిసీజ్‌)తో బాధపడుతున్నాను. దీనికి ఆక్సిజన్‌ థెరపీతో మంచి ఉపశమనం ఉంటుందని విన్నాను. – ఎన్‌. శంకర్‌రావు, గుంటూరు 
మీరు చెప్పినట్లు క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మునరీ డిసీజ్‌ (సీవోపీడీ)తో బాధపడుతూ ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గినవారికి ఆక్సిజన్‌ థెరపీతో మంచి ప్రయోజనం ఉంటుంది. మీ శ్వాస తీసుకోవడంలో అవరోధాలు ఉన్నాయి కాబట్టి, మీరు హాయిగా ఫీలయ్యేందుకు, మీ రోజువారీ వ్యవహారాలకు అవసరమైనంతగా మీ శరీరానికి ఆక్సిజన్‌ అవసరం. మీరు పీల్చుకోగలిగే ఆక్సిజన్‌ తక్కువ కాబట్టి ఈ అదనపు ఆక్సిజన్‌ వల్ల మీ ఊపిరితిత్తుల కార్యకలాపాలు మెరుగుపడతాయి. దాంతో మీరు పనిచేసే సామర్థ్యం, చురుగ్గా వ్యవహరించగల శక్తి మీకు చేకూరతాయి. 
ఆక్సిజన్‌ థెరపీ వల్ల మీ నిద్ర నాణ్యత కూడా గణనీయంగా మెరుగుపడటంతో పాటు మీ మానసిక సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇలా దీర్ఘకాలం పాటు ఆక్సిజన్‌ చికిత్స చేయడం మరో విధంగా కూడా ఉపయోగపడుతుందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. అంటే ఆక్సిజన్‌ చికిత్స సీవోపీడీ కండిషన్‌ను మెరుగుపరచడంతో పాటు హార్ట్‌ఫెయిల్యూర్‌ను నివారిస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. 
ఆక్సిజన్‌ థెరపీ తీసుకోవడం మూడు రకాలుగా జరుగుతుంది. అవి...
 
1) కంప్రెస్‌డ్‌ ఆక్సిజన్‌ను తీసుకోవడం లేదా ద్రవరూపంలో ఉన్న ఆక్సిజన్‌ను కొనుగోలు చేసి ఈ చికిత్సను ఇంటివద్దనే తీసుకోవచ్చు. ఈ ఆక్సిజన్‌ను స్టీల్‌ లేదా అల్యూమినియమ్‌ ట్యాంకుల్లో భద్రపరుస్తారు. సైజ్‌లో పెద్దవిగా ఉండేవాటిని ఇంటిదగ్గర వాడుకోవచ్చు. 
2) మీతో పట్టుకెళ్లగలిగేవి కూడా లభిస్తాయి. వాటిని మీరు బయటకు వెళ్లినప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాడవచ్చు. ద్రవరూపంలో ఉన్న ఆక్సిజన్‌ను నిల్వ చేయడానికి చిన్న కంటెయినర్లు సరిపోతాయి. పైగా ఒకచోట నుంచి మరోచోటికి తేలిగ్గా తరలించవచ్చు. అయితే వీటిని చాలాకాలం పాటు నిల్వ చేసి ఉంచకూడదు. ఎందుకంటే అందులోని ఆక్సిజన్‌ ఆవిరైపోతుంది. 
3) ఆక్సిజన్‌ థెరపీ తీసుకునేవారిలో చాలామంది ఒక ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ అనే మెషిన్‌ను వాడతారు. ఇది వాతావరణంలో ఉన్న ఆక్సిజన్‌నే సంగ్రహించి మీకు అందిస్తుంది. ఇది చవకైనదీ, పైగా దీన్ని మళ్లీ భర్తీ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఉపయోగించడమూ తేలికే. అయితే ఆ ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు ఒకింత పెద్ద సైజులో ఉంటాయి. పైగా ఎక్కువ శబ్దం చేస్తుంటాయి. పైగా ఇది నడవాలంటే దీనికి  విద్యుత్‌ సరఫరా కూడా అవసరం. దాంతో విద్యుత్‌ బిల్లు భారమూ అదనం. దీని నుంచి వేడి కూడా వెలువడుతుంది కాబట్టి వేసవిలో దీన్ని ఉపయోగించడం ఇబ్బందికరం. ఒకవేళ కరెంటుపోతే మెషిన్‌ ఆగిపోకుండా ప్రత్యామ్నాయం అవసరం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, మీ డాక్టర్‌ను సంప్రదించి మీకు అన్నివిధాలా సరిపోయే ప్రత్నామ్నాయాన్ని ఎంచుకోండి. 
డాక్టర్‌ రమణ ప్రసాద్‌
కన్సల్టెంట్‌ స్లీప్‌ స్పెషలిస్ట్‌ అండ్‌ 
పల్మునాలజిస్ట్‌ కిమ్స్, సికింద్రాబాద్‌  

మరిన్ని వార్తలు