నాన్న భుజాలపై బంగారు కొండ

10 Jan, 2020 01:49 IST|Sakshi

తండ్రీకూతుళ్లు

కడుపులో ఉన్న ఆడపిల్ల పుట్టేలోపే ఆ శిశువును కడుపులోనే చంపేయాలన్న ఆలోచన పుడుతున్న సమాజం ఇది. అటువంటిది.. తన కూతురికి ఇరవై ఏళ్ల వయసు వచ్చేవరకు వైద్యం చేయిస్తూనే ఉండాలని తెలిసి కూడా ఆ తండ్రి ఏ మాత్రం  తన కన్నబిడ్డను నిర్లక్ష్యం చేయకుండా ఆమెను చదివించడానికి భుజాలపై మోస్తూ కొండ ఎక్కి దిగుతూ ఉన్నాడంటే..  అతడిని ఆదర్శంగా చెప్పుకోవలసిందే. ఆ తండ్రి నిశాంత్‌. ఆ కూతురు నియా. వారిది కేరళ.

నియా ఒకటో తరగతి చదువుతోంది. ఏడేళ్ల వయసు. ఆ వయసు పిల్లలకు ఉదయాన్నే పళ్లు తోముకోవడం, పాలు తాగటం, చొక్కా గుండీలు పెట్టుకోవటం వంటి విషయాలు అతి సులభం. కాని నియాకు ఈ పనులు చేయటానికి ఇతరుల సహాయం కావాలి. కారణం.. నియా సెరిబ్రల్‌ పాల్సీ వ్యాధితో బాధపడుతోంది. దాదాపుగా అచేతన స్థితి. అయినప్పటికీ, తన బిడ్డను చదివించాల్సిందేనని నిశాంత్‌ ప్రతి రోజూ ఆమెను మెడ మీద ఎక్కించుకుని తాము ఉంటున్న వేనాడ్‌ నుంచి ఒక కిలోమీటరు మేర ‘ట్రెక్కింగ్‌’  చేసి, ఆమెను పాఠశాలకు చేర్చుతాడు. ఇంటికి వచ్చేటప్పుడూ అంతే. మళ్లీ అంత మేరా కొండలు, గుట్టలు దిగడం.

‘‘ఈ ప్రాంతమంతా రాళ్లగుట్టలతో నిండి ఉన్నప్పటికీ, ఇక్కడ గ్రామ ప్రజలు ఆర్థికంగా పేదవారు కావటం వల్ల, ఎక్కడికైనా నడిచే వెళ్తారు. నాకు వచ్చే చాలీచాలని డబ్బుతో, మేం ముగ్గురం ఏదో తినగలుగుతున్నాం. అలాగే నియాకు కావలసిన మందులు కొనగలుగుతున్నాను’’ అంటాడు నిశాంత్‌. అతడు ఆటోడ్రైవర్‌. తాముండే కురవ కాలనీ సమీపంలో ఉన్న చెంగుత్తాయ ప్రాంతానికి ఆటో నడుపుతాడు. కూతురికి ఎప్పుడూ దగ్గరగా ఉండటం కోసం ఎన్నో ఉద్యోగాలను విడిచిపెట్టేశాడు. నియాను ఇంటికి పరిమితం చేయకుండా, స్కూల్‌కి తీసుకువెళ్లటం కోసమే ఆటో నడుపుతున్నాడు. నియాకు రెండేళ్ల వయసు ఉన్నప్పుడు సెరిబ్రెల్‌ పాల్సీ బయటపడింది.

కొండ ఎక్కి దిగాల్సిందే
నియా చదువుతున్న పాఠశాల ఇంటి నుంచి ఐదు కి.మీ. దూరంలో ఉంటుంది. ఉదయం ఎనిమిదిన్నరకు ఇంటి దగ్గర బయలుదేరి, ఒక కిలోమీటరు మేరకు కూతుర్ని భుజాలపై ఎక్కించుకుని ట్రెకింగ్‌ చేసి, అక్కడ నుంచి ఆటోలో ఆమెను స్కూల్‌కి తీసుకువెళ్తాడు. ఆ సమయంలో చాలా జాగ్రత్తగా నడుస్తాడు. ఆమెను స్కూల్‌లో దింపేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఆటో నడిపి మళ్లీ సాయంత్రం నాలుగూ ముప్పైకి స్కూల్‌ విడిచే సమయానికి నియాను ఎక్కించుకుని వస్తాడు. అక్కడితో ముగిసిపోదు నిశాంత్‌ ప్రయాణం.

అక్కడ నుంచి ఆటోలో తీసుకువచ్చి, మళ్లీ ఒక కిలోమీటరు ట్రెకింగ్‌ చేయాల్సిందే. ఏదేమైనా ఆరు గంటల లోపు ఇల్లు చేరుకోవాలి. ‘‘ఆలస్యమైతే, ఆ చీకట్లో క్రూర జంతువులు మా మీద పడి చంపేసే అవకాశం ఉంది’’ అంటాడు నిశాంత్‌. అతను సంపాదించే దానిలో చాలావరకు కూతురు ఫిజియోథెరపీకే ఖర్చు అవుతుంది. ఆమె కోసం ఇప్పటివరకు 1.5 లక్షలు అప్పు చేశాడు. తిరిగి తీర్చటం చాలా కష్టంగా ఉంది. అప్పటికీ బ్యాంకు అధికారులు వడ్డీ నుంచి మినహాయింపు ఇచ్చారు. అయినా అసలు కూడా కట్టలేని స్థితిలో ఉన్నాడు నిశాంత్‌.

‘కష్టపడుతూనే ఉంటా’
నియా పరిస్థితి గమనించిన ఆ స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ థామస్‌ జాకబ్‌ క్రౌడ్‌ ఫండింగ్‌కి ఆన్‌లైన్‌లో దాతలకు విజ్ఞప్తి చేశారు. కొద్దికొద్దిగా డబ్బు అందుతోంది. రెండు నెలల క్రితం నియా కండరాలకు ఒక ఆపరేషన్‌ జరిగింది. ఆమెను చూసిన డాక్టర్లు, ‘‘నియాకు క్రమం తప్పకుండా వైద్యం చేయిస్తూంటే, ఆమెకు పద్దెనిమిదీ ఇరవై ఏళ్లు సంవత్సరాలు వచ్చేసరికి సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అవుతుంది’’ అంటున్నారు.

‘‘నా బిడ్డను ఆరోగ్యవంతురాలిని, విద్యావంతురాలిని చేయడానికి నేను నిరంతర పోరాటం చేస్తూనే ఉంటాను. ఆమె తనకై తను స్వేచ్ఛగా తిరిగేంత వరకు కష్టపడుతూనే ఉంటాను’’ అన్నాడు నిశాంత్‌. నియా తల్లి గృహిణి. బిడ్డ కోసం బయట తండ్రి ఎంత చేస్తున్నాడో.. ఇంట్లో ఆమె అంతా చేస్తోంది. – జయంతి

మరిన్ని వార్తలు