కలహాలు పోస్ట్‌పోన్‌ చేయండి

9 Apr, 2020 10:44 IST|Sakshi

కరోనాకు రెండో దశ, మూడో దశఅని దశలు ఉన్నాయి. ప్రస్తుతం సంసారాలు కూడా రెండో దశకు చేరుకుంటున్నాయి. లాక్‌డౌన్‌ సందర్భంగా వచ్చిన విరామం మొదట సరదాగా ఉన్నా శృతి మించిన ఖాళీ సమయం ఒకరి లోపాలు మరొకరు ఎంచే స్థితికి కొన్ని ఇళ్లల్లో తీసుకెళ్లింది. గతంలో గొడవ జరిగితే కాసేపు బయట గడిపి చల్లార్చుకునేవారు. ఇప్పుడు ఇల్లు దాటని పరిస్థితిలో గొడవ అంతు తేల్చాలని అనుకోవచ్చు. కాని కలహాలు పోస్ట్‌పోన్‌ చేయండి. ప్రాణాలు ముఖ్యమని తలవండి. నిపుణులు చెప్తున్నది అదే.

‘మీరు అంట్లు కడగండి చాలు. కాఫీ, వంట నేను చూస్తాను’ ‘నాకు అంట్లు పెట్టకు. కాఫీ నేను చేస్తా’ ‘మీరు సరిగ్గా పెట్టరండీ. నాకు డబుల్‌ వర్క్‌ అవుతుంది’‘అంటే? నీకు వచ్చా? పెళ్లయిన కొత్తలో మా అమ్మ కదా నీకు నేర్పింది’ ‘ఆ... నా మీద మీకు చాలా నేర్పింది’ ‘మీనా...!’ ఇది మొదటి గొడవ.

‘పిల్లలు అలా తొమ్మిదీ పది దాకా నిద్రపోతే ఎలాగండీ. వాళ్లకు నా భయం లేదు. మీ భయం లేకపోతే ఎలా?’ ‘పడుకోనీ. వాళ్లు మాత్రం ఏం చేస్తారు. రాత్రంతా గేమ్స్‌ ఆడినట్టున్నారు.’‘మీరిలా వెనకేసుకొస్తే పని ఎవరు చేస్తారు? వాళ్లు కూడా పనిలో సాయం చేయాలి కదా’ ‘నువ్వు కదా గారం చేశావు. నేనా చేశాను’‘ఏం చెప్పినా ఎదురొస్తారు కదా. ఈ లాక్‌డౌన్‌ నా చావుకొచ్చింది’‘నీ విసుగు చూస్తుంటే చచ్చేలా ఉన్నాను’ఇది రెండో గొడవ.

మీనాక్షికి ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్‌ చేయాలో తెలియకుండా ఉంది. ఉద్వేగం తన్నుకొకొస్తోంది. కళ్లల్లో నీళ్లు చిప్పిల్లుతున్నాయి. చేస్తున్న చాకిరికి ప్రతిఫలం ఇదా అనిపిస్తోంది. ఎక్కడికైనా వెళ్లి కాస్త ఊపిరి పీల్చుకుందామని ఉంది. కాని ఎక్కడికి వెళ్లేట్టు? ఇల్లు కదలడానికి లేదు. అదే ఇల్లు. అదే హాలు. అవే బెడ్‌రూమ్స్‌. అదే కిచెన్‌. అనుక్షణం కంటి ముందు భర్త, ఇద్దరు పిల్లలు. తప్పు వారిదో తనదో తెలియకుండా ఉంది.

ప్రపంచంతోపాటు దేశాన్ని కూడా కరోనా కబళించడం మొదలైంది. ప్రధాని మొదట ఒకరోజు జనతా కర్ఫ్యూ అన్నారు. ఆ ఆదివారం ఇంట్లో అందరూ కదలకుండా ఉండిపోయారు. సరదాగా వొండుకుని తిన్నారు. సాయంత్రం పళ్లేలు మోగించారు. అయితే ఆ మరుసటి రోజే లాక్‌డౌన్‌ ముప్పు నెత్తిన పడింది. మీనాక్షి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. భర్త కూడా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరే. పిల్లలు ఒకరు బి.టెక్‌ ఫస్ట్‌ ఇయర్, మరొకరు ఫైనలియర్‌. లాక్‌డౌన్‌తో భార్యాభర్తలిద్దరికీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పడింది. పిల్లలలిద్దరికీ కాలేజీలు మూతపడ్డాయి. మామూలు దినచర్యలో అయితే నలుగురూ ఉదయం లేస్తే ఎవరి పనుల మీద వారెళ్లి సాయంత్రానికి ఇల్లు చేరుకుంటారు. తినడం, టీవీ చూడటం, కాసేపు కబుర్లు... అంతకుమించి పెద్ద పెద్ద సంభాషణలకు, చర్చలకు తావుండదు. ఏవైనా చిన్న చిన్న ఫిర్యాదులున్నా అవి నీటి బుడగల్లా ఒకటి రెండు క్షణాల్లో తేలిపోయేవి. మీనాక్షి భర్తకు చాదస్తమే అయితే ఆ చాదస్తం ప్రదర్శించడానికి టైమ్‌ ఉండేది కాదు. లాక్‌డౌన్‌ తర్వాత చాలారోజులకు నలుగురూ కలిసి గడిపే పరిస్థితి వచ్చింది. మొదటి నాలుగైదు రోజులు చాలా హుషారుగా అనిపించింది. కరోనా భయంతో తలుపులు మూసుకుని ఉండాల్సి రావడంతో కబుర్లు నడిచాయి. గేమ్స్‌ ఆడారు. అమేజాన్‌లోనో నెట్‌ఫ్లిక్స్‌లోనో సినిమాలు చూశారు. భర్త తన ఆఫీసు పని లాప్‌టాప్‌లో చేసుకునేవాడు. కాని మీనాక్షి తన ఆఫీస్‌పనితో పాటు ఇంటి పని కూడా చేయాల్సి వచ్చింది. కాని ఆ పనికి కూడా ఆమె సంతోషపడింది. నలుగురూ కలిసి తినడం, నలుగురూ కళ్ల ముందర ఉండటం బాగా అనిపించింది. కాని మెల్లగా పరిస్థితి మారింది.

‘ఉద్యోగం కోసం బయటకెళతాను గాబట్టి సరిపోయింది. రోజంతా నిన్ను చూస్తుంటే నాకు టెన్షన్‌ పెరిగిపోతూ ఉంది’ అన్నాడు భర్త.
‘అంత పాపం ఏం చేశాను’ అంది మీనాక్షి.
‘నీకు పని మీద శ్రద్ధ లేదు. ఇంటి మీద శ్రద్ధలేదు. అన్నీ కుదురుగా చేసుకుందామనే ధ్యాస లేదు. ఏదో వొండి నా మొహాన పిల్లల ముఖాన పడేసి ఆఫీసుకెళ్లడమో, లాప్‌టాప్‌ ముందు కూలబడటమో చేద్దామనుకుంటుంటావ్‌. ఉద్యోగం చేసే పిల్ల వద్దురా అని అప్పుడే మా అమ్మ చెప్పింది. ఇప్పుడు ఆ మాట విలువ తెలిసొస్తోంది’
‘నెల నెలా నా జీతం తీసుకుంటారుగా. అప్పుడు తెలిసి రాలేదా?’ మీనాక్షి చురకేసింది.

అంతకు ముందు ఇలాంటి గొడవొస్తే ఎలాగోలా సద్దుమణిగేది. ఇప్పుడు మనిషి ఎదురుగా ఉండే సరికి వేరే పనేమీ లేకపోయేసరికి గొడవ పెరిగిపోతూ ఉంది. పిల్లలు ఎంత అనుభవ శూన్యంగా, ఉద్వేగాలు పట్టనివారుగా ఉంటున్నారో ఇప్పుడే అర్థమవుతోంది. తల్లిదండ్రుల కలహాలను తగ్గించడం, సర్దిచెప్పడం కూడా వారికి రావడం లేదు. ఇలాగే అయితే ఇంకొన్నాళ్లకు ఏమవుతుందో అని మీనాకు భయం వేసింది. ఒక ఫ్రెండ్‌తో గోడు వెళ్లబోసుకుంటే సైకియాట్రిస్ట్‌తో ఫోన్‌ ద్వారా కౌన్సిలింగ్‌ తీసుకోమని చెప్పింది.

‘కరోనా భయం కూడా మీ కలహాలకు లేదన్నమాట’ అన్నాడు సైకియాట్రిస్ట్‌ ఆమె ఉద్వేగాన్ని తేలిక చేయడానికి నవ్వుతూ.
‘డాక్టర్‌’... ‘చూడండి. ఇప్పుడు మనకు కొత్త జీవన విధానం వచ్చింది. కలిసి ఉండాలి... కాని దూరం దూరంగా ఉండాలి... అదే ఈ జీవన విధానం. మీ భర్తతో మీరు కలసి ఉండండి... కాని ఆయన ఫిర్యాదులతో, పితూరీలతో, అభ్యంతరాలతో దూరంగా ఉండండి. ఆయన కూడా మీ గురించి అదే చేయాలి. మీతో దగ్గరగా మీ కంప్లయింట్స్‌తో దూరంగా ఉండాలి. ఏవైనా కంప్లయింట్‌లు ఉంటే వాటి సంగతి తర్వాత చూసుకోవాలి. అంతవరకూ మీ కలహాలు పోస్ట్‌పోన్‌ చేసుకోండి. ఇప్పుడు అలకలు, పుట్టింటికి వెళ్లడాలు, భర్త బయటకువెళ్లి హాస్టల్‌లో చేరడాలు కుదరవు. కరోనాకు విరుగుడుగా చేతులు కడుక్కున్నట్టుగా బాధించే ఉద్వేగాలను మనసు నుంచి కడిగేసుకోవడమే ఇప్పుడు కావలసింది. మీ భర్తతో మాట్లాడించండి. ఆయనకూ ఇదే చెబుతాను. ఇక పిల్లలను క్రమశిక్షణలో పెట్టడం, వారు ఈ ఖాళీ సమయంలో కొట్టుకుపోకుండా చదువుపై దృష్టి మళ్లించడం మీ ఇద్దరూ కలిసి చేయవలసిన పని. అది మర్చిపోకండి’ అన్నాడు సైకియాట్రిస్ట్‌. ఆ తర్వాత భర్తతో కూడా మాట్లాడాడు.ఇప్పుడు ఆ ఇంటికి బయటి ప్రమాదాన్ని ఎదుర్కోగల లోపలి ఐకమత్యం వచ్చింది.

బయట ఒక జీవన్మరణ సమస్య ఉంది. ఆ సమస్య ముందు కాపురంలో కలహం కొంచెం చిన్న సమస్య. బయటి సమస్యకు విరుగుడులేదు. లోపలి సమస్యను అర్థం చేసుకుంటే విరుగుడు ఉంది. ముందు మనమంతా ప్రాణాలను కాపాడుకోవాలి.ఇంటిని ఆరోగ్యవంతం చేసుకోవాలి. – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు