నారాయణరెడ్డిని అప్పులు మింగేశాయి

2 Apr, 2019 06:17 IST|Sakshi

నివాళి

బోర్లు వేసి చీనీ, వేరుశనగ సాగు చేసి అప్పుల పాలైన రైతు నారాయణరెడ్డి(51) ఆత్మహత్య చేసుకొని ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు ఆయన కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం అందలేదు. నారాయణరెడ్డిది అనంతపురం జిల్లా శింగనమల మండలం జలాలపురం గ్రామం. అప్పుల బాధతో 2017 సెప్టెంబరు 16న ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అతనికి 11 ఎకరాల భూమి ఉంది. భార్య రమాదేవి పేరు మీద 7.50 ఎకరాలు, కుమారుడు అనిల్‌కుమార్‌రెడ్డి పేరు మీద 4 ఎకరాల భూమి ఉంది. బోరులో నీళ్లు తగ్గిపోవడంతో పొలంలోని చీనీ చెట్లను 2009లో కొట్టేశారు. అప్పట్నుంచీ వర్షాధారంగా  వేరుశనగ సాగు చేస్తున్నారు. తదనంతరం అప్పు చేసి నాలుగు బోర్లు వేయిస్తే రూ. 1.6 లక్షలు ఖర్చయింది కానీ నీళ్లు పడలేదు. ఆ తర్వాత ప్రతి ఏటా అప్పుచేయడం, వేరుశనగ వేయటం. పంట సరిగ్గా రాక ప్రతి ఏటా అప్పు పెరగడం. చివరకు అప్పు రూ. 4 లక్షల చేరింది. అప్పల బాధ భరించలేక నారాయణరెడ్డి 2017 సెప్టెంబర్‌ 16న ఆత్మహత్య చేసుకున్నారు. అతనికి భార్య రమాదేవి,  కుమారుడు అనిల్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. కుమారైకు వివాహం చేశారు. అనిల్‌కుమార్‌రెడ్డి అనంతపురంలో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. ‘పరిహారం నేటికీ అందలేదు. పెట్టుబడి లేక భూములు బీడు పెట్టుకున్నాం..’ అన్నారు రమాదేవి.
– మునెప్ప, సాక్షి, శింగనమల

మరిన్ని వార్తలు