బడ్జెట్ కేటాయింపుల్లో.. రైతుకు దక్కేది పిడికెడే!

19 Mar, 2015 00:04 IST|Sakshi
బడ్జెట్ కేటాయింపుల్లో.. రైతుకు దక్కేది పిడికెడే!

ఈ ఏడాది తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి  బడ్జెట్ కేటాయింపులు పోటీపడి తగ్గించాయి. రుణ మాఫీ పథకానికి కేటాయించిన నిధులు,  కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు, సిబ్బంది జీతాలు మినహాయిస్తే నికరంగా రైతుకు చేరేది చాలా తక్కువ.  చిన్న రైతుల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే చర్యలకు నిధులు కేటాయిస్తే బాగుండేదంటున్నారు డాక్టర్ డి.నరసింహారెడ్డి.
వ్యవసాయానికి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో నిధుల కేటాయింపులు తగ్గిపోతున్నాయి.

చిన్న రైతులకు అవసరమైన పథకాలను కుదించడం లేదా ఎత్తివేయడం జరుగుతోంది. కేటాయింపులను సైతం  పూర్తిస్థాయిలో ఖర్చు చేయటం లేదు. రైతులు అధికారుల వద్దకు తిరగలేక, పథకాలు ఉన్నా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇచ్చిన వారికే ఇవ్వటం,  నిబంధనల పేరిట అర్హులకు ఇవ్వకపోవటం, అరకొరగా ఇవ్వటం వంటి కారణాలతో రైతులకు ప్రయోజనం కలగటంలేదు.
 
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖకు 2014-15లో రూ. 6,276 కోట్లు, 2015-16లో రూ. 5,545 కోట్లు కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే 13 శాతం నిధుల కేటాయింపు తగ్గింది. ప్రణాళికా కేటాయింపులు రూ. 1,035 కోట్లు కాగా ప్రణాళికేతర కేటాయింపులు రూ. 4,510 కోట్లు! ప్రణాళికా కేటాయింపులు గతేడాది కంటే భారీగా 76 శాతం తగ్గించారు.    మొదటి నుంచి కూడా కేంద్ర పథకాలు, తద్వారా వచ్చే నిధులనే రాష్ట్రాలు నమ్ముకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వమేమో రాష్ట్రాలకు నిధులు నేరుగా బదలాయించి, స్వేచ్ఛ కల్పించానంటుంటే, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకపోవటం శోచనీయం.  
 
నికర కేటాయింపులు స్వల్పమే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయింపులు ఇందుకు భిన్నంగా ఏమీలేవు. 2015-16 సంవత్సరానికి వ్యవసాయ శాఖ కేటాయింపులు రూ. 6,454 కోట్లు. గత సంవత్సర కేటాయింపుల కన్నా ఈ కేటాయింపులు తొమ్మిది శాతం తక్కువ. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లలో రుణ మాఫీ పథకం నిధులు,  కేంద్ర ప్రాయోజిత పథకాలను మినహాయిస్తే వ్యవసాయానికి నికర కేటాయింపులు చాలా తక్కువ.

రుణమాఫీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి సంవత్సరం రూ. 5 వేల కోట్లు కేటాయించి 2015-16లో రూ. 4,300 కోట్లకు తగ్గించింది. తెలంగాణ ప్రభుత్వం రూ. 4,250 కోట్లు కేటాయించింది. రెండు రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, వ్యవసాయాభివృద్ధికి సమృద్ధిగా నిధులివ్వకపోవడం ఆయా ప్రభుత్వాల హ్రస్వ దృష్టిని సూచిస్తుంది. రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చే నిధులు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో రూ. 10 కోట్లకు మించవు. మిగతా నిధులు, బిల్డింగులు పరిశోధనలు పెద్ద కమతాలకు ఉపయోగపడేవే.
 
అధికార  టి.డి.పి., టి.ఆర్.ఎస్. పార్టీలు ఎన్నికల సమయంలో ఘనమైన హామీలు ఇచ్చాయి. కాంప్లెక్స్ ఎరువుల సరఫరాకు రూ. 500 కోట్లు ఇస్తానని టీడీపీ హామీ ఇచ్చింది. మార్కెట్ స్థిరీకరణ నిధికి రూ. 5 వేల కోట్లు కేటాయిస్తామన్నారు.  ఆ పథకం ఊసే ఎత్తలేదు. అనేక పంటలకు గిట్టుబాటు ధర లభించటం లేదు. మార్కెట్ స్థిరీకరణ నిధి ఈ పరిస్థితిలో అత్యంత అవసరం. చిన్న, సన్న కారు రైతుల అవసరాలు తీర్చే కొత్త పథకం ఒక్కటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించలేదు.
 
ప్రణాళిక కేటాయింపులలో వ్యవసాయ అనుబంధ రంగాలకు 2014-15లో కేటాయించిన రూ. 5415 కోట్లు వార్షిక ప్రణాళికలో 20.31 శాతం కాగ, 2015-16లో  కేటాయించిన రూ. 1863 కోట్లు కేవలం 5.42 శాతం మాత్రమే. రైతులను, ఆదుకోవాల్సిన ప్రభుత్వం అరకొర కేటాయింపులు చేయటం దురదృష్టం.
 
రైతుకు చేరేది తక్కువే
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రాష్ట్ర బడ్జెట్లో అవీ ఇవీ ఒకచోట చేర్చి వ్యవసాయ బడ్జెట్ అన్నారు. వ్యవసాయాభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలేమిటో,  సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో పేర్కొని ఉంటే స్పష్టత ఉండేది. పట్టు పరిశ్రమకు రూ. 93 కోట్లు ఇచ్చామన్నారు.  దీనిలో రూ. 82 కోట్లు, సిబ్బంది జీతభత్యాలకు ఖర్చుకాగా పరిశ్రమ అభివృద్ధికి మిగిలేది కేవలం రూ.7.25 కోట్లు మాత్రమే. అలాగే పశుగణాభివృద్ధికి ప్రకటించిన రూ. 672 కోట్లలో సిబ్బంది జీతభత్యాలకే రూ. 489 కోట్లు ఖర్చవుతాయి.

రెండు రాష్ట్రాలు కలిపి కేటాయించిన రూ. 11,999 కోట్లలో రైతుల సమస్యలు తీర్చేందుకు ఉపయోగపడే నిధులు రూ. 500 కోట్లకు మించవు. చిన్న రైతులు దశలవారీగా ఆర్థిక స్వావలంబన సాధించేందుకు తోడ్పడే చర్యలకు నిధులు కేటాయిస్తే బాగుండేది. ప్రభుత్వ పథకాల అమలులో సమన్వయం సాధించి, అవినీతిని తగ్గించి, నిధులను పరిపూర్ణంగా రైతులకు చేర్చే ప్రక్రియలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. (వ్యాసకర్త వ్యవసాయ విధాన విశ్షేషకులు. మొబైల్ : 90102 05742)

మరిన్ని వార్తలు