నిద్రలేమి వేధిస్తోంది...పరిష్కారం  చెప్పండి 

25 Oct, 2018 00:35 IST|Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

హోమియో కౌన్సెలింగ్స్‌

నా వయసు 34 ఏళ్లు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను.  నేను షిఫ్ట్‌లలో పనిచేస్తుంటాను. ఈ మధ్యే డే–షిఫ్ట్‌ కు మారాను. నాకు రాత్రివేళ సరిగా నిద్రపట్టడం లేదు.  హోమియోలో నా సమస్యకు పరిష్కారం ఉందా? ఉంటే దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – డి. వెంకటరమణ, హైదరాబాద్‌ 
మనిషికి గాలి, నీరు, తిండిలాగే నిద్ర కూడా చాలా అవసరం. నిద్ర కరువైతే కళ్లలో కళాకాంతులు తగ్గుతాయి. ఉత్సాహం తగ్గుతుంది. అలసట, ఆందోళన మాత్రమే గాక అనేక ఆరోగ్య సమస్యలకు నిద్రలేమి కారణమవుతుంది. శారీరక, మానసిక సమస్యలు తప్పవు. నిద్రలోకి జారుకోలేకపోవడం, ఒకవేళ నిద్రపట్టినా తెల్లవారుజామున నిద్రలేవడం, రాత్రుళ్లు మళ్లీ మళ్లీ మెలకువరావడం, ప్రశాంతమైన నిద్రలేకపోవడం నిద్రలేమి సమస్యకు సంబంధించిన ఒకటి రెండు లక్షణాలు. అయితే ఇవి అన్నీ గాని... కొన్ని గాని ఉండటాన్ని వైద్య పరిభాషలో ఇన్‌సామ్నియా (నిద్రలేమి)గా చెప్పవచ్చు. 
నిద్రలేమి శారీరక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆలోచన గమనాన్ని నియంత్రిస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. 

కారణాలు : ∙మానసిక ఒత్తిడి, ఆందోళన ∙శారీరకంగా వచ్చే మార్పులు ∙చికాకులు ∙చీటికీమాటికీ కోపం తెచ్చుకోవడం ∙దీర్ఘకాలిక వ్యాధులు ∙వంశపారంపర్యం ∙అంతులేని ఆలోచనలు
లక్షణాలు : ∙నిద్రలోకి జారుకునేందుకు కష్టపడిపోవడం ∙నిద్రపట్టినా మధ్య మధ్య మెలకువ వస్తూ ఉండటం, నాణ్యమైన నిద్ర లోపించడం  ∙తెల్లవారుజామున మెలకువ వచ్చాక మళ్లీ నిద్రపట్టకపోవడం ∙నిద్రలేచిన తర్వాత విశ్రాంతిగా అనిపించకపోవడం 
నిర్ధారణ పరీక్షలు : రక్తపరీక్షలు, పాలీసామ్నోగ్రామ్‌ (పీఎస్‌జీ)  
చికిత్స : హోమియోలో నిద్రలేమి సమస్యకు మంచి చికిత్స అందుబాటులో ఉంది. నక్స్‌వామికా, ఓపియమ్, బెల్లడోనా, ఆర్సినిక్‌ ఆల్బమ్‌ వంటి మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. పాసీఫ్లోరా 20 – 25 చుక్కలు అరకప్పు నీళ్లలో కలుపుకుని తాగితే గాఢంగా నిద్రపడుతుంది. 
డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా, 
ఎండీ (హోమియో), స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌
 

నా వయసు 38 ఏళ్లు. కొన్నాళ్లుగా కాలి బొటనవేలు వాచింది. అక్కడ విపరీతమైన సలపరంతో నొప్పి ఉంది. డాక్టర్‌గారు గౌట్‌ అని చెప్పారు.  మందులు వాడినా  సమస్య తగ్గలేదు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం లభిస్తుందా?  – డి. కొండల్‌రావు, సాలూరు 
గౌట్‌ అనేది ఒక రకం కీళ్లవ్యాధి. మన శరీరంలో ‘యూరిక్‌ యాసిడ్‌’ జీవక్రియలు సరిగా లేనందున ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్యూరిన్స్‌ అనే పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా యూరిక్‌ యాసిడ్‌ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి, కదలికలు కష్టంగా మారతాయి. ఈ పరిస్థితిని ‘గౌట్‌’ అంటారు. 
కారణాలు : ∙సాధారణంగా రక్తంలోని యూరిక్‌ యాసిడ్‌ మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. ఒకవేళ శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ ఉత్పత్తి పెరిగినా లేదా దాని విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలోనే నిలిచిపోయి గౌట్‌కు దారితీస్తుంది. ∙ప్యూరిన్స్‌ ఎక్కువగా ఉండే ఆహారం (ఉదా: మాంసం, గుడ్లు, చేపలు) వంటి ఆహారం ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం. ∙అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు. 
లక్షణాలు : ∙తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి. 
∙చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది. 
∙మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. 
∙ఈ సమస్యను నిర్లక్ష్యం చేసి సరైన చికిత్స తీసుకోకపోతే మరింత తీవ్రతరమై కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. 
నివారణ / జాగ్రత్తలు : మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్‌ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్‌ వంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారంలోని లివర్, కిడ్నీ, ఎముక మూలుగా, పేగుల వంటి తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి. 
చికిత్స : హోమియో వైద్యవిధానం ద్వారా అందించే అధునాతనమైన కాన్స్‌టిట్యూషన్‌ చికిత్స ద్వారా గౌట్‌ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది. 
డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లావర్, సీఎండీ, 
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

ఈ  కడుపునొప్పి తగ్గుతుందా? 
నా వయసు 42 ఏళ్లు. భోజనం తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు మలబద్ధకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి. మలంలో జిగురు కూడా కనిపిస్తుంది. కొద్దిగా నొప్పి ఉండి మెలిపెట్టినట్లుగా అనిపిస్తోంది. తేన్పులు, కడుపు ఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన వంటివి ఉన్నాయి. ఈ సమస్యతో ఏ అంశంపైనా దృష్టి పెట్టలేకపోతున్నాను. దయచేసి నా సమస్య ఏమిటో వివరించి, హోమియోలో చికిత్స చెప్పండి. – సూర్యకుమారి, నెల్లూరు 
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి వాస్తవమైన కారణాలు స్పష్టంగా తెలియదు. అయితే ∙జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ∙దీర్ఘకాల జ్వరాలు ∙మానసిక ఆందోళన ∙కుంగుబాటు ∙ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం ∙జన్యుపరమైన కారణలు ∙చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తాయి. సాధారణంగా ఈ వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో మూడువంతులు ఎక్కువ. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్‌ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయెలెట్‌కు పరుగెత్తాల్సి వస్తుంది. ఐబీఎస్‌ క్యాన్సర్‌కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. 
దీని నిర్ధారణకు నిర్దిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే రోగి లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ ఏవైనా ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా దీన్ని చాలా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్‌ బ్రీత్‌ టెస్ట్‌ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. 
వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు : ∙పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ∙ఒత్తిడిని నివారించుకోవాలి ∙పొగతాగడం, మద్యంపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ∙రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. 
హోమియోలో చికిత్స: ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌కు హోమియోలో అత్యంత శక్తిమంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ అంటే ఉదాహరణకు జీర్ణవ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలంగా మందులు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావం వల్ల జీర్ణవ్యవస్థలో వచ్చే మార్పులు, ఒత్తిడి, ఆందోళన వల్ల ఐబీఎస్‌ వస్తే దాన్ని హోమియో ప్రక్రియలో కాన్‌స్టిట్యూషనల్‌ సిమిలియమ్‌ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు.
డాక్టర్‌ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా