న్యాయ పోరాటం కన్నతండ్రి కన్నీరు 

19 Nov, 2019 07:38 IST|Sakshi
అబ్దుల్‌ లతీఫ్‌

టీనేజ్‌ దాటాక తల్లిదండ్రులు స్నేహితులైపోవాలని నియమం. మరి అధ్యాపకులు ఎంత ఆత్మీయులైపోవాలి? పిల్లలు ఇల్లు వదిలి వచ్చేది విద్యాలయాలను ఇల్లుగా భావించడం వల్లే. అక్కడ ఎంత ఆదరణ ఉండాలి. చాలా కష్టపడితే తప్ప, ప్రతిభ చూపితే తప్ప ఐ.ఐ.టి వంటి చోటుకు విద్యార్థులు చేరలేరు. అలాంటి విద్యార్థుల కోసం ఎంత స్నేహశీలత ఉండాలి? కాని ఆశిస్తున్నది వేరు. జరుగుతున్నది వేరు. పాతిమా లతీఫ్‌ ఆత్మహత్య చేస్తున్న హెచ్చరిక వేరు.

‘ఓ మనిషిని మారణాయుధాలతో పొడిచి, తుపాకీతో కాల్చి చంపితేనే హత్యకాదు. బలవన్మరణానికి పాల్పడే స్థాయిలో మానసికంగా వేధింపులకు గురిచేసినా హత్యగా పరిగణించాలి. అందుకే చెబుతున్నా... నా కుమార్తె ఫాతిమా లతీఫ్‌ది ఆత్మహత్య కాదు, హత్య’ అంటూ ఆవేదన చెందుతున్నారు ఆమె తండ్రి అబ్దుల్‌ లతీఫ్‌.ఆయన ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఫాతిమా ఆత్మహత్య చేసుకుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఫాతిమా మరణానికి ముందు దిగాలు పడి ప్రాణాలు తీసుకుంది. దీనికి కారణం ఆమె మీద వత్తిడి తీసుకు వచ్చిన ఒక ప్రొఫెసర్‌ అని అబ్దుల్‌ లతీఫ్‌ ఆరోపిస్తున్నారు.

‘నా దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయి. ముందు నిందితులను పట్టుకోండి’ అని అతడు తమిళనాడు ప్రభుత్వాన్ని కన్నీళ్లతో కోరుతున్నాడు.తమ పిల్లలు ప్రతిష్టాత్మకమైన ఐఐటీలో చదువుకుని ఉన్నతోద్యోగులు కావాలని చాలామంది తల్లిదండ్రులు ఆశించినట్టే అబ్దుల్‌ లతీఫ్, సబితా కూడా ఆశించారు. కాని ఆ కలలు చెదిరిపోయాయి. చెన్నై ఐఐటీలో పెద్ద కూతురు ఫాతిమా చేరిన ఐదు నెలల్లోనే ఫాతిమా హాస్టల్‌ గదిలో ఉరి వేసుకుని తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. కేరళ రాష్ట్రం కొల్లంకు చెందిన ఫాతిమా లతీఫ్‌ (19) ఈ ఏడాది మేలో చెన్నై ఐఐటీలో చేరింది. చురుకైన విద్యార్థినిగా కొద్ది రోజుల్లోనే అందరి అభిమానం పొందారు. ఐఐటీ ప్రాంగణంలోని ఉమెన్స్‌ హాస్టల్‌లో ఉంటూ ప్రతిరోజూ రాత్రి తల్లికి ఫోన్‌ చేసి నిద్రపోవడం ఫాతిమాకు అలవాటు. అయితే నవంబరు 9వ తేదీన ఎంతకూ కుమార్తె నుంచి ఫోన్‌ రాకపోవడంతో తల్లే చేసింది. ఎంతకూ ఫోన్‌ తీయకపోవడంతో స్నేహితురాళ్లకు ఫోన్‌ చేసింది. లోన గడియ వేసి ఉన్న స్థితిలో తలుపులు ఎంతగా బాదినా తీయక పోవడంతో హాస్టల్‌ సిబ్బంది వచ్చి పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఫాతిమా నిర్జీవంగా వేలాడుతూ ఉంది.

అక్టోబరులో జరిగిన పరీక్షలో తక్కువ మార్కులు రావడం వల్ల ఫాతిమా ప్రాణాలు తీసుకుందని కేసు దర్యాప్తు చేస్తున్న చెన్నై కొట్టూరుపురం పోలీసులు తేలిగ్గా తీసుకున్నారు. హడావిడిగా పోస్టుమార్టం పూరి ్తచేయించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అయితే ఫాతిమా సోదరి ఆయేషా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి స్విచ్‌ ఆఫ్‌లో ఉన్న సెల్‌ఫోన్‌ను ఆన్‌ చేసి పరిశీలించగా సుదర్శన్‌ పద్మనాభన్‌ అనే ప్రొఫెసర్‌ వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా సౌదీలో పనిచేస్తున్న తండ్రికి పంపిన ఎస్‌.ఎం.ఎస్‌ బయటపడింది. కేరళ రాష్ట్రంలో కొల్లం మేయర్‌గా ఉన్న తన తండ్రి స్నేహితుడు రాజేంద్రబాబు సహకారంతో కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఆయేషా తన అనుమానాలతో వినతిపత్రం సమర్పించింది.

వెంటనే కేరళ సీఎం తమిళనాడు సీఎం ఎడపాడికి ఉత్తరం రాయడంతో ఫాతిమా కేసు తమిళనాడు, కేరళ రాష్ట్రాల మధ్య వ్యవహారంగా మారి  విశ్వరూపం దాల్చింది. మాజీ సీబీఐ అధికారిని విచారణాధికారిగా నియమించినట్లు ప్రకటించిన చెన్నై పోలీసు కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌.. ప్రొఫెసర్‌ సుదర్శన్‌ పద్మనాభన్‌తోపాటూ ముగ్గురు ప్రొఫెసర్లకు సమన్లు పంపారు. మరోవైపు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు నిరసనలు, ఆందోళనలు సాగిస్తున్నాయి.  పదకొండుమంది చెన్నై ఐఐటీ విద్యార్థులు ప్రాంగణం లోపల సోమవారం దీక్ష చేపట్టారు. కేంద్ర ఉన్నతవిద్యాశాఖ ప్రతినిధుల బృందం ఆదివారం విచారణ జరిపి వెళ్లింది. 

నెల రోజుల వేదన
‘మా అక్క ఫాతిమా దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. అప్పటికే ఆమె డల్‌గా అయిపోయింది. మేమంతా హోమ్‌సిక్‌నెస్‌ అనుకున్నాం. చనిపోయే రెండు రోజుల ముందు సెమినార్‌ ఉందని చెప్పింది. అది సుదర్శన్‌ పద్మనాభన్‌ సెమినార్‌. అందులో ఆయన అందరు విద్యార్థుల పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడని నాతో చెప్పింది. మేము ఎక్కడ బాధ పడతామోనని ఆమె లోలోపల కుమిలిపోయింది. చివరకు ప్రాణాలు తీసుకుంది’ అని ఆయేషా పత్రికల వారితో చెప్పింది. ఫాతిమా తండ్రి మాత్రం కేవలం సుదర్శన్‌ పద్మనాభన్‌ వల్లే తన కుమార్తె మరణించినట్టు పత్రికల వారి వద్ద ఆరోపించాడు. ‘అతనొక్కడే కాదు.. ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రొఫెసర్లు ఈ కేసులో పట్టుబడాల్సి ఉంది’ అని అతడు అన్నాడు. మరోవైపు విద్యార్థి సంఘాలు ఫాతిమా ఒక మైనారిటీ స్టూడెంట్‌ కాబట్టే ఈ వివక్ష చోటు చేసుకొని ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పి ఉంటుందని ఆరోపిస్తున్నాయి. దేశమంతా ఫాతిమా తరఫున వారు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.

ఇది తొమ్మిదో ఆత్మహత్య 
చెన్నై ఐఐటీలో 2016 నుంచి ఇప్పటి వరకు తొమ్మిది మంది విద్యార్థినీ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం తల్లిదండ్రులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఫాతిమా లతీఫ్‌  ఆగష్టులో చేరి మూడునెలల్లోనే మానసిక క్షోభకు గురై ఈనెల 9వ తేదీన  ప్రాణాలు తీసుకోవడం రాష్ట్రంలో పెను సంచలనానికి దారితీసింది. చెన్నై ఐఐటీలో  ఇప్పటికి 8 ఆత్మహత్య సంఘటనలు చోటుచేసుకోగా ఫాతిమా ఉదంతం తొమ్మిదవది,  ఇలా వరుసగా ఆత్మహత్య సంఘటనలు జరుగుతున్నా ఐఐటీ యాజమాన్యం చేష్టలుడిగి చూస్తుండటం పట్ల తల్లిదండ్రులు ఆవేదనం చెందుతున్నారు.   ఇటీవలి కాలంలో కొత్తగా రిక్రూట్‌ అయిన ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన యువ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు దక్షిణాది విద్యార్థులపట్ల చిన్నచూపు చూస్తు న్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉత్తరాది విద్యార్థులను చేరదీయడం, దక్షిణాది విద్యార్థుల పట్ల పరుషంగా ప్రవర్తించడం యువ ప్రొఫెసర్లకు పరిపాటిగా మారినట్లు విమర్శలు వస్తున్నాయి. చెట్టులా నీడనివ్వాల్సిన అధ్యాపకుల మీద ఇలాంటి ఆరోపణలు రావడం కచ్చితంగా అప్రమత్తం కావాల్సిన విషయం.
– కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై

మరిన్ని వార్తలు