కందకాల వల్ల కాపు నిలిచింది!

5 Jun, 2018 01:07 IST|Sakshi

గుడి రామ్‌నా«ద్‌ విజయ్‌కుమార్‌ అనే పండ్ల తోటల రైతు కందకాల ద్వారా వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకింపజేసి తమ పండ్ల తోటకు నీటి భద్రత సాధించుకున్నారు. మామిడి కాపును నిలబెట్టుకున్నారు.  రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కోళ్ల పడకల్‌ గ్రామ పరిధిలో ఆయనకు 34 ఎకరాల మామిడి, సపోట తోట ఉంది. వర్షాకాలం పోయిన కొద్ది నెలలకే భూగర్భ జలాలు అడుగంటి బోర్లు నోరెళ్లబెడుతున్న నేపధ్యంలో 2016లో కందకాల ద్వారా వాన నీటి సంరక్షణపై దృష్టిపెట్టారు. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం పెద్దలు సంగెం చంద్రమౌళి(98495 66009), మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074)లను సంప్రదించారు. వీరి ఉచిత సాంకేతిక సహకారంతో మీటరు లోతు, మీటరు వెడల్పున పొలంలో వాలుకు అడ్డంగా ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో కందకాలు తవ్వించారు. 

2016లో ఒకటి, రెండు వర్షాలే పడ్డాయి. 2017లో మంచి వర్షాలు పడినప్పుడు రెండు, మూడు సార్లు కందకాలన్నీ నిండి, భూమిలోకి వర్షం నీరు బాగా ఇంకింది. మా తోటలో బోర్లు ఈ వేసవిలో కూడా ఒకటిన్నర – రెండంచుల నీరు పోస్తున్నాయి. అయితే, మా చుట్టు పక్కల తోటల్లో బోర్లు ఈ వేసవిలో చాలా వరకు ఎండిపోయాయి. 24 గంటల కరెంటు ఉన్నా మేం రాత్రిపూట బోర్లకు విరామం ఇస్తున్నాం. ఐదు బోర్లలో రెండు బోర్లకు సోలార్‌ పంపు సెట్లు పెట్టించాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి ఆగిపోతాయి. రాత్రి పూట బోర్లు రీచార్జ్‌ కావడానికి విరామం దొరుకుతుంది. అయితే, 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇవ్వడంతో కొందరు రైతులు రాత్రీ పగలూ బోర్లు ఆడిస్తున్నారు. ఇందువల్ల వారి బోర్లు త్వరగా ఎండిపోతున్నాయి. గత నాలుగేళ్లుగా సరిగ్గా నీరు లేని కారణంగా మా మామిడి తోటలో కాపు రాలేదు. ఈ సంవత్సరం కాపు కొంత నిలిచింది. ఖర్చులు చేతికి వచ్చాయి. తోటలకు మనం నీరు పెట్టేది ఒక ఎత్తయితే, భూమిలోకి ఇంకిన వర్షపు నీటి తేమ మరో ఎత్తు. వర్షంలో చెట్టు తడవడం ద్వారా పొందే నీరు ఇంకో ఎత్తు. నీరు లేని షాక్‌ వల్ల నాలుగేళ్లు పంట నిలవలేదు. కందకాల ప్రభావం వల్ల ఈ ఏడాది మామిడి చెట్లపై కాపు నిలబడిందని విజయ్‌కుమార్‌(98490 19454) సంతోషంగా తెలిపారు. 

మరిన్ని వార్తలు