బాబుది  ఏడీహెచ్‌డీ కావచ్చు..?

19 Dec, 2018 00:24 IST|Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్స్‌

మా బాబుకు ఏడేళ్లు. ఇతర పిల్లలో కలవడం చాలా తక్కువ. మేం ఏమి చెప్పినా వినిపించుకోడు. మాటలు కూడా కొంత ఆలస్యంగానే వచ్చాయి. కొన్నిసార్లు బాగానే ఆడుకుంటాడు గానీ ఒక్కోసారి దేనిమీదా దృష్టికేంద్రీకరించి కుదురుగా ఉండడు.  పదే పదే కనురెప్పలు కొడుతుంటాడు. చూసినవాళ్లు... ‘ఇది చిన్నవయసు కదా. ఎదిగేకొద్దీ సర్దుకుంటాడు’ అని అంటున్నారు. అతడి సమస్య ఏమిటి? సరైన సలహా ఇవ్వగలరు.  – ఆర్‌. మహేశ్వరి, నిజామాబాద్‌ 
మీరు చెప్పిన లక్షణాలను బట్టి సమస్య ఇదే అని కచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ మీ లేఖలోని అంశాలను విశ్లేషిస్తే ఇది అటెన్షన్‌ డెఫిసిట్‌ డిజార్డర్‌ అని చెప్పవచ్చు.  అటెన్షన్‌ డెఫిసిట్‌ అంటే ఏ విషయంపైనా చాలాసేపు దృష్టి కేంద్రీకరించలేకపోవడం అని చెప్పవచ్చు. అటెన్షన్‌ డెఫిసిట్‌ డిజార్డర్‌తో పాటు హైపర్‌ యాక్టివిటీ, ఇంపల్సివ్‌ బిహేవియర్‌ ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. అటెన్షన్‌ డెఫిసిట్‌తో పాటుగా కొన్నిసార్లు కొద్దిమందిలో హైపర్‌ యాక్టివ్‌ లక్షణాలు ఉన్నప్పుడు దాన్ని ‘అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌యాక్టివ్‌ డిజార్డర్‌ (ఏడీహెచ్‌డీ)’ అంటారు.  అటెన్షన్‌ డెఫిసిట్‌ ఉన్న పిల్లల్లో అకడమిక్‌గా వెనకబడటం, స్నేహితులతో పెద్దగా కలివిడిగా ఉండలేకపోవడం, నిర్లక్ష్యంగా తప్పులు చేస్తూ ఉండటం, ఒక అంశంపైనా లేదా ఒక ఆటపైనా చాలాసేపు ఏకాగ్రత చూపలేకపోవడం, చెప్పినమాట వినకపోవడం, స్కూల్లో ఇచ్చిన హోమ్‌వర్క్‌ వంటి టాస్క్‌లు గడువులోపల పూర్తి చేయకపోవడం, నిర్వహణశక్తిలోపం, పదే పదే వస్తువులను పోగొట్టుకోవడం, ఏదైనా అంశం నుంచి త్వరగా దారిమళ్లడం, ఎప్పుడూ విషయాలను మరచిపోవడం వంటివన్నీ నిత్యం చేస్తుండటం అన్నవి అటెన్షన్‌ డెఫిసిట్‌ డిజార్డర్‌ లక్షణాలు. అలాగే హైపర్‌ యాక్టివిటీకి సంబంధించి... బాగా స్థిమితంగా ఉండలేకపోవడం, ఒకేచోట కుదురుగా కొంతసేపు కూడా కూర్చులేకపోవడం, ఎప్పుడూ గెంతుతూ, ఏదో ఎక్కుతూ ఉండటం, నెమ్మదిగా ఆడుకోలేకపోవడం, ప్రశ్నపూర్తిగా అడగకముందే జవాబిచ్చేలా స్పందించడం వంటివి అన్నీ హైపర్‌ యాక్టివ్‌ లక్షణాలుగా చెప్పవచ్చు. ఈ ‘ఏడీహెచ్‌డీ’ సమస్య ఉన్నవారిలో నేర్చుకునే సామర్థ్యం తగ్గడం, యాంగై్జటీ, డిప్రెషన్, కనురెప్పలు అదేపనిగా కొట్టుకోవడం (టిక్‌ డిజార్డర్‌), మలమూత్రాల మీద నియంత్రణ లేకపోవడం, నిద్రసంబంధ సమస్యలు వంటివి ఉండవచ్చు. 

ఇలాంటి పిల్లల్లో సమస్యను సరిగ్గా నిర్ధారణ చేయడం వల్లనే చికిత్స సరిగా జరిగినట్లవుతుంది. ఈ పిల్లలకు పూర్తిస్థాయి చికిత్స రెండు రకాలుగా జరగాలి. ఒకటి... ప్రవర్తనాపరమైన చికిత్స (బిహేవియరల్‌ థెరపీ), రెండోది మందులతో చేసే చికిత్స. సమాజం ఆమోదించేలాంటి ప్రవర్తనను తీసుకురావడమే థెరపీ లక్ష్యం. బిహేవియరల్‌ థెరపీలో చాలా చిన్న చిన్న జాగ్రత్తలు, అంశాలదే కీలక భూమిక. సమస్యపై కుటుంబానికి అవగాహన కల్పించడం, కుటుంబ సభ్యుల చేయూత, క్రమబద్ధమైన జీవితం, నిర్ణీత వేళకు నిద్రలేవడం, పడుకోవడం, వేళకు తినడం వంటి మార్పులతో పాటు స్కూల్లోనూ కొద్దిపాటి మార్పులు, పిల్లలపై టైమ్, పరీక్షల ఒత్తిడి లేకుండా చూడటం వంటి వాటితో సత్ఫలితాలు కనిపిస్తాయి. దాంతోపాటు స్టిమ్యులెంట్‌ మెడిసిన్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. బిహేవియర్‌ థెరపీపై అవగాహన కోసం ఇలాంటి పిల్లల పేరెంట్స్‌ అందరూ గ్రూప్‌గా ఏర్పడి నిర్వహించుకునే తరగతులతో ప్రయోజనం ఉంటుంది. ఇక మీ బాబు విషయానికి వస్తే అతడికి అటెన్షన్‌ డెఫిసిట్‌ డిజార్డర్‌తో పాటు టిక్స్‌ డిజార్డర్‌ ఉన్నట్లుగా అనిపిస్తోంది. కాబట్టి మీరు పీడియాట్రిక్‌ సైకియాట్రిస్ట్‌ను కలిసి చికిత్స తీసుకోండి. ఇక ఇది కొద్దిపాటి  దీర్ఘకాలిక సమస్య కాబట్టి తల్లిదండ్రులూ ఓపిగ్గా ఉండాలి. ఈ మానసిక రుగ్మత విషయంలో మంచి సంగతి ఏమిటంటే... ఈ సమస్య ఉన్న పిల్లల శక్తియుక్తులను సరిగ్గా గాడిలో పెట్టగలిగితే వాళ్లు గొప్ప విజయాలు సాధించడానికి అవకాశాలున్నాయి. 

బాబు  అదేపనిగా  ఏడుస్తున్నాడు
మా బాబు వయసు రెండు నెలలు మాత్రమే. వాడెప్పుడూ ఏడుస్తూనే ఉంటున్నాడు. . డాక్టర్‌కు చూపించినా ఏమీ లాభం లేదు. అసలు వాడి సమస్య ఏమిటో తెలుసుకోవడం ఎలా? మాకు తగిన సలహా చెప్పండి. – ఎల్‌. పవన్‌కుమార్, ఒంగోలు 
ఇంత చిన్న పిల్లలు తమ బాధలనైనా కేవలం ఏడుపు ద్వారానే వ్యక్తపరుస్తుంటారు. వాళ్లు కమ్యూనికేట్‌ చేసే ఒక విధనం ఏడుపు మాత్రమే. అందుకే పిల్లలు ఏడుస్తున్నప్పుడు వాళ్లకు ఏదైనా సమస్య ఉందేమోనని తల్లిదండ్రులు అనుమానించాలి. పిల్లలు ఎప్పుడెప్పుడు, ఎందుకు ఏడుస్తారో, అప్పుడు ఏం చేయాలో తెలుసుకోవాలి.   పిల్లల్లో ఏడుపుకు కొన్ని ముఖ్య కారణాలు: ∙ఆకలి వేసినప్పుడు ∙భయపడినప్పుడు ∙దాహం వేసినప్పుడు ∙బోర్‌ ఫీల్‌ అయినప్పుడు ∙పక్క తడిగా అయినప్పుడు ∙వాతావరణం మరీ చల్లగా లేదా వేడిగా ఉన్నప్పుడు ∙పెద్ద పెద్ద శబ్దాలు వినిపించినప్పుడు ∙కాంతి ఎక్కువైనా, పొగలు కమ్ముకున్నా ∙నొప్పులు ఉన్నప్పుడు ∙పళ్ళు వస్తున్నప్పుడు  ఇన్‌ఫెక్షన్‌లు ముఖ్యంగా  యూరినరీ ఇన్‌ఫెక్షను వచ్చినప్పుడు ∙కడుపు నొప్పి (ఇన్‌ఫ్యాంటైల్‌ కోలిక్‌) ∙జ్వరం ∙జలుబు ∙చెవినొప్పి ∙మెదడువాపు జ్వరం ∙గుండె సమస్యలు ∙కొన్ని జన్యుపరమైన సమస్యలు వంటి తీవ్రమైన వాటిని కూడా పిల్లలు ఏడుపు ద్వారానే తెలియపరుస్తారు. కొన్ని సందర్భాల్లో ఫిట్స్‌ సమస్యను కూడా ఏడుపు రూపంలోనే వ్యక్తపరుస్తుండవచ్చు.  1–6 నెలల వయసులో ఉన్న పిల్లలు ఎక్కువగా ఏడవటానికి ముఖ్యంగా కడుపుకు సంబంధించిన రుగ్మతలు, చెవి నొప్పి, జలుబు వంటివి ప్రధాన కారణాలు.

ఇన్‌ఫ్యాన్‌టైల్‌ కోలిక్‌... 
చిన్న పిల్లల్లో ఏడుపుకు సాధారణ కారణం కడుపునొప్పి. దీన్నే ఇన్‌ఫ్యాన్‌టైల్‌ కోలిక్‌ అంటారు.  సాధారణంగా మూడు నెలలలోపు పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఆ టైమ్‌లో పిల్లలు కొద్ది సేపు మొదలుకొని చాలా ఎక్కువసేపు ఏడుస్తుంటారు. 
∙ఆకలి, గాలి ఎక్కువగా మింగడం వల్ల, ఓవర్‌ ఫీడింగ్, పాలలో చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండటం ఇన్‌ఫ్యాన్‌టైల్‌ కోలిక్‌కు కొన్ని కారణాలని చెప్పుకోవచ్చు. 
ఇటువంటి పిల్లలను ఎత్తుకోవడం (అప్‌ రైట్‌ పొజీషన్‌), లేదా వాళ్ల పొట్టమీద పడుకోబెట్టడం, ప్రాపర్‌ ఫీడింగ్‌ టెక్నిక్‌ (ఎఫెక్టివ్‌ బర్పింగ్‌)తో ఏడుపు మాన్పవచ్చు. కొందరికి యాంటీస్పాస్మోడిక్స్‌తో పాటు మైల్డ్‌ సెడేషన్‌ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అయితే యాంటీస్పాస్మోడిక్, మైల్డ్‌ సెడేషన్‌ అనే రెండు మందులు ఏడుపు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. చిన్న పిల్లలు మరీ ఎక్కువగా ఏడుస్తుంటే అంటే పదే పదే ఏడవటం, ఆపకుండా ఏడవటం చేస్తుంటే తక్షణం పిల్లల డాక్టర్‌కు చూపించాలి. మీరు కూడా ఒకసారి మీ బాబును పీడియాట్రీషియన్‌కు చూపించండి. వారు తగిన కారణాన్ని కనుగొని, దానికి తగినట్లుగా చికిత్స అందిస్తారు. 
డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్‌ పీడియాట్రీషియన్,
రోహన్‌ హాస్పిటల్స్, విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు