రోజు విడిచి రోజు  ఉపవాసంతో మేలే!

25 May, 2018 00:35 IST|Sakshi

అప్పుడప్పుడూ ఉపవాసం చేయడం ఆరోగ్యానికి మంచిదని ఇప్పటికే పలు పరిశోధనలు స్పష్టం చేశాయి. తాజాగా షికాగోలోని ఇల్లినాయి విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇంకో అడుగు ముందుకేసి రోజు విడిచి రోజు ఉపవాసం చేయడం శరీరంలో మంట/వాపును తగ్గిస్తుందని పరిశోధన పూర్వకంగా నిర్ధారించారు. మంట/వాపు తగ్గితే అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చునని, బరువు కూడా తగ్గవచ్చునని వీరు అంటున్నారు. కొంతమంది కార్యకర్తలను ఇలా రోజు విడిచి రోజు నిరాహారంగా ఉండాల్సిందిగా కోరిన శాస్త్రవేత్తలు పన్నెండు వారాల తరువాత వారి వివరాలు సేకరించారు. అధ్యయనం మొదలయ్యే సమయంతో పోలిస్తే వీరు వారానికి అరకిలో వరకూ బరువు తగ్గినట్లు గుర్తించారు. 

అయితే ఉపవాసం అంటే.. రోజంతా ఆహారమన్నది తీసుకోకుండా ఉండరు. మిగిలిన రోజులతో పోలిస్తే నాలుగోవంతు ఆహారం ఇంకోలా చెప్పాలంటే 400–600 కేలరీల ఆహారం అందించారు. ఇందులో కూడా 30% కేలరీలు కొవ్వుల ద్వారా 15% ప్రొటీన్లు, మిగిలిన 55% కార్బోహైడ్రేట్ల ద్వారా అందేలా చేశారు. దీంతో కార్యకర్తలకు ఆకలన్నది అనిపించలేదు. మొత్తమ్మీద తేలిందేమిటంటే.. ఈ రకమైన ఉపవాసం వల్ల శరీరంలోని కొవ్వు బాగా కరగడంతోపాటు కండరాల నష్టం తక్కువగా ఉందీ అని.  

మరిన్ని వార్తలు