వారి పితృ భక్తి చిరస్మరణీయం

17 Jun, 2018 01:17 IST|Sakshi

తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాజ్యభోగాలను విడనాడి అడవులకు వెళ్లాడు రాముడు. తండ్రి ఆజ్ఞమేరకు పరశురాముడు తల్లిని గొడ్డలితో నరికి చంపాడు. తండ్రిౖయెన యయాతి మహారాజు సుఖంకోసం యవ్వనాన్నే ధారపోశాడు కుమారుడు పూరువు. తండ్రి చెప్పిన మాట ప్రకారం పాండుపుత్రులు ఐదుగురిని వివాహమాడింది ద్రౌపది. భీష్ముడు తండ్రికోసం వివాహం చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయాడు.

కేవలం తండ్రికి వచ్చిన స్వప్నాన్నే దైవాజ్ఞగా భావించి, తండ్రిమాటనునెరవేర్చడం కోసం బలి అవ్వడానికి సిద్ధపడ్డాడు ఇస్మాయీల్‌ ప్రవక్త. తండ్రి మాట మేరకు పాపభారాన్ని మోసేందుకు పరలోక భోగాలను వదులుకుని భూలోకం వచ్చిన జీసస్‌ శిలువ మరణం చెందాడు. నచికేతుడు తండ్రి మాటప్రకారం ఏకంగా యమలోకమే వెళ్లాడు. పితృదినోత్సవం సందర్భంగా వీరందరి త్యాగాలను స్మరించుకుందాం. నాన్న మాటను నిలబెడదాం!


వాజశ్రవమనే యజ్ఞం చేసిన వాజశ్రవుడు సర్వసంపదలనూ దానం చేశాడు. ఇక దానం చేయడానికి ఏమీ మిగలక పోవడంతో నచికేతుడు ‘‘తండ్రీ! నన్నెవరికి దానం ఇస్తావు?’’ అని పదే పదే అడుగుతుండడంతో చిరాకుతో ‘నిన్ను యముడికి దానం చేశాను ఫో’’అంటాడు. ఆ మాటకు కట్టుబబడ్డ నచికేతు యమలోకం వెళ్లాడు. ఆ సమయానికి యముడు అక్కడ లేకపోయేసరికి మూడురోజుల పాటు వేచి ఉన్నాడు.

యముడు రాగానే జరిగినదంతా తెలుసుకుని ముక్కుపచ్చలారని ఆ బాలుని పట్టుదలకు ముచ్చట పడి మూడు వరాలు కోరుకోమన్నాడు. మొదటి రెండూ లౌకికమైనవే కోరుకున్నప్పటికీ మూడవది మాత్రం జనన మరణ రహస్యాలను వివరించమని పట్టుబట్టడంతో కాదనలేక యముడు ఆ బాలునికి బ్రహ్మజ్ఞానోపదేశం చేశాడు. జరిగింది తెలుసుకుని తండ్రి అమితాశ్చర్యానందాలకు లోనై, దానిని గ్రంథస్థం చేయమని ఆదేశిస్తాడు. తండ్రి చెప్పిన మాటలను తు.చ తప్పకుండా ఆచరిస్తాడు నచికేతుడు. అదే అనంతరకాలంలో కఠోపనిషత్తుగా, నచికేతోపనిషత్తుగా పేరుగాంచింది.

పరశురాముడు: జమదగ్ని, రేణుకల కుమారుడు పరశురాముడు. జమదగ్నికి ఒకసారి భార్యమీద అపరిమితమైన కోపంవచ్చి, కుమారులను ఒక్కొక్కరుగా పిలిచి తల్లిని వధించమని ఆజ్ఞాపిస్తాడు. ప్రతి ఒక్కరూ అందుకు నిరాకరిస్తారు. దాంతో వారిని తన తపోమహిమతో భస్మీపటలం చేస్తాడు.

చివరిగా పరశురాముని వంతు వస్తుంది. పరశురాముడు పితృవాక్పాలన కోసం గొడ్డలి తీసుకుని తల్లిని వధిస్తాడు. జమదగ్ని మిక్కిలి సంతోషించి వరం కోరుకోమంటాడు. అప్పుడు పరశురాముడు తల్లిని, అన్నలను బతికించమని, కోపాన్ని విడనాడమని కోరడంతో జమదగ్ని పరశురాముని పితృభక్తిని, తెలివితేటలను మెచ్చుకుని, వారందరినీ బతికిస్తాడు.

శ్రవణ కుమారుడు: ఇతడు ఒక మునిబాలుడు. తల్లిదండ్రులు పుట్టుగుడ్డివారు. వయోభారంతో నడవలేని పరిస్థితులలో ఉన్నవారిని శ్రవణకుమారుడు తాను ఎక్కడికి వెళ్లినా కావడిలో కూర్చోబెట్టుకుని మోస్తూ తీసుకు వెళ్లేవాడు. ఓ రోజు తండ్రికి బాగా దాహం కావడంతో సొరకాయ బుర్ర తీసుకుని సమీపంలోని కొలనులోకి వెళ్లి, నీళ్లు ముంచుతుండగా, బుడబుడమని శబ్దం వస్తుంది.

అదేసమయంలో వేటకై వచ్చిన దశరథుడు ఆ శబ్దం విని ఏనుగు స్నానం చేస్తోందనుకుని శబ్దం వచ్చిన దిక్కుగా బాణం వదులుతాడు. ఆ బాణం దెబ్బతగిలిన శ్రవణకుమారుడు విలవిలలాడుతూ మరణిస్తాడు. ఆఖరి కోరికగా దశరథునితో దాహంతో అలమటించి పోతున్న నా తల్లిదండ్రులకు నీళ్లిచ్చి వారి దప్పిక తీర్చవలసిందిగా కోరి కన్నుమూస్తాడు. ఆ విధంగా ఆఖరి క్షణాల వరకు తల్లిదండ్రులకోసమే గడిపి పితౄణం తీర్చుకున్నాడు శ్రవణకుమారుడు.

ద్రౌపది: యజ్ఞకుండం నుంచి ఉద్భవించి, ఐదుగురు పురుషులను వివాహమాడి, స్వతంత్ర భావాలు కలిగి పతివ్రతగా ప్రసిద్ధి చెందింది ద్రౌపది. మత్స్యయంత్రాన్ని పడగొట్టిన వారికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని ద్రౌపదీ స్వయంవరం ప్రకటించాడు తండ్రి ద్రుపదుడు. అర్జునుడు మత్స్యయంత్రాన్ని పడగొట్టాడు.

ప్రకటన ప్రకారం ద్రౌపది అర్జునుని వివాహమాడితే సరిపోతుంది. కాని ద్రుపదుడు పాండవులయిదుగురినీ వివాహం చేసుకోమని ఆజ్ఞాపించాడు. తండ్రిమాటను జవదాటలేదు, అయిదుగురిని ఎందుకు వివాహం చేసుకోవాలని ప్రశ్నించలేదు ద్రౌపది. తండ్రి ఏది నిశ్చయించినా అది తన మంచికేనని మనసులో అనుకుంది. పాండవులను వివాహం చేసుకుని పంచభర్తృక అయ్యింది. కన్నతండ్రి ఋణం ఆ విధంగా తీర్చుకుంది ద్రౌపది.

రాముడు: పితృవాక్పాలనకు మారుపేరు శ్రీరామచంద్రుడు. తండ్రి మాట కోసం సర్వసౌఖ్యాలను విడిచి నార వస్త్రాలతో అడవులకు వెళ్లిన ఆదర్శమూర్తి. దశర థుని పెద్ద కుమారునిగా జన్మించిన రామునికి యుక్తవయసు రాగానే యువరాజ పట్టాభిషేకం నిర్ణయించాడు దశరథుడు. ఆ విషయాన్ని ముద్దుల భార్య కైకకు చెప్పడం కోసం ఆమె మందిరానికి వెళ్లాడు.

అప్పటికే మంధరమాటలతో విషంతో నిండిపోయిన కైక తన దగ్గరకు వచ్చిన దశరథుని – రాముడు పద్నాలుగేళ్లు వనవాసం చేయాలని, భరతునికి పట్టాభిషేకం చేయాలని కోరింది. ఆడినమాట తప్పని దశరథుడు కైక వరాలను నెరవేర్చవలసి వచ్చింది. తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాముడు అడవులకి వెళ్లి పితృవాక్పాలనకు మారుపేరుగా, ఆదర్శపురుషునిగా, చరిత్రలో చిరస్థాయిగానిలబడిపోయాడు. అందరికీ ఆరాధ్యుడయ్యాడు.

పూరువు: తండ్రి వార్థక్యాన్ని తాను తీసుకుని, తన యవ్వనాన్ని తండ్రికి ధారపోసిన తనయుడు పూరువు. ఈయన యయాతి, శర్మిష్ఠల మానసపుత్రుడు. యయాతి చక్రవర్తినహుషుడి కుమారుడు. పాండవుల పూర్వికులలో ఒకడు. సర్వ శాస్త్రాలను చదివి అనేక పుణ్యకార్యక్రమాలు చేపడుతూ, పితృదేవతలను పూజిస్తూ, యయాతి ప్రజలను జనరంజకంగా పరిపాలిస్తున్నాడు.

అయితే ఒకసారి అనుకోకుండా మామగారైన శుక్రాచార్యుని శాపం కారణంగా యయాతి వయసు మీరక ముందే ముసలివాడైపోతాడు. అయినప్పటికీ ఐహిక సుఖాలపై మమకారం వీడక, భౌతికమైన కోరికలతో బాధపడుతుంటాడు. భోగలాలసత్వం ఇంకా ఎక్కువగా ఉండటంతో కుమారులలో ఎవరైనా తన ముసలితనాన్ని తీసుకుని యవ్వనాన్ని ప్రసాదించమని అర్థిస్తాడు. ఇద్దరు కుమారులు అంగీకరించరు.

శర్మిష్ఠ కుమారుడైన పూరువు మాత్రమే తండ్రి కోరికను మన్నించి తన యవ్వనాన్ని ఇవ్వడానికి అంగీకరిస్తాడు. యయాతి పూరుని యవ్వనాన్ని స్వీకరించి, మరికొంతకాలం సుఖాలను అనుభవించి, పూరుని రాజ్యాభిషిక్తుణ్నిచేశాడు. తండ్రి ఆనందం కోసం పూరుడు చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయింది.

భీష్ముడు: తండ్రికోసం తాను వివాహం చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతానని భీషణ ప్రతిన చేసి, కురుపాండవులను కన్నతండ్రిలా పెంచి, విద్యాబుద్ధులు నేర్పి జీవితాన్ని  త్యాగం చేసిన వాడు దేవవ్రతుడు. శంతనుడికి, గంగాదేవికి పుట్టినవాడు దేవవ్రతుడు. ఓ సాయంసంధ్యలో శంతనుడు యమునా తీరాన విహరిస్తూ సుందరాకారంలో ఉన్న ఒక స్త్రీని చూసి ఆమె లావణ్యానికి ఆకర్షితుడయ్యాడు. ఆమె పేరు సత్యవతి. ఆమె పడవ నడిపే దాసరాజ కుమార్తె. ఆమెను శంతనునికి ఇవ్వడానికి దాసరాజు ఒక షరతు విధించాడు. అదేమంటే సత్యవతికి కలగబోయే కుమారునికే రాజ్యాభిషేకం చేయాలని.

పెద్దకుమారుని విడిచి అన్యులకు రాజ్యాభిషేకం చేయడం శంతనునికి మనస్కరించలేదు, అదే సమయంలో సత్యవతి మీద వ్యామోహమూ తగ్గలేదు. తండ్రి విచారానికి ఉన్న కారణం తెలుసుకున్న భీష్ముడు దాసరాజుఇంటికి వెళ్లి, సత్యవతికి కలగబోయే కుమారునికే రాజ్యాభిషేకం చేస్తామని మాట ఇచ్చాడు. దాసరాజుకు ఇంకా నమ్మకం కలిగించడం కోసం తాను బ్రహ్మచారిగా ఉండిపోతానని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. నాటి నుంచి భీష్ముడయ్యాడు. సర్వసుఖాలు, రాజ్యభోగాలు అనుభవించే అర్హత ఉండి కూడా భీష్ముడు తండ్రి కోసం చేసిన త్యాగం చిరస్మరణీయం.

– భాస్కర్, జయంతి

మరిన్ని వార్తలు