గాగా.. యువతను చేసెనొక గమ్మత్తు..!

17 Oct, 2013 00:06 IST|Sakshi
గాగా.. యువతను చేసెనొక గమ్మత్తు..!

లేడీగాగా ఓ అయస్కాంతం. అయస్కాంతానికి ఇనుప ముక్కలు అతుక్కొంటాయి.. ఆమె వాయిస్‌కు గ్రామీ అవార్డులు అతుక్కొంటాయి. అంతే తేడా! ఈ కుర్ర అయస్కాంతానికి అతుక్కొనేవి అవార్డులే కాదు... పాప్‌ను పిచ్చిగా అభిమానించే యువ హృదయాలు కూడా. తాజాగా గాగా ట్విటర్ ఫాలోవర్ల విషయంలో కొత్త రికార్డును నెలకొల్పింది. నాలుగు కోట్ల మంది ట్విటర్ ఫాలోవర్లతో ప్రపంచంలోనే అత్యధికమంది ఫాలోవర్లను కలిగి ఉన్న ట్విటిజన్‌గా నిలిచింది.
 
 గాగా... సింగర్, సాంగ్ రైటర్, యాక్టివిస్ట్, రికార్డ్ ప్రొడ్యూసర్, బిజినెస్ ఉమన్, ఫ్యాషన్ డిజైనర్, నటి, వేదాంతి. పాతికేళ్ల వయసుకే సంపాదించిన గుర్తింపులు ఇవి. పాశ్చాత్య యువతరానికి రోల్ మోడల్‌గా, భారతీయ యువతకు పరిచయస్తురాలిగా ఉన్న గాగా విషయాలు, విశేషాలు ఇవి...
 
గాగా అసలు పేరు స్టెఫానీ జోన్నే ఏంజెలీనా జెర్మనొట్టా. ‘రేడియో గాగా’ అనే పాట స్ఫూర్తితో ఆమె తన స్టేజ్‌నేమ్‌ను ‘లేడీగాగా’ గా మార్చుకొంది.
 
 గాగా వాడే పెర్ఫ్యూమ్, లిప్‌స్టిక్, మేకప్‌కిట్స్ అన్నీ ఫేమస్సే. గాగా వల్లనే ఆ బ్రాండ్స్‌కు మంచి ప్రచారం వస్తోంది. వ్యక్తిగతంగా కూడా గాగా మేకప్ లేనిదే పర్సనల్ రూమ్ నుంచి బయటకు అడుగుపెట్టదట.
 
ఆమె వినసొంపు వాయిస్ మాత్రమే కాదు.. మేని ఒంపులు కూడా ఫేమస్సే. ఫ్యాషన్‌లో ట్రెండ్‌ను ఫాలో కాకుండా ట్రెండ్‌ను సృష్టిస్తుంటుంది. తను వేసే ఔట్‌ఫిట్స్‌తో (దుస్తులతో) ఔరా అనిపిస్తుంటుంది. ప్రపంచ పాప్ సామ్రాజ్యానికి మకుటం లేని మహారాణిగా ఉన్న ఈ యువతి ఇప్పుడు ఏం చేసినా సంచలనమే.
 
 గాగా ఎక్కడికి వెళ్లినా తనతో పాటు ఒక టీ కప్, సాసర్‌ను తీసుకెళ్తుంది. ఎందుకంటే.. ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఆ కప్‌లో టీ తాగడం వల్ల ఇంటిదగ్గర ఉన్న ఫీలింగ్ కలుగుతుందని చెబుతుంది.
 
 తన స్టేజ్ షోలో ఆమె వేసుకుని వచ్చే డ్రస్ ప్రధాన ఆకర్షణ. ఆమె ఎలాంటి ఔట్‌ఫిట్స్‌తో వస్తుందనే విషయం గురించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అలా ఒకసారి డిఫరెంట్ డ్రస్సింగ్‌తో  షికాగోలోని పబ్లిక్ ప్లేస్‌లోకి వచ్చిన గాగాను అశ్లీల వస్త్రధారణతో ఉందని  అక్కడ నుంచి తరలించారు పోలీసులు!
 
ట్విటర్ ఫాలోవర్ల విషయంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటుంది లేడీగాగా. ఈ పాప్ సింగర్‌ను ఈ విషయంలో బీట్ చేసే వారెవరూ కనుచూపు మేరలో లేరు. గాగాకు నాలుగు కోట్ల మంది ట్విటర్ ఫాలోవర్లున్నారు.
 
ఫేస్‌బుక్ విషయంలో అమెరికాలోనే టాప్ స్థానంలో ఉంది గాగా. అమెరికా అధ్యక్షుడు ఒబామా అఫిషియల్ ఫేస్‌బుక్ పేజ్ కన్నా గాగా ఫేస్‌బుక్ పేజ్‌కే ఎక్కువమంది సబ్‌స్క్రైబర్లుండటం గమనార్హం.
 
 గాగాకు దాదాపు రెండు కోట్ల మంది ఫేస్‌బుక్ ఫాలోవర్లుండగా, ఒబామాకు ఒకటిన్నర కోటి మంది మాత్రమే ఉన్నారు.
 
 పాప్ సింగర్‌గా సంపాదన విషయంలో గాగా టాప్ ఆఫ్ ది చార్ట్‌గా నిలుస్తోంది. ప్రతియేటా అత్యధిక వసూళ్లను సాధించిన పాప్‌ఆల్బమ్స్‌ల జాబితాలో గాగా ఆల్బమ్‌లే ముందు వరసలో ఉంటాయి.
 
 ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రభావాత్మకమైన సంగీతకారిణి హోదాలో ఉంది.
 
 చారిటీ విషయంలో కూడా గాగాకు మంచి గుర్తింపు ఉంది. తమ సంపాదనలో దానధర్మాలకు ప్రాధాన్యత ఇస్తున్న  పాప్‌సింగర్ల జాబితాలో కూడా గాగా ప్రతియేటా తొలిస్థానంలోనే నిలుస్తోంది.
 
 గాగా  పేరు ఒక మార్కెటింగ్ సూత్రం. పాశ్చాత్య యువతలో ఆమెపై ఉన్న వెర్రి అభిమానాన్ని అనేక వాణిజ్య సంస్థలు బాగా సొమ్ము చేసుకొంటున్నాయి. గాగా పేరుతో టూత్ బ్రష్‌లు కూడా వచ్చాయంటే పరిస్థితి ఎంత వరకూ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
 
 గాగా మైనపు బొమ్మను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.
 

మరిన్ని వార్తలు