ఫ్యాషన్‌ గురు టు యోగా గురువు

22 Jun, 2020 07:51 IST|Sakshi

యోగమే సోపానం

ఫ్యాషన్‌ పరిశ్రమలో దాదాపు రెండు దశాబ్దాల పాటు వెలిగిన మాలిని రమణి ఫ్యాషన్‌ ప్రపంచానికి వీడ్కోలు పలికి యోగా గురువుగా మారింది.ఇక యోగా గురువుగానే ఉండిపోతానంటోంది మాలిని.

గోవాలోని ఈ డిజైనర్‌ ఫ్యాషన్‌హౌస్‌లు ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా ఇంకా తెరుచుకోవడం లేదు. డిజైనింగ్‌కు అవసరమైన మెటీరియల్‌కు తగిన షాపులు తెరవకపోవడం, టైలర్లు అందుబాటులో లేకపోవడంతో డిజైనింగ్‌ నుండి మాలిని దూరమైంది. ఇప్పుడు యోగా గురువుగా కొత్తగా ఏదో ఒకటి చేస్తూ తన జీవితాన్ని గడపాలని కోరుకుంటుంది. ‘ప్రస్తుతం కరోనా యుగంలో ఉన్నాం. ఇలాంటి పరిస్థితులలో బయటకు వెళ్లలేం. పార్టీకోసం అందమైన దుస్తులను రూపొందించడానికి ఇది సమయమూ కాదు. అందుకే యోగాను ఎంచుకున్నాను’ అంటోంది మాలిని.

అంతర్జాతీయ గుర్తింపు
దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం, 2000 సంవత్స రంలో రమణి తన కెరీర్‌ను ఇండియన్‌ ప్రిన్సెస్‌ కలెక్షన్‌తో ప్రారంభించింది. ఇరవై ఏళ్ళలో ఆమె ఫ్యాషన్‌హౌస్‌ విదేశీ ప్రముఖులను కూడా ఆకట్టుకుంది. ఈ ప్రసిద్ధ డిజైనర్‌ ప్రముఖ ఖాతాదారులలో బాలీవుడ్, టాలీవుడ్‌ తారలూ ఉన్నారు. సారా జేన్‌ డియాజ్, తమన్నా భాటియా, శిల్పా శెట్టి, తాప్సీ పన్నూ, ఇషా గుప్తా, నర్గిస్‌ ఫఖ్రీ.. వంటివారెందరో ఉన్నారు. పారిస్‌ నటి మీడియా పర్సనాలిటీ హిల్టన్‌ మాలిని రూపొందించిన చీరను ధరించడంతో అంతర్జాతీయ శైలి ఐకాన్‌గా గుర్తింపు పొందింది.

ఆరేళ్ల వయసులోనే యోగాభ్యాసం..
ఆరేళ్ల వయసులో తన తల్లి యోగా పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చిన నాటి నుంచి మాలిని యోగా నేర్చుకోవడం ప్రారంభించింది. ఆ పుస్తకంలో పేర్కొన్న యోగాసనాలను సరదా సరదా భంగిమలతో సాధన చేయడం ప్రారంభించింది. ‘ఒక విద్యార్థి నుంచి యోగాగురువుగా మారే ప్రయాణం తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింద’ని మాలిని చెబుతుంది.

భావోద్వేగాల అదుపు
యోగాను రోజూ సాధన చేస్తే యోగమే అంటున్న మాలిని రమణి యోగా నిపుణులు గుర్ముఖ్‌ ఖల్సా నుండి శిక్షణ తీసుకుంది. తన గురువు గుర్ముఖ్‌ గురించి చెబుతూ‘ఆమె నుండి యోగా నేర్చుకున్న అనుభవం అద్భుతమైనది. యోగాతో నా భావోద్వేగాలను నియంత్రించడం నేర్చుకున్నాను. యోగాలో ధ్యానానికి అత్యున్నత హోదా ఉంది. నా జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడంలో యోగా ప్రధాన పాత్ర పోషించింది. యోగ ప్రతిపనిని సరిగ్గా చేయటానికి నాకు బలాన్ని ఇస్తుంది. ఇక నుంచి యోగానే శ్వాసిస్తూ, యోగాలో శిక్షణ ఇస్తూ.. యోగా గురువుగా ఉండిపోతాను’ అని చెబుతోంది  కరోనా ఎందరి జీవితాలనో మార్చబోతోంది. చేస్తున్న పనులను ఆపేసి కొత్తమార్గాన్ని సృష్టిస్తోంది. ఆ మార్గం అందరినీ ఆరోగ్యం వైపుగా మళ్లించడానికి సిద్ధమవడం సంతోషకరం.

మరిన్ని వార్తలు