‘గ్యాస్ట్రైటిస్‌’  తగ్గుతుందా?

13 Dec, 2018 00:54 IST|Sakshi

హోమియో కౌన్సెలింగ్స్‌

నా వయసు 43 ఏళ్లు. కొంతకాలంగా నాకు కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్‌ అన్నారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది? హోమియోలో పరిష్కారం ఉందా?  – ఆర్‌. విశ్వప్రసాద్, గుంటూరు 
జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్‌ పొర ఇన్‌ఫ్లమేషన్‌ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్‌ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్‌ గ్యాస్ట్రైటిస్‌ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్‌ గ్యాస్ట్రైటిస్‌ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్‌ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్‌ లేదా పుండ్లుగా ఏర్పడతాయి. 

కారణాలు : – 20 నుంచి 50 శాతం అక్యూట్‌ గ్యాస్ట్రైటిస్‌ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్‌ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది. ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ∙కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్‌ కిల్లర్స్‌ వాడటం ∙పైత్య రసం వెనక్కి ప్రవహించడం ∙క్రౌన్స్‌ డిసీజ్, కొన్ని ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు ∙శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ∙ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్‌ సమస్య కనిపిస్తుంది. 

లక్షణాలు : కడుపు నొప్పి, మంట ∙కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం   ∙అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు                 ∙ఆకలి తగ్గిపోవడం ∙కొందరిలో గ్యాస్ట్రిక్‌ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు : ∙సమయానికి ఆహారం తీసుకోవాలి ∙కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి ∙పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి                   ∙ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి  తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. 

చికిత్స : హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్‌ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. 

డా‘‘ శ్రీకాంత్‌ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్‌  ఇంటర్నేషనల్,  హైదరాబాద్‌

దీర్ఘకాలిక చెవి వాపు తగ్గుతుంది! 
మా పాపకు ఏడేళ్లు. మూడేళ్లుగా ఆమె చెవినొప్పితో బాధపడుతోంది. చెవిలో చీము కూడా కనపడుతోంది.  కొంతకాలంగా ప్రతిరోజూ చెవిపోటు వస్తోంది. ఇంతకుముందు ఒక చెవిలోనే చీము కనిపించేది. ఇప్పుడు రెండు చెవుల్లోనూ చీము వస్తోంది. ఈఎన్‌టీ నిపుణులను సంప్రదిస్తే ఆపరేషన్‌ అవసరమంటున్నారు. దీనికి హోమియోలో చికిత్స సూచించండి.  – చంద్రశేఖర్, సిద్దిపేట 
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాప దీర్ఘకాలిక చెవి వాపు (క్రానిక్‌ ఒటైటిస్‌ మీడియా)తో బాధపడుతోందని తెలుస్తోంది. చెవిని మనం మూడు భాగాలుగా చెప్పవచ్చు. బాహ్య చెవి, మధ్య చెవి, లోపలి చెవి. మీరు వివరించే సమస్య మధ్య చెవిలో వస్తుంది. ఇది చిన్నపిల్లలకు, మధ్యవయసువారికి, వృద్ధులకు సైతం వచ్చే అవకాశం ఉంది. అంటే ఏ వయసు వారిలోనైనా ఇది రావచ్చు. అయితే ఎక్కువగా చిన్న పిల్లలు దీని బారినపడతారు. 

కారణాలు : ∙కర్ణభేరి (ఇయర్‌ డ్రమ్‌)కు రంధ్రం ఏర్పడటం ∙మధ్య చెవి ఎముకల్లో మచ్చలు ఏర్పడటం ∙చెవి నుంచి దీర్ఘకాలం పాటు చీము రావడం ∙ముఖానికి సంబంధించిన నరాలు, సంతులనం కాల్వలు, కాక్లియా, మధ్య చెవిలో తరుగు రావడం వల్ల ∙ఎడినాయిడ్స్, టాన్సిల్స్, సూక్ష్మజీవులు, ఇన్ఫెక్షన్స్‌ వల్ల ఈ సమస్య రావచ్చు. 

లక్షణాలు : ∙తీవ్రమైన జ్వరం ∙వినికిడి లోపం  ∙శరీరం సంతులనం కోల్పోవడం ∙చెవి నుంచి చీము కారడం ∙ముఖం బలహీన పడటం ∙తీవ్రమైన చెవి/తలనొప్పి ∙చెవి వెనకాల వాపు రావడం. 
నిర్ధారణ : ఆడియోమెట్రీ, సీటీ స్కాన్, ఎమ్మారై స్కాన్, ఎక్స్‌–రే 
చికిత్స : దీర్ఘకాలిక చెవి వాపు సమస్య పరిష్కారానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి లక్షణాలను విశ్లేషించి వైద్యులు తగిన మందులు సూచిస్తారు. ఈ సమస్యకు హోమియోలో ఎపిస్, బెల్లడోనా, కాస్టికమ్, ఫెర్రమ్‌ఫాస్, హెపార్‌సల్ఫ్, మెర్క్‌సాల్, నేట్రమ్‌ మ్యూర్, పల్సటిల్లా, సైలీషియా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో వాడాలి.
డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా, 
ఎండీ (హోమియో),  స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

యానల్‌ ఫిషర్‌కు చికిత్స ఉందా?
నా వయసు 68 ఏళ్లు. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్‌  ఫిషర్‌ అని చెప్పి ఆపరేషన్‌ చేయాలన్నారు. నాకు ఆపరేషన్‌ అంటే భయం. హోమియోలో ఆపరేషన్‌ లేకుండా దీనికి చికిత్స ఉందా?  – ఆర్‌. ప్రసాదరావు, సామర్లకోట 
మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్‌ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్ధకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్‌ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్ధకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్‌ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్‌ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. 
కారణాలు : ∙దీర్ఘకాలిక మలబద్ధకం ∙ఎక్కువకాలం విరేచనాలు ∙వంశపారంపర్యం ∙అతిగా మద్యం తీసుకోవడం ∙ఫాస్ట్‌ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ∙మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్‌ సమస్య వస్తుంది.
లక్షణాలు : తీవ్రమైన నొప్పి, మంట ∙చురుకుగా ఉండలేరు ∙చిరాకు, కోపం ∙విరేచనంలో రక్తం పడుతుంటుంది ∙కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు  నొప్పి, మంట. 
చికిత్స : ఫిషర్‌ సమస్యను నయం చేయడానికి హోమిమోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్‌ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. 
డాక్టర్‌ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌ 

>
మరిన్ని వార్తలు