కారు డ్రైవర్‌ మత్తు.. కియారా జీవితంలో విషాదం

26 Jun, 2020 08:22 IST|Sakshi

స్ఫూర్తి

ఇక జీవితంలో నడవలేనేమో అనే సంశయం కన్నా పడిపోయినా పర్వాలేదు ఒక్క అడుగు వేసి నిలబడాలి అని కోరుకునే వారికి కియారా మార్షల్‌ అసలు సిసలు నిర్వచనంలా కనిపిస్తోంది. నవతరం అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. న్యూయార్క్ ‌సిటీ బ్రూక్లిన్‌లో నివసిస్తున్న కియారా పదేళ్ల వయసులో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లింది. తిరిగి వస్తుండగా ఓ కారు ఆమెను ఢీ కొట్టింది. కుడి కాలి మీదుగా కారు వెళ్లిపోయింది. తాగిన మత్తులో కారు నడిపిన డ్రైవర్‌ కియారా జీవితంలో విషాదం నింపాడు. తీవ్రంగా గాయపడిన కియారాను ఆసుపత్రిలో చేర్చారు. ఆమెను బతికించగలిగారు కానీ, ఆమె కాలిని వైద్యులు రక్షించలేకపోయారు.

కాలు లేదన్న బాధ నుంచీ త్వరగానే కోలుకుంది కియారా. కృత్రిమ కాలు అమర్చడంతో దాని ద్వారా కొత్త జీవితాన్ని ఆరంభించింది. కియారా కృషి కారణంగా నేడు ఫ్యాషన్‌ ప్రపంచంలో తిరుగులేని మోడల్‌గా రాణిస్తోంది. ఇప్పుడు కియారా వయసు 27. టామీ హిల్‌ఫిగర్, టీన్‌ వోగ్‌ వంటి ప్రముఖ బ్రాండ్‌లకు మోడలింగ్‌ చేస్తుంది కియారా. తను కల గన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి శారీరక వైకల్యం కారణం కాలేదని చెప్పే కియారా నేటి అమ్మాయిలకు జీవితంలో ఏదైనా సాధించాలనే స్ఫూర్తిని నింపుతోంది.

దాచని కాలు
కృత్రిమ కాలును పెట్టుకున్నందుకు దుస్తులతో కప్పి పెట్టాలని, నలుగురి కళ్లలో పడకూడదని అనుకోవడం లేదు కియారా. వివిధ ఫొటో షూట్ల సమయంలో మోడలింగ్‌ చేసేటప్పుడు కియారా తన కృత్రిమ కాళ్లను దాచుకోదు. తనలాంటి ఇతర వికలాంగ అమ్మాయిలను ప్రోత్సహించడానికి ప్రతి ప్రదర్శనలోనూ తన కాలును కూడా చూపిస్తుంది. ‘కాలు పోగొట్టుకున్న తర్వాత చాలా నిరాశకు గురయ్యాను. కానీ, కృత్రిమ కాలు గురించి విన్నప్పుడు ఒక కొత్త ఆశ నాలో తలెత్తింది. మోడలింగ్‌ ప్రారంభించిన వెంటనే ఒక కాలు లేకపోవడం ఏమైనా తేడాను చూపుతుందా అని సరిచూసుకున్నాను. నా ప్రోస్తెటిక్‌ కాలితో కూడా నేను జీవితాన్ని ఆస్వాదించగలను అనిపించింది.

కృత్రిమపాద ఇంప్లాంట్‌ పొందిన కొద్దికాలానికే మోడల్‌గా మారాలని నిర్ణయంచుకున్నాను. మోడలింగ్‌ చేసేటప్పుడు నా కృత్రిమ కాలిని దాచవలసిన అవసరం లేదనిపించింది’ అని చెప్పే కియారా తన 18వ ఏట నుంచి మోడలింగ్‌ చేస్తోంది. తనలాగే శారీరక వైకల్యాలున్న అమ్మాయిల జీవితాల్లో వెలుగులు నింపడానికి పనిచేయాలనుకుంటంది. ఈ రోజు కూడా నాలాంటి అమ్మాయిలకు సమాజంలో తగిన హోదా లభిస్తుందని అంటోంది. వికలాంగుల కోసం చాలా పనులు చేయాల్సి ఉంది. ముఖ్యంగా వికలాంగ అమ్మాయిలకు సమాజంలో నిలదొక్కుకునే హక్కు ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే ఈ నా ప్రయత్నం అంటూ మోడలింగ్‌ ద్వారా తన సత్తా చాటుతోంది కియారా.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా