కనువిందుగా... కడుపు నిండుగా...

28 Dec, 2019 00:57 IST|Sakshi

ఫుడ్‌ ప్రింట్స్‌

ఆ హోటల్‌కు హంగు ఆర్భాటాలు ఏమీ ఉండవు. అక్కడకు చేరేదాకా ఒక హోటల్‌ ఉంటుందన్న భావన, మన ఆకలి తీర్చే అన్నదాత ఉంటాడన్న స్ఫురణే మనకు రాదు. ఆ హోటల్‌కు ఒకసారి విచ్చేసి భోజనం చేస్తే మాత్రం ‘అన్నదాతా సుఖీభవ’ అనాల్సిందే. ప్రచార పటాటోపం కన్నా, అన్నార్తుల జిహ్వచాపల్యానికి అనుగుణంగా 24 రకాల కూరలతో సుష్టుగా భోజనం పెట్టి సంతృప్తి పరుస్తున్న నాగన్న హోటల్‌ ఈ వారం ఫుడ్‌ ప్రింట్స్‌...

ఉపాధి కోసం ఉన్న ఊరు వదిలి ఎక్కడికో వెళ్లడం ఎందుకనుకున్నారు బెల్లంకొండ నాగన్న. ఖమ్మం–సూర్యాపేట ప్రధాన రహదారిలో మండల కేంద్రమైన కూసుమంచిలో 1995లో ఒక హోటల్‌ను ప్రారంభించారు. ఇంటి పట్టునే ఉండి వ్యాపారం చేసుకోమని అమ్మ ఇచ్చిన సలహాతో నాగన్న అక్కడే ఉండి, సమీప బంధువుల స్థలంలో చిన్న పూరిపాకలో హోటల్‌ ప్రారంభించారు. పోటీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న తపనతో నాగన్న విస్తరినిండా కూరలు వడ్డించి ఆకలితో వచ్చేవారిని సంతృప్తి పరచాలనుకున్నారు. 24 కూరలతో కూడిన శాకాహార భోజనాన్ని రూ.10కే అందించడం ప్రారంభించారు. లాభనష్టాల గురించి  ఆలోచించలేదు. వెనుకడుగు వేయకూడదన్న లక్ష్యంతో 24 ఏళ్లుగా 24 కూరల హోటల్‌ను నడుపుతూనే ఉన్నాడు.

వంటకాలను నాగన్న కుటుంబ సభ్యులే తయారు చేస్తారు. తెల్లవారు జామున ఐదు గంటలకు భార్య మణెమ్మతో కలిసి పని ప్రారంభిస్తే, మధ్యాహ్నం దాకా అదే వ్యాపకం. హోటల్‌కు ఎంతమంది వచ్చినా.. ఏ రకమైన కూరైనా భార్య మణెమ్మ వండాల్సిందే, నాగన్న వడ్డించాల్సిందే. తనకున్న పొలంలో కూరగాయలు పండిస్తూ, వాటినే హోటల్‌కు వినియోగిస్తున్నారు. సొంత పాడి నుంచి పెరుగు తయారు చేస్తారు. నాణ్యమైన భోజనానికి చిరునామాగా ఉన్న తన పేరు వినియోగదారుల హృదయాలలో పది కాలాల పాటు ఉండాలని ఆయన చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటారు. సొంత పొలంలో పండించిన ధాన్యాన్ని మర ఆడించి, ఆ బియ్యాన్ని హోటల్‌కు వినియోగిస్తున్నారు.
– మాటేటి వేణుగోపాల్, సాక్షిప్రతినిధి, ఖమ్మం

మా హోటల్‌ గురించి ఎక్కడా ప్రచారం ఉండదు. భోజనానికి వచ్చిన వారు మరో పదిమందికి తెలియజేయడం వల్లే వ్యాపారం ఎదుగుతోంది. మా హోటల్‌లో భోజనం చేయడానికి ఇక్కడి కూరల విశిష్టత, ప్రత్యేకత తెలుసుకున్న అనేకమంది ఇతర ప్రాంతాల నుంచి పనిగట్టుకుని వస్తారు. రాజకీయ ప్రముఖులు, అధికారులు సైతం మా వంటను చవిచూసినవారే. సినీ ప్రముఖులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు మా హోటల్‌ అడ్రస్‌ తెలుసుకుని 24 కూరల భోజనాన్ని రుచి చూస్తుంటారు. భోజనప్రియుల జిహ్వచాపల్యానికి అనుగుణంగా ప్రయోగాలు చేస్తుంటాం.

బీట్‌రూట్‌తో కూర మాత్రమే కాదు, పచ్చడి సైతం చేసి మెప్పిస్తాం. క్యారట్, ముల్లంగి, క్యాబేజీ, టొమాటో, వంకాయ, దోసకాయ, బెండ, బీర, చిక్కుడు, గోరు చిక్కుడు, బుడమ దోస, కాకర వంటి కాయగూరలతో రోజుకో రకం తయారు చేస్తాం. జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అన్నట్లుగా ఎవరికి నచ్చిన కూర వారు తింటారు. అన్నీ నచ్చిన వారు తిని మరోసారి వేయమంటే నాకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. కాష్‌ కౌంటర్‌ దగ్గర కూర్చోవడం ఇష్టం ఉండదు. తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే కూర్చుంటాను. వినియోగదారులతో కలిసి వారికి ఆనందం కలిగేలా వడ్డించడమే నాకు ఇష్టం. అందుకే నేను వాళ్లలో కలిసిపోతాను.
– నాగన్న, హోటల్‌ యజమాని

మరిన్ని వార్తలు